శివాజీ మహారాజు పట్టాభిషేకం - 'శివరాజ్యాభిషేకం' జరిగి 350 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు - ఛత్రపతి శివాజీ మహరాజ్ ను గన్న పవిత్రమైన మహారాష్ట్ర భూమిని, మహారాష్ట్రలోని నా సోదర సోదరీమణులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ పట్టాభిషేక ఉత్సవం మనందరికీ కొత్త చైతన్యాన్ని, శక్తిని అందిస్తుంది. మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఛత్రపతి శివాజీ మహరాజ్ పట్టాభిషేకం మూడు వందల యాభై సంవత్సరాల క్రితం జరిగిన ఆ యుగానికి చెందిన ఒక విశిష్టమైన ,విలక్షణమైన అధ్యాయం.
చరిత్రలో ఆ అధ్యాయం నుంచి ఉద్భవించిన 'స్వరాజ్యం' (స్వయంపాలన), 'సుశాసన్' (సుపరిపాలన), 'సమృద్ధి' (సమృద్ధి) వంటి గొప్ప కథలు నేటికీ మనకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. జాతీయ సంక్షేమం, ప్రజాసంక్షేమ సూత్రాలు శివాజీ మహారాజ్ పాలనకు పునాదిగా నిలిచాయి. ఛత్రపతి శివాజీ పాదాలకు ఎంతో భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నాను.
నేడు స్వరాజ్య తొలి రాజధాని రాయ్ గఢ్ కోట ఆవరణలో ఓ మహత్తర కార్యక్రమం జరుగుతోంది. మహారాష్ట్ర మొత్తం ఈ రోజును ఘనంగా జరుపుకుంటోంది. మహారాష్ట్రలో ఏడాది పొడవునా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ప్రయత్నానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు.
మిత్రులారా,
మూడువందల యాభై ఏళ్ల క్రితం ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగినప్పుడు అది స్వయంపాలన ఆకాంక్షకు, జాతీయత విజయ నినాదాలకు ప్రతీకగా నిలిచింది. భారతదేశ ఐక్యత, సమగ్రతకు ఆయన ఎల్లప్పుడూ ప్రాధాన్యమిచ్చారు. 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' దార్శనికతలో ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆదర్శాల ప్రతిబింబాన్ని మనం ఈ రోజు చూడవచ్చు.
మిత్రులారా,
చరిత్ర వీరుల నుంచి నేటి యుగంలో నాయకత్వాన్ని పరిశోధించే మేనేజ్ మెంట్ గురువుల వరకు ప్రతి యుగంలోనూ ఏ నాయకుడికైనా తమ దేశ ప్రజలను ఉత్తేజంగా, ఆత్మవిశ్వాసంతో ఉంచడం గొప్ప బాధ్యత. ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలో దేశ పరిస్థితులను ఊహించుకోవచ్చు. శతాబ్దాల బానిసత్వం, దురాక్రమణలు ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. దురాక్రమణదారులు సృష్టించిన దోపిడీ, పేదరికం సమాజాన్ని బలహీనపరిచాయి. మన సాంస్కృతిక కేంద్రాలపై దాడి చేయడం ద్వారా ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఇలాంటి సమయంలో ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపడం సవాలుతో కూడుకున్న పని. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ దురాక్రమణదారులను ఎదుర్కోవడమే కాకుండా ప్రజల హృదయాల్లో స్వపరిపాలన సాధ్యమనే నమ్మకాన్ని కలిగించారు. బానిసత్వ మనస్తత్వాన్ని తొలగించి జాతి నిర్మాణానికి ప్రజలను ప్రేరేపించారు. .
మిత్రులారా,
సైనిక శక్తిలో రాణించినా పరిపాలనా సామర్థ్యాలు లేని పాలకులు ఎందరో ఉన్నారని చరిత్రలో చూశాం. అదేవిధంగా, అద్భుతమైన పాలనకు పేరుగాంచినప్పటికీ బలహీనమైన సైనిక నాయకత్వాన్ని కలిగి ఉన్న పాలకులు ఉన్నారు. అయితే, ఛత్రపతి శివాజీ మహరాజ్ గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు. ఆయన స్వరాజ్యం (స్వపరిపాలన) స్థాపించడమే కాకుండా 'సూరజ్' (సుపరిపాలన)ను కూడా రూపొందించారు. ఆయన ధైర్యసాహసాలకు, పాలించే సామర్థ్యానికి పేరుపొందారు. అతి చిన్న వయసులోనే కోటలను జయించి, శత్రువులను ఓడించి, సైనిక నాయకుడిగా తన ఖ్యాతిని సుస్థిరం చేసుకున్నారు. మరోవైపు రాజుగా ప్రజా పరిపాలనలో సంస్కరణలు ప్రవేశపెట్టి సుపరిపాలన మార్గాన్ని ప్రదర్శించారు.
ఒకవైపు దురాక్రమణదారుల నుంచి తన రాజ్యాన్ని, సంస్కృతిని కాపాడుకుంటూనే, మరోవైపు దేశ నిర్మాణం కోసం సమగ్ర దార్శనికతను కూడా అందించారు. ఆయన దార్శనికత వల్లే చరిత్రలో ఇతర హీరోలకు భిన్నంగా నిలిచారు. . సంక్షేమ దృక్పథంతో పాలన సాగించి, ఆత్మగౌరవంతో జీవించే ఆత్మవిశ్వాసాన్ని ప్రజల్లో నింపారు. దీనితో పాటు, స్వయం పాలన, మతం, సంస్కృతి ,వారసత్వాన్ని బలహీనపరచడానికి ప్రయత్నించిన వారికి ఛత్రపతి శివాజీ మహారాజ్ గట్టి హెచ్చరికలు చేశారు. ఇది ప్రజలలో బలమైన నమ్మకాన్ని సృష్టించింది, స్వావలంబన భావాన్ని పెంపొందించింది. దేశ గౌరవాన్ని పెంచింది. రైతుల సంక్షేమం, మహిళా సాధికారత, సామాన్యులకు పాలనను అందుబాటులోకి తేవడం, పరిపాలనా వ్యవస్థ ఇలా ఏ విషయంలోనైనా ఆయన చర్యలు, పాలన, విధానాలు నేటికీ ఆచరణీయం గానే ఉన్నాయి.
మిత్రులారా,
ఛత్రపతి శివాజీ మహారాజ్ వ్యక్తిత్వంలో అనేక కోణాలు ఉన్నాయి, వారి జీవితం నిస్సందేహంగా ఏదో ఒక విధంగా మనలను ప్రభావితం చేస్తుంది. భారతదేశపు సముద్ర బలాన్ని గుర్తించి, నౌకాదళాన్ని విస్తరించి, ఆయన తన పరిపాలనా నైపుణ్యాలను ప్రదర్శించిన తీరు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఆయన నిర్మించిన సముద్ర కోటలు సముద్రపు భీకర అలలు, అల్లకల్లోల తుఫానుల మధ్య సగర్వంగా నిలబడి నేటికీ అబ్బురపరుస్తాయి. సముద్రపు ఒడ్డు నుండి పర్వతాల వరకు కోటలు నిర్మించి తన రాజ్యాన్ని విస్తరించారు. ఆ సమయంలో ఆయన ఏర్పాటు చేసిన నీటి యాజమాన్య వ్యవస్థలు ఇప్పటికీ నిపుణులకు అంతు చిక్కకుండానే ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితో భారత్ గత ఏడాది తన నౌకాదళాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తం చేయడం మన ప్రభుత్వ ప్రత్యేకత. భారత నౌకాదళ పతాకం నుంచి బ్రిటిష్ పాలన గుర్తింపును తొలగించి దాని స్థానంలో శివాజీ మహారాజ్ చిహ్నాన్ని చేర్చాం. ఇప్పుడు, ఈ జెండా సముద్రం , ఆకాశంలో రెపరెపలాడుతున్న నవ భారతదేశ వైభవాన్ని , గర్వాన్ని సూచిస్తుంది.
మిత్రులారా
ఛత్రపతి శివాజీ మహరాజ్ ధైర్యసాహసాలు, భావజాలం, న్యాయస్ఫూర్తి అనేక తరాలకు స్ఫూర్తినిచ్చాయి. ఆయన ధైర్యసాహసాలు, సైనిక నైపుణ్యాలు, శాంతియుత రాజకీయ వ్యవస్థ మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. ఛత్రపతి శివాజీ మహరాజ్ విధానాలపై చర్చలు, పరిశోధనలు నేటికీ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జరుగుతుండటం మనకు గర్వకారణం. నెల రోజుల క్రితం మారిషస్ లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర అమృత కాలం లో ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తవడం స్ఫూర్తిదాయక సందర్భం.
ఇన్నేళ్ల తర్వాత కూడా ఆయన నెలకొల్పిన విలువలు మనకు ప్రగతి బాటలు వేస్తున్నాయి. ఈ విలువల ఆధారంగానే మనం స్వాతంత్య్రం వచ్చిన 'అమృత్ కాల్' 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేయాలి.
ఛత్రపతి శివాజీ తన దార్శనికతతో కూడిన భారతదేశాన్ని నిర్మించాలనే కలలను సాకారం చేయడమే ఈ ప్రయాణం. ఈ ప్రయాణం 'స్వరాజ్యం' (స్వయం పాలన), 'సుశాసన్' (సుపరిపాలన), 'ఆత్మనిర్భరత' (స్వావలంబన) గురించి ఉంటుంది. ఈ ప్రయాణం అభివృద్ధి చెందిన భారతదేశం గురించి ఉంటుంది.
శివాజీ మహరాజ్ 'శివరాజ్యాభిషేకం' - పట్టాభిషేకానికి 350 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
జైహింద్ , భారత్ మాతాకీ జై!
డిస్ క్లెయిమర్ : ఇది ప్రధాన మంత్రి
ప్రసంగానికి సుమారు అనువాదం. ప్రధాన మంత్రి అసలు ప్రసంగం హిందీలో చేశారు.