‘‘ఆటల్లో ఓటమి అన్నదే లేదు... మనం గెలుస్తాం లేదా నేర్చుకుంటాం’’;
‘‘క్రీడలపై ప్రభుత్వ స్ఫూర్తి మైదానంలో ఆటగాళ్ల క్రీడాస్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది’’;
‘‘రాజస్థాన్ సాహస యువత దేశానికి ఎంతో కీర్తినార్జించి పెట్టారు’’;
‘‘మనం శక్తివంచన లేకుండా శ్రమిస్తే నైపుణ్యానికి హద్దుల్లేవన్నది క్రీడలు నేర్పే పాఠం’’;
‘‘రాష్ట్ర ప్రజలకు సాధికారత.. జీవన సౌలభ్య కల్పనే ద్వంద్వ చోదక ప్రభుత్వ లక్ష్యం’’

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పాలి లోక్‌స‌భ‌ స్థానం పరిధిలో క్రీడా మహోత్సవం ముగింపు కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఈ పోటీల్లో అద్భుత ప్రతిభ  ప్రదర్శించారంటూ క్రీడాకారులను ఆయన అభినందించారు. ‘‘ఆటల్లో పరాజయం అన్నదే ఉండదు.. మనం విజయం సాధిస్తాం.. లేదా అనుభవం సంపాదిస్తాం; కాబట్టే క్రీడాకారులతోపాటు వారి శిక్షకులు, కుటుంబ సభ్యులకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. యువతరం ముందంజతోపాటు దేశాభివృద్ధిలో క్రీడల ప్రాముఖ్యాన్ని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ‘‘పార్లమెంటు స్థానం స్థాయి క్రీడా మహోత్సవంలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం నేడు క్రీడాకారులకే కాకుండా, ప్రతి యువకుడికీ ఒక గుర్తింపుగా మారింది. క్రీడలపై ప్రభుత్వ స్ఫూర్తి మైదానంలో క్రీడాకారుల స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. ఇటువంటి క్రీడా పోటీల నిర్వహణలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలోని జిల్లాలు, రాష్ట్రాలలోగల లక్షలాది ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఈ క్రీడా మహోత్సవం ఒక వేదికగా నిలుస్తున్నదని తెలిపారు. అలాగే కొత్త, వర్ధమాన క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తూ సానపెట్టడంలోనూ ఇదొక మాధ్యమంగా మారిందన్నారు. ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకంగా పోటీల నిర్వహణ గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు.

   ఈ క్రీడా మహోత్సవంలో పాలీ లోక్‌స‌భ‌ స్థానం పరిధిలోని 1100 మందికిపైగా పాఠశాల విద్యార్థులు సహా 2 లక్షల మందికిపైగా క్రీడాకారులు పాల్గొనడాన్ని ప్రధాని మోదీ అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా క్రీడాకారులకు అందిన అసాధారణ ప్రోత్సాహాన్ని, అవకాశాలను ఆయన గుర్తుచేశారు. ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయడంలో పాలీ పార్లమెంటు సభ్యుడు శ్రీ పి.పి.చౌదరి చేసిన కృషిని ప్రధాని మోదీ అభినందించారు. రాజస్థాన్ యువతరం ముందంజతోపాటు దేశ ప్రగతిలో క్రీడలకుగల కీలకపాత్రను నొక్కిచెబుతూ- ‘‘రాజస్థాన్ సాహస యువత సాయుధ దళాల్లో తమ పరాక్రమ ప్రదర్శనతోనే కాకుండా క్రీడాల్లోనూ రాణిస్తూ దేశానికి కీర్తిప్రతిష్టలు ఆర్జించి పెట్టారు. ఇక ప్రస్తుత క్రీడాకారులైన మీరు, ఈ వారసత్వాన్ని కొనసాగించగలరని నేను గట్టిగా నమ్ముతున్నాను’’ అని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. క్రీడలకుగల పరివర్తనాత్మ శక్తిని ప్రస్తావిస్తూ- ‘‘విజయాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడంలోనే కాకుండా స్వీయ ప్రగతి కోసం ఆ స్ఫూర్తితో సాగించే నిరంతర కృషిలోనూ క్రీడానందం లభిస్తుంది. మనం శక్తివంచన లేకుండా శ్రమిస్తే నైపుణ్యానికి హద్దులు లేవన్నది క్రీడలు మనకు నేర్పే పాఠం’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

 

   సామాజిక రుగ్మతల నుంచి యువతను దూరంగా ఉంచడంలో క్రీడా శక్తి ఎంతో గొప్పదని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. క్రీడలతో దృఢత్వం కలుగుతుంది... ఏకాగ్రత పెరుగుతుంది... స్వీయాభివృద్ధిలో క్రీడల పాత్ర ఎనలేనిది’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. యువజన సంక్షేమంపై ప్రభుత్వ నిబద్ధతను నొక్కిచెబుతూ- ‘‘ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర లేదా కేంద్ర స్థాయిలో యువత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తోంది. క్రీడాకారులకు మరిన్ని అవకాశాల కల్పన, ఎంపిక ప్రక్రియల్లో పారదర్శకతకు భరోసా, వనరుల కేటాయింపు-సద్వినియోగం ద్వారా దేశంలోని క్రీడాకారులకు ఎంతగానో చేయూతనిస్తోంది’’ అని ప్రధానమంత్రి వివరించారు.

   గడచిన దశాబ్ద కాలంలో క్రీడా బడ్జెట్‌ మూడు రెట్లు పెరిగిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అలాగే ‘టాప్స్’ సహా వివిధ పథకాల కింద వందలాది క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందించడంతోపాటు దేశవ్యాప్తంగా అనేక క్రీడా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. క్రీడా భారతం (ఖేలో ఇండియా) కార్యక్రమం కింద 3,000 మందికిపైగా క్రీడాకారులకు నెలకు రూ.50,000 వంతు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. అట్టడుగు స్థాయిలో ఏర్పాటు చేసిన దాదాపు 1,000 క్రీడా భారతం శిక్షణ కేంద్రాల్లో లక్షలాది క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారని ఆయన చెప్పారు. ఇటీవలి ఆసియా క్రీడల్లో 100కుపైగా పతకాలతో సరికొత్త రికార్డు సృష్టించిన భారత క్రీడాకారుల బృందాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.

   పార్లమెంటులో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ యువతను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. ‘‘రహదారులు, రైల్వేల వంటి ఆధునిక మౌలిక సదుపాయాలపై రూ.11 లక్షల కోట్ల మేర పెట్టుబడితో యువతకు అధిక ప్రయోజనం కలుగుతుంది. అలాగే 40,000 వందే భారత్ తరహా బోగీల ప్రవేశంపై ప్రకటన, ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి వగైరా కార్యక్రమాలతో అత్యధికంగా లబ్ధి పొందేది యువతరమే’’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఉపాధి అవకాశాల సృష్టి, వ్యవస్థాపనకు చేయూత, క్రీడలుసహా వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం వంటి కార్యక్రమాలతో యువత సాధికారతపై ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. అంకుర సంస్థలకు పన్ను మినహాయింపు కోసం రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటు గురించి కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. పాలి పరిధిలో చేపట్టిన కీలక అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ప్రధాని మోదీ విశదీకరించారు. ఈ మేరకు దాదాపు రూ.13,000 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణం, రైల్వే స్టేషన్లు/వంతెనల అభివృద్ధి, 2 కేంద్రీయ విద్యాలయాలు, పాస్‌పోర్ట్ సెంటర్, వైద్య కళాశాలలు సహా విద్యా-ఐటీ కేంద్రాల ఏర్పాటు వంటి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ఉదాహరించారు. ‘‘పాలి ప్రజల జీవన సౌలభ్యం పెంపు, వారి సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టబడ్డాయి’’ అని ఆయన తెలిపారు.

   చివరగా- సమగ్ర అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఒక్క రాజ‌స్థాన్‌లో మాత్ర‌మేగాక దేశవ్యాప్తంగా పౌరులందరికీ... ముఖ్యంగా యువతరానికి సాధికారత కల్పనపై ప్రభుత్వ నిబద్ధతను ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. యువతలో దృఢ దీక్ష, పునరుత్థాన స్ఫూర్తిని పెంపొందించడంలో క్రీడల కీలక పాత్రను నొక్కిచెప్పారు. మొత్తంమీద దేశ ప్రగతి, సౌభాగ్యాలకు క్రీడలు దోహదం చేస్తాయంటూ ఆయన తన ప్రసంగం ముగించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi