ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 1న దుబాయ్‌లో కాప్-28 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి (యుఎన్ఎస్జి) మాననీయ ఆంటోనియో గుటెరెజ్ తో సమావేశమయ్యారు.
భారత జి20 అధ్యక్ష బాధ్యతల నిర్వహణలో ఐరాస ప్రధాన కార్యదర్శి ఇచ్చిన మద్దతుపై ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. వాతావరణ మార్పు సమస్య పరిష్కారంలో లక్ష్యాల సాధన దిశగా భారత్ చేపట్టిన కార్యక్రమాలు, చర్యల పురోగమనాన్ని ఆయన ప్రముఖంగా వివరించారు.
వాతావరణ కార్యాచరణ, వాతావరణ నిధుల సమీకరణ, సాంకేతికత బదిలీతోపాటు ఐరాస సహా బహుపాక్షిక పాలన, ఆర్థిక సంస్థలలలో సంస్కరణల సంబంధిత దక్షిణార్థ గోళం ప్రాధాన్యాలు, సమస్యలపై నాయకులిద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
జి20 అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన సందర్భంగా సుస్థిర ప్రగతి, వాతావరణ చర్యలు, ఎండిబి సంస్కరణలు, విపత్తు నిర్వహణ రంగాల్లో భారత్ కృషిని ఐరాస ప్రధాన కార్యదర్శి అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి ప్రతిపాదించిన హరిత క్రెడిట్ కార్యక్రమాన్ని ఆయన స్వాగతించారు. భారత జి20 అధ్యక్ష బాధ్యతల విజయాలను ఐరాస నిర్వహించే భవిష్యత్ శిఖరాగ్ర సదస్సు-2024 ద్వారా ముందుకు తీసుకెళ్లడంలో భారత్ తో కలిసి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.