I thank the countrymen for having reiterated their unwavering faith in our Constitution and the democratic systems of the country: PM Modi
The campaign to plant trees in the name of mother will not only honour our mother, but will also protect Mother Earth: PM Modi
Every Indian feels proud when such a spread of Indian heritage and culture is seen all over the world: PM Modi
I express my heartfelt gratitude to all the friends who participated on Yoga Day: PM Modi
We do not have to make Yoga just a one-day practice. You should do Yoga regularly: PM Modi

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ఫిబ్రవరి నుండి మనం అందరం ఎదురుచూస్తున్న రోజు ఇప్పుడు వచ్చింది. ‘మన్ కీ బాత్’ ద్వారా మీ మధ్యకు-  నా కుటుంబ సభ్యుల మధ్యకు- మరోసారి వచ్చాను. చాలా మనోహరమైన లోకోక్తి ఒకటి  ఉంది - 'ఇతి విదా పునర్మిలనాయ్'.  దాని అర్థం కూడా అంతే మనోహరంగా ఉంది. “మళ్ళీ కలవడానికి నేను సెలవు తీసుకుంటాను” అని ఆ లోకోక్తి అర్థం. ఈ స్ఫూర్తితోనే ఫిబ్రవరిలో ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ కలుస్తానని చెప్పాను.  ఈరోజు ‘మన్‌కీ బాత్‌’తో మళ్ళీ మీ మధ్యకు వచ్చాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని, మీ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నారని విశ్వసిస్తున్నాను. ఇప్పుడు రుతుపవనాలు కూడా వచ్చాయి. రుతుపవనాలు వస్తే మనసు కూడా ఆనందంగా ఉంటుంది.  తమ పని ద్వారా సమాజంలో, దేశంలో మార్పు తీసుకువస్తున్న దేశప్రజల గురించి ఈ రోజు నుండి మరోసారి 'మన్ కీ బాత్' లో మనం చర్చిస్తాం. మన సుసంపన్న సంస్కృతి గురించి, మహిమాన్విత చరిత్ర గురించి మాట్లాడుకుంటాం. వికసిత భారతదేశం కోసం ప్రయత్నాలను చర్చిస్తాం.

మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను.  కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.

మిత్రులారా! మన రాజ్యాంగంపై, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలపై తమ అచంచలమైన విశ్వాసాన్ని మరోసారి ప్రకటించినందుకు ఈ రోజు నేను దేశప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఏడాది 2024లో జరిగిన ఎన్నికలు ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికలు. ఇంత భారీ స్థాయి ఎన్నికలు ప్రపంచంలో ఏ దేశంలో జరగలేదు. ఈ ఎన్నికల్లో 65 కోట్ల మంది ప్రజలు ఓట్లు వేశారు. ఇందుకోసం ఎన్నికల సంఘాన్ని, ఓటింగు ప్రక్రియతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ నేను అభినందిస్తున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా! ఈరోజు జూన్ 30వ తేదీ చాలా ముఖ్యమైన రోజు. మన ఆదివాసీ సోదర సోదరీమణులు ఈ రోజును 'హూల్ దినోత్సవం'గా జరుపుకుంటారు. ఈ రోజు పరాయి పాలకుల దౌర్జన్యాలను తీవ్రంగా వ్యతిరేకించిన పరాక్రమశాలులు సిద్ధో-కాన్హుల తిరుగులేని ధైర్యంతో ముడిపడి ఉంది. ధైర్యవంతులైన సిద్ధో- కాన్హు వేలాది మంది సంథాలీ సహచరులను ఏకం చేసి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఇది ఎప్పుడు జరిగిందో మీకు తెలుసా? ఇది 1855లో జరిగింది. అంటే 1857లో జరిగిన భారతదేశ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి రెండేళ్ల ముందన్నమాట. జార్ఖండ్‌లోని సంథాల్ పరగణాలో మన ఆదివాసీ సోదర సోదరీమణులు విదేశీ పాలకులకు వ్యతిరేకంగా అప్పుడు ఆయుధాలు చేపట్టారు. ఆ  కాలంలో బ్రిటిష్ వారు మన సంథాలీ సోదర సోదరీమణులపై అనేక అఘాయిత్యాలకు పాల్పడ్డారు. వారిపై అనేక ఆంక్షలు కూడా విధించారు. ఈ పోరాటంలో అద్భుతమైన ధైర్యసాహసాలు ప్రదర్శించిన వీరులు సిద్ధో, కన్హూ వీరమరణం పొందారు. జార్ఖండ్ నేలలోని ఈ అమర పుత్రుల త్యాగం ఇప్పటికీ దేశప్రజలకు స్ఫూర్తినిస్తుంది. వారికి అంకితం చేసిన సంథాలీ భాషలోని పాట నుండి కొద్ది భాగం విందాం .

-ఆడియో క్లిప్-

నా ప్రియమైన మిత్రులారా! ప్రపంచంలో అత్యంత విలువైన సంబంధం ఏది అని నేను మిమ్మల్ని అడిగితే మీరు ఖచ్చితంగా ‘అమ్మ’ అని చెప్తారు. మనందరి జీవితాల్లో ‘అమ్మ’కు అత్యున్నత స్థానం ఉంది. దుఃఖాన్ని భరించి కూడా తల్లి తన బిడ్డను పోషిస్తుంది. ప్రతి తల్లి తన బిడ్డపై ప్రేమను చూపిస్తుంది. జన్మనిచ్చిన తల్లి ప్రేమ రుణం లాంటిది. దీన్ని ఎవరూ తీర్చుకోలేరు. అమ్మకి మనం ఏమీ ఇవ్వలేం. కానీ ఇంకేమైనా చేయగలమా అని ఆలోచించాను. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమం పేరు - 'ఏక్ పేడ్ మా కే నామ్'- ‘అమ్మ పేరుపై ఒక చెట్టు’. మా అమ్మ పేరు మీద నేను కూడా ఒక చెట్టు నాటాను.   దేశప్రజలందరికీ- ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. వారి తల్లితో కలిసి లేదా ఆమె పేరు మీద ఒక చెట్టు నాటాలనేది ఆ విజ్ఞప్తి. తల్లి జ్ఞాపకార్థం లేదా ఆమె గౌరవార్థం మొక్కలు నాటాలనే ప్రచారం వేగంగా జరగడం చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రజలు తమ తల్లితో కలిసి లేదా ఆమె ఫోటోతో చెట్లను నాటుతున్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి కోసం మొక్కలు నాటుతున్నారు. వారు ధనికులు కావచ్చు. పేదవారు కావచ్చు. ఉద్యోగం చేసే మహిళ కావచ్చు. లేదా గృహిణి కావచ్చు. ఈ ఉద్యమం  ప్రతి ఒక్కరికీ తమ తల్లి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తీకరించడానికి సమాన అవకాశాన్ని కల్పించింది. #Plant4Mother, #एक_पेड़_मां_के_नाम అనే హ్యాష్ ట్యాగులతో తమ ఫోటోలను పంచుకుంటూ ఇతరులకు స్ఫూర్తినిస్తున్నారు.

మిత్రులారా! ఈ ఉద్యమం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంటుంది. భూమి కూడా మనల్ని తల్లిలా చూసుకుంటుంది. భూమాత మనందరి జీవితాలకు  ఆధారం. కాబట్టి మాతృభూమిని కూడా చూసుకోవడం మన కర్తవ్యం. తల్లి పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం మన తల్లిని గౌరవించడమే కాకుండా భూమిని కాపాడుతుంది. గత దశాబ్దంలో అందరి కృషి కారణంగా భారతదేశంలో అటవీ విస్తీర్ణం అపూర్వ రీతిలో పెరిగింది. అమృత మహోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 60 వేలకు పైగా అమృత సరోవరాలను కూడా నిర్మించారు. ఇకపై కూడా అమ్మ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి.

నా ప్రియమైన దేశవాసులారా! దేశంలోని వివిధ ప్రాంతాలకు రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ వర్షాకాలంలో అందరూ తమ ఇంట్లో వెతుకులాట ప్రారంభించిన వస్తువు ‘గొడుగు’. ఈరోజు ‘మన్ కీ బాత్’లో నేను మీకు ప్రత్యేకమైన గొడుగుల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ గొడుగులు మన కేరళలో తయారుచేస్తారు. నిజానికి కేరళ సంస్కృతిలో గొడుగులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అక్కడి అనేక సంప్రదాయాలు, ఆచారాలలో గొడుగులు ఒక ముఖ్యమైన భాగం. నేను చెప్తున్న గొడుగులు ‘కార్థుంబీ గొడుగులు’. అవి కేరళలోని అట్టాపడిలో తయారవుతాయి. ఈ రంగురంగుల గొడుగులు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రత్యేకత ఏమిటంటే ఈ గొడుగులను మన కేరళ ఆదివాసీ  సోదరీమణులు తయారు చేస్తారు. దేశవ్యాప్తంగా ఈ గొడుగులకు డిమాండ్ పెరుగుతోంది. ఆన్‌లైన్‌లో కూడా విక్రయిస్తున్నారు. ఈ గొడుగులను 'వట్టాలక్కీ సహకార వ్యవసాయ సొసైటీ' పర్యవేక్షణలో తయారు చేస్తారు. ఈ సొసైటీ నాయకత్వం మహిళా శక్తిదే. అట్టాపడి ఆదివాసీ సమాజం మహిళల నాయకత్వంలో వ్యవస్థాపకతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. ఈ సొసైటీ వెదురు-హస్తకళ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ వ్యక్తులు రిటైల్ విక్రయకేంద్రాన్ని, సంప్రదాయ కేఫ్‌ను తెరవడానికి సిద్ధమవుతున్నారు. వారి లక్ష్యం తమ గొడుగులు, ఇతర ఉత్పత్తులను విక్రయించడం మాత్రమే కాదు- వారు తమ సంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. కేరళలోని ఒక చిన్న గ్రామం నుండి బహుళజాతి కంపెనీల వరకు కార్థుంబీ గొడుగులు తమ  ప్రయాణాన్ని పూర్తి చేస్తున్నాయి. స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది?

నా ప్రియమైన దేశప్రజలారా! వచ్చే నెలలో ఈ సమయానికి ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభమవుతాయి. ఒలింపిక్ క్రీడల్లో భారత ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు మీరందరూ కూడా ఎదురు చూస్తారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టోక్యో ఒలింపిక్స్ జ్ఞాపకాలు ఇప్పటికీ మనందరి మదిలో మెదులుతూనే ఉన్నాయి. టోక్యోలో మన ఆటగాళ్ల ప్రదర్శన ప్రతి భారతీయుడి హృదయాన్ని గెలుచుకుంది. టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత నుంచి మన క్రీడాకారులు ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నారు. ఆటగాళ్లందరినీ కలుపుకుంటే- వారంతా దాదాపు తొమ్మిది వందల అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. ఇది చాలా పెద్ద సంఖ్య.

మిత్రులారా! మీరు ప్యారిస్ ఒలింపిక్స్‌లో మొదటిసారిగా కొన్ని విషయాలను చూస్తారు. షూటింగ్‌లో మన క్రీడాకారుల ప్రతిభ వెలుగులోకి వస్తోంది. టేబుల్ టెన్నిస్‌లో పురుషులు, మహిళల రెండు జట్లు అర్హత సాధించాయి. భారత షాట్‌గన్ టీమ్‌లో మన షూటర్ అమ్మాయిలు కూడా ఉన్నారు. రెజ్లింగ్, గుర్రపు స్వారీలలో మన జట్టులోని క్రీడాకారులు గతంలో ఎన్నడూ పాల్గొనని విభాగాల్లో కూడా ఇప్పుడు పోటీపడుతున్నారు. దీన్ని బట్టి ఈసారి క్రీడల్లో మరో స్థాయి ఉత్కంఠను అనుభూతి చెందవచ్చని మీరు ఊహించవచ్చు. మీకు గుర్తుండవచ్చు. కొన్ని నెలల కిందట ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మన క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన చూపారు. చెస్, బ్యాడ్మింటన్‌లలో కూడా మన క్రీడాకారులు జెండా ఎగురవేశారు. ఇప్పుడు ఒలింపిక్స్‌లో కూడా మన క్రీడాకారులు రాణిస్తారని దేశమంతా ఎదురుచూస్తోంది. ఈ క్రీడల్లో పతకాలు సాధిస్తాం. దేశప్రజల హృదయాలను కూడా గెలుచుకుంటాం. రాబోయే రోజుల్లో నేను కూడా భారత జట్టును కలిసే అవకాశం రాబోతోంది. మీ తరఫున వారిని ప్రోత్సహిస్తాను. అవును మరి.. ఈసారి మన హ్యాష్‌ట్యాగ్ #Cheer4Bharat. ఈ హ్యాష్‌ట్యాగ్ ద్వారా మన ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ, వారిని ప్రోత్సహిస్తూనే ఉండాలి. ఈ ఊపును కొనసాగించండి. మీ ఈ ప్రోత్సాహం భారతదేశ మాయాజాలాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంలో సహాయపడుతుంది.

నా ప్రియమైన దేశప్రజలారా! నేను మీ అందరి కోసం ఒక చిన్న ఆడియో క్లిప్ వినిపిస్తున్నాను.

-ఆడియో క్లిప్-

ఈ రేడియో కార్యక్రమం విని మీరు కూడా ఆశ్చర్యపోయారు కదా!? రండి...  దీని వెనుక ఉన్న మొత్తం కథను మీకు చెప్తాను. నిజానికి ఇది కువైట్ రేడియో ప్రసారానికి సంబంధించిన క్లిప్. ఇప్పుడు మనం కువైట్ గురించి మాట్లాడుకుంటున్నామని మీరు అనుకుంటారు. అక్కడికి హిందీ ఎలా వచ్చింది? వాస్తవానికి కువైట్ ప్రభుత్వం తన జాతీయ రేడియోలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అది కూడా హిందీలో. 'కువైట్ రేడియో'లో ప్రతి ఆదివారం అరగంట పాటు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో భారతీయ సంస్కృతికి సంబంధించిన విభిన్న అంశాలు ఉన్నాయి. కళా ప్రపంచానికి సంబంధించిన మన  సినిమాలు, చర్చలు అక్కడి భారతీయ సమాజంలో బాగా ప్రాచుర్యం పొందాయి. కువైట్ స్థానిక ప్రజలు కూడా దీనిపై చాలా ఆసక్తి చూపుతున్నారని నాకు తెలిసింది. ఈ అద్భుతమైన చొరవ ప్రదర్శించినందుకు కువైట్ ప్రభుత్వానికి, ప్రజలకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా! నేడు ప్రపంచ వ్యాప్తంగా మన సంస్కృతిని కీర్తిస్తున్న తీరు పట్ల ఏ భారతీయుడు సంతోషించకుండా ఉండగలడు? ఉదాహరణకు తుర్క్‌మెనిస్తాన్‌లో ఈ సంవత్సరం మేలో అక్కడి జాతీయ కవి 300వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రపంచంలోని 24 మంది ప్రముఖ కవుల విగ్రహాలను తుర్క్ మెని స్తాన్‌ అధ్యక్షుడు ఆవిష్కరించారు. ఈ విగ్రహాలలో ఒకటి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ది  కావడం విశేషం. ఇది గురుదేవుడికి గౌరవం. భారతదేశానికి గౌరవం. అదేవిధంగా జూన్ నెలలో రెండు కరేబియన్ దేశాలు సూరినామ్, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడిన్స్ తమ భారతీయ వారసత్వాన్ని పూర్తి ఉత్సాహంతో, ఉల్లాసంతో జరుపుకున్నాయి. సూరినామ్‌లోని భారతీయ సమాజం ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని ఇండియన్ అరైవల్ డేగా, ప్రవాస భారతీయుల దినోత్సవంగా జరుపుకుంటుంది. అక్కడ హిందీతో పాటు భోజ్‌పురి కూడా ఎక్కువగా మాట్లాడతారు. సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడిన్స్‌లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన మన సోదర సోదరీమణులు దాదాపు ఆరు వేల మంది ఉంటారు. వారందరూ తమ వారసత్వం గురించి చాలా గర్వపడుతున్నారు. జూన్ 1వ తేదీన వారందరూ ఇండియన్ అరైవల్ డేని ఘనంగా జరుపుకున్న విధానంలో ఈ భావన స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. భారతీయ వారసత్వం, సంస్కృతులకు సంబంధించిన అటువంటి విస్తరణ ప్రపంచవ్యాప్తంగా కనిపించినప్పుడు ప్రతి  భారతీయుడూ గర్వపడుతున్నాడు.

మిత్రులారా! ఈ నెల యావత్ ప్రపంచం 10వ యోగా దినోత్సవాన్ని ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంది. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. కశ్మీర్‌లో యువతతో పాటు సోదరీమణులు, అమ్మాయిలు కూడా యోగా దినోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగా దినోత్సవ వేడుకలు కొనసాగుతున్న కొద్దీ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. యోగా దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. సౌదీ అరేబియాలో మొదటిసారిగా ఒక మహిళ అల్ హనౌఫ్ సాద్ గారు ఉమ్మడి యోగా సాధన కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఒక సౌదీ మహిళ ప్రధాన యోగా సెషన్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈసారి యోగా దినోత్సవం సందర్భంగా ఈజిప్టులో ఫొటోల పోటీ నిర్వహించారు. నైలు నది తీరం వెంబడి, ఎర్ర సముద్రం బీచ్‌లలో, పిరమిడ్‌ల ముందు లక్షలాది మంది యోగా సాధన చేస్తున్న చిత్రాలు బాగా ప్రాచుర్యం పొందాయి. చలవరాతి బుద్ధ విగ్రహానికి ప్రసిద్ధి చెందిన మయన్మార్‌లోని మారావిజయ పగోడా కాంప్లెక్స్ ప్రపంచంలోనే పేరు పొందింది. అక్కడ కూడా జూన్ 21వ తేదీన అద్భుతమైన యోగా కార్యక్రమం జరిగింది. బహ్రెయిన్‌లో దివ్యాంగ బాలల కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శ్రీలంకలోని యునెస్కో వారసత్వ ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన గాల్ ఫోర్ట్‌లో ఒక అద్భుతమైన యోగా కార్యక్రమం కూడా జరిగింది. అమెరికాలోని న్యూయార్క్‌లోని అబ్జర్వేషన్ డెక్‌పై కూడా ప్రజలు యోగా చేశారు.  మార్షల్ ఐలాండ్స్‌లో తొలిసారిగా భారీ ఎత్తున నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమంలో అక్కడి దేశ అధ్యక్షురాలు  కూడా పాల్గొన్నారు. భూటాన్‌లోని థింఫులో కూడా ఒక భారీ స్థాయి యోగా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో నా స్నేహితుడు ప్రధానమంత్రి టోబ్‌గే గారు కూడా పాల్గొన్నారు. అంటే మనమందరం ప్రపంచంలోని ప్రతి మూలమూలనా యోగా చేసే వ్యక్తుల విహంగ వీక్షణం  చేశాం. యోగా దినోత్సవంలో పాల్గొన్న మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గతం నుండి నేను మిమ్మల్ని కోరుకుంటున్న విషయం ఒకటుంది. మనం యోగాను ఒక్కరోజు మాత్రమే సాధన చేసి ఆపేయకూడదు. క్రమం తప్పకుండా యోగా చేయాలి. ఫలితంగా మీరు ఖచ్చితంగా మీ జీవితంలో సానుకూల మార్పులను అనుభవిస్తారు.

మిత్రులారా! భారతదేశానికి చెందిన అనేక ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్‌ ఉంది. భారతదేశ స్థానిక ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తం కావడం చూసినప్పుడు గర్వంతో నిండిపోవడం సహజం. అటువంటి ఒక ఉత్పత్తి అరకు కాఫీ. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతా రామరాజు జిల్లాలో అరకు కాఫీ భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతుంది. ఇది గొప్ప రుచికి, సువాసనకు ప్రసిద్ధి చెందింది. అరకు కాఫీ సాగులో దాదాపు ఒకటిన్నర లక్షల ఆదివాసీ కుటుంబాలు నిమగ్నమై ఉన్నాయి. అరకు కాఫీ ఖ్యాతి కొత్త శిఖరాలకు చేరడంలో గిరిజన సహకార సంఘం ప్రధాన పాత్ర పోషించింది. అక్కడి రైతు సోదర సోదరీమణులను ఏకతాటిపైకి తీసుకొచ్చి, అరకు కాఫీ సాగు చేసేలా ప్రోత్సహించింది. దీంతో ఈ రైతుల ఆదాయం కూడా బాగా పెరిగింది. కొండ దొర ఆదివాసీ సమాజం కూడా దీని వల్ల ఎంతో లబ్ధి పొందింది. సంపాదనతో పాటు గౌరవప్రదమైన జీవితాన్ని కూడా వారు పొందుతున్నారు. ఒకసారి విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈ కాఫీని రుచి చూసే అవకాశం నాకు లభించిందని గుర్తుంది. దాని రుచి గురించి అడగవలసిన అవసరమే లేదు! ఈ కాఫీ అద్భుతమైంది! అరకు కాఫీకి అనేక అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. ఢిల్లీలో జరిగిన జి-20 శిఖరాగ్ర సమ్మేళనంలోనూ కాఫీ మాధుర్యాన్ని అతిథులు రుచి చూశారు. మీకు అవకాశం దొరికినప్పుడల్లా అరకు కాఫీని కూడా ఆస్వాదించండి.

మిత్రులారా! మన జమ్మూ కశ్మీర్ ప్రజలు కూడా స్థానిక ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయడంలో వెనుకబడి లేరు. జమ్మూ కశ్మీర్‌లో గత నెలలో చేసిన పనులు దేశవ్యాప్తంగా ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. అక్కడి పుల్వామా నుంచి లండన్‌కు మంచు బఠానీల మొదటి సరుకును పంపారు. కాశ్మీర్‌లో పండే విలక్షణమైన కూరగాయలను ప్రపంచ పటంలోకి ఎందుకు తీసుకురాకూడదనే ఆలోచన కొంతమందికి వచ్చింది. అప్పుడు చకూరా గ్రామానికి చెందిన అబ్దుల్ రషీద్ మీర్ గారు ఇందుకు ముందుగా ముందుకు వచ్చారు. గ్రామంలోని ఇతర రైతుల భూమితో సమష్టిగా మంచు బఠానీలను పండించే పనిని ప్రారంభించారు. త్వరలో కశ్మీర్ నుండి మంచు బఠానీలు లండన్ కు పంపడం మొదలుపెట్టారు. ఈ విజయం జమ్మూ కాశ్మీర్ ప్రజల సమృద్ధికి కొత్త ద్వారాలు తెరిచింది. మన దేశంలో ఇలాంటి ప్రత్యేకమైన ఉత్పత్తులకు కొదవలేదు. మీరు తప్పనిసరిగా అటువంటి ఉత్పత్తులను #myproductsmypride అనే హ్యాష్ ట్యాగుతో పంచుకోవాలి. వచ్చే ‘మన్ కీ బాత్’లో కూడా ఈ అంశంపై చర్చిస్తాను.

మమ ప్రియాః దేశవాసినః

అద్య అహం కించిత్ చర్చా సంస్కృత భాషాయాం ఆరభే!

నేను హఠాత్తుగా 'మన్ కీ బాత్'లో సంస్కృతంలో ఎందుకు మాట్లాడుతున్నాను అని మీరు ఆశ్చర్యపోవచ్చు. దీనికి కారణం ఈరోజు సంస్కృతానికి సంబంధించిన ప్రత్యేక సందర్భం! ఈరోజు జూన్ 30వ తేదీన ఆకాశవాణి సంస్కృత బులెటిన్ ప్రసారం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ బులెటిన్ చాలా మందిని 50 సంవత్సరాలుగా సంస్కృతంతో నిరంతరం అనుసంధానించింది. నేను ఆకాశవాణి కుటుంబాన్ని అభినందిస్తున్నాను.

మిత్రులారా! ప్రాచీన భారతీయ విజ్ఞానంలో, వైజ్ఞానిక పురోగతిలో సంస్కృతం ముఖ్య పాత్ర పోషించింది. మనం సంస్కృతానికి గౌరవం ఇవ్వడం, సంస్కృతాన్ని మన దైనందిన జీవితంతో అనుసంధానించడం నేటి కాలానికి అవసరం. ప్రస్తుతం బెంగళూరులో చాలా మంది ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు. బెంగళూరులో ‘కబ్బన్ పార్క్’ అనే పేరుతో ఒక పార్కు ఉంది. అక్కడి ప్రజలు ఆ పార్కులో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అక్కడ వారానికి ఒకసారి- ప్రతి ఆదివారం- పిల్లలు, యువకులు, పెద్దలు పరస్పరం సంస్కృతంలో మాట్లాడుకుంటారు. అంతే కాదు- అక్కడ అనేక చర్చా సమావేశాలను సంస్కృతంలో మాత్రమే నిర్వహిస్తారు. వారి ఈ చొరవకు పెట్టుకున్న పేరు - సంస్కృత వారాంతం! దీన్ని  సమష్టి గుబ్బీ గారు  వెబ్‌సైట్ ద్వారా ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన ఈ ప్రయత్నం బెంగుళూరు ప్రజలలో చాలా త్వరగా ప్రాచుర్యం పొందింది. మనమందరం అలాంటి ప్రయత్నంలో పాలుపంచుకుంటే ప్రపంచంలోని ఈ పురాతన, శాస్త్రీయ భాష నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు.

నా ప్రియమైన దేశప్రజలారా! ఈ ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లో మీతో అనుసంధానం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ క్రమం మునుపటిలాగానే కొనసాగుతుంది. వారం రోజుల తర్వాత పవిత్ర రథయాత్ర ప్రారంభమవుతుంది. మహాప్రభు జగన్నాథుని ఆశీస్సులు దేశప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. అమర్‌నాథ్ యాత్ర కూడా ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో పండరిపూర్ యాత్ర కూడా ప్రారంభమవుతుంది. ఈ యాత్రల్లో పాల్గొనే భక్తులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కచ్ ప్రాంత నూతన సంవత్సర వేడుకల ఆషాఢీ బీజ్ పండుగ కూడా వస్తోంది. ఈ పండుగలన్నింటికి మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు. సానుకూలతకు సంబంధించిన ప్రజా భాగస్వామ్య ప్రయత్నాలను మీరు ఖచ్చితంగా నాతో పంచుకుంటూ ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. వచ్చే నెలలో మీతో అనుసంధానం అయ్యేందుకు నేను ఎదురుచూస్తున్నాను. అప్పటి వరకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం!

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage