The Olympics give our players a chance to hoist the Tricolour on the world stage; give them a chance to do something for the country: PM
Charaideo Moidam of Assam is being included in the UNESCO World Heritage Sites: PM Modi
Project PARI is becoming a great medium to bring emerging artists on one platform to popularise public art: PM Modi
The turnover of Khadi Village Industry has crossed Rs 1.5 lakh crore for the first time, with a 400% increase in sales: PM Modi
The government has opened a special centre named 'Manas' to help in the fight against drug abuse: PM Modi
70 percent of the tigers in the world are in our country, thanks to community efforts in tiger conservation: PM Modi
The 'Har Ghar Tiranga Abhiyan' has become a unique festival in upholding the glory of the Tricolour: PM Modi

నా ప్రియమైన దేశప్రజలారా! 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీకు స్వాగతం. అభినందనలు. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఒలింపిక్స్ మన క్రీడాకారులకు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే  అవకాశం అందిస్తుంది. దేశం కోసం ఏదైనా చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. మీరు కూడా మన క్రీడాకారులను ప్రోత్సహించండి. ఛీర్ ఫర్ భారత్‌.!!

మిత్రులారా! క్రీడా ప్రపంచంలో ఈ ఒలింపిక్స్‌తో పాటు, కొద్ది రోజుల క్రితం గణిత ప్రపంచంలో కూడా ఒలింపిక్స్ జరిగాయి. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ జరిగింది. ఈ ఒలింపియాడ్‌లో భారతీయ విద్యార్థులు అద్భుత ప్రదర్శన చూపింది. ఇందులో మన జట్టు అత్యుత్తమ ప్రదర్శన చూపి నాలుగు బంగారు పతకాలు, ఒక రజత పతకం సాధించింది. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌లో 100 కంటే ఎక్కువ దేశాలకు చెందిన యువత పాల్గొంటోంది. మన బృందం మొదటి ఐదు స్థానాల్లోకి రావడంలో విజయం సాధించింది. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ఈ విద్యార్థులు  - పూణే నివాసి ఆదిత్య వెంకట్ గణేష్, పూణే నుండే సిద్ధార్థ్ చోప్రా, ఢిల్లీ నుండి అర్జున్ గుప్తా, గ్రేటర్ నోయిడా నుండి కనవ్ తల్వార్, ముంబాయి నుండి రుశీల్ మాథుర్, గౌహతికి చెందిన ఆనందో భాదురి.

మిత్రులారా! ఈ రోజు ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి నేను ఈ యువ విజేతలను ప్రత్యేకంగా ఆహ్వానించాను. వాళ్లంతా ఈ సమయంలో మనతో ఫోన్‌లో ఉన్నారు.

ప్రధానమంత్రి:- నమస్కారం మిత్రులారా! ‘మన్ కీ బాత్’ కు స్నేహితులందరికీ స్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారు?

విద్యార్థులు:- బాగున్నాం సార్.

ప్రధానమంత్రి:- మిత్రులారా! 'మన్ కీ బాత్' ద్వారా మీ అందరి అనుభవాలను తెలుసుకోవాలని దేశప్రజలు చాలా ఆసక్తితో ఉన్నారు. నేను ఆదిత్య, సిద్ధార్థ్‌ లతో ప్రారంభిస్తాను. మీరు పూణేలో ఉన్నారు.  ముందుగా నేను మీతో ప్రారంభిస్తాను. ఒలింపియాడ్ సమయంలో మీ అనుభవాలను మా అందరితో పంచుకోండి.

ఆదిత్య :- నాకు గణితంలో కొద్దిగా ఆసక్తి ఉండేది సార్.  నాకు 6వ తరగతిలో గణితం నేర్పిన ఓంప్రకాశ్ సార్ మా టీచర్. ఆయన నాకు గణితంపై ఆసక్తిని పెంచారు. నేను నేర్చుకోగలిగాను. నాకు అవకాశం వచ్చింది సార్.

ప్రధానమంత్రి: మీ మిత్రుడు ఏమంటారు?

సిద్ధార్థ్:- సార్! నేను సిద్ధార్థ్. మాది పూణే. నేను ఈ మధ్యే 12వ తరగతి పాసయ్యాను. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ లో పాల్గొనడం నాకు రెండవ సారి. నాకు కూడా గణితంపై చాలా ఆసక్తి ఉంది. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఓం ప్రకాశ్ సార్ మా ఇద్దరికీ శిక్షణనిచ్చారు. మాకు చాలా సహాయం చేశారు. నేను ప్రస్తుతం సీఎంఐ కాలేజీ లో చదువుతున్నాను. అక్కడ గణితం, కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంటున్నాను.

ప్రధానమంత్రి: సరే! అర్జున్ ప్రస్తుతం గాంధీనగర్‌లో ఉన్నారని, కనవ్ గ్రేటర్ నోయిడాకు చెందినవారని నాకు తెలిసింది. అర్జున్, కనవ్ మనం ఒలింపియాడ్ గురించి చర్చించుకున్నాం. అయితే మీరిద్దరూ మీ సన్నద్ధతకు సంబంధించిన ఏదైనా అంశాన్ని, ఏదైనా ప్రత్యేక అనుభవాన్ని చెప్తే మన శ్రోతలు ఇష్టపడతారు.

అర్జున్:- నమస్కారం సార్. జై హింద్! నేను అర్జున్ ని మాట్లాడుతున్నాను సార్.

ప్రధాన మంత్రి :- జై హింద్ అర్జున్.

అర్జున్ :- నేను ఢిల్లీలో ఉంటున్నాను. మా అమ్మ శ్రీమతి ఆశా గుప్తా ఢిల్లీ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్. మా నాన్న శ్రీ అమిత్ గుప్తా ఛార్టర్డ్ అకౌంటెంట్. దేశ ప్రధాన మంత్రితో మాట్లాడడాన్ని నేను చాలా గర్వంగా భావిస్తున్నాను సార్. ముందుగా నా విజయానికి సంబంధించిన క్రెడిట్‌ను మా తల్లిదండ్రులకు అందించాలనుకుంటున్నాను. ఒక కుటుంబంలోని సభ్యుడు అలాంటి పోటీకి సిద్ధమవుతున్నప్పుడు అది ఆ సభ్యుని పోరాటం మాత్రమే కాదు- యావత్ కుటుంబ  పోరాటం అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ పేపర్‌లో మూడు సమస్యలు పరిష్కరించేందుకు నాలుగున్నర గంటల సమయం ఉంటుంది. అంటే ఒక సమస్యకు గంటన్నర. సమస్యను పరిష్కరించేందుకు ఎంత సమయం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి, మనం ఇంట్లో చాలా కష్టపడాలి. ఇలాంటి సమస్యలకు గంటలు వెచ్చించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఒక రోజు పడుతుంది. కొన్నిసార్లు ప్రతి సమస్యతో 3 రోజులు గడపవలసి ఉంటుంది. కాబట్టి దీని కోసం మనం ఆన్‌లైన్‌లో సమస్యలను వెతకాల్సి ఉంటుంది. మనం కిందటి ఏడాది సమస్యను ప్రయత్నిస్తాం.  క్రమంగా కష్టపడి పని చేస్తున్నప్పుడు మన అనుభవం పెరుగుతుంది. అత్యంత ముఖ్యమైన విషయం- మన సమస్యా  పరిష్కార సామర్థ్యం పెరుగుతుంది. ఇది గణితంలో మాత్రమే కాదు- జీవితంలోని ప్రతి రంగంలో మనకు ఉపయోగపడుతుంది.

ప్రధానమంత్రి: సరే! కనవ్… ఈ సన్నాహాల్లో ఏదైనా ప్రత్యేకమైన అనుభవం ఉంటే మీరు నాకు చెప్పగలరా! ఈ తయారీలో ఏమైనా ప్రత్యేకత ఉంటే మన యువ స్నేహితులు తెలుసుకుని చాలా సంతోషిస్తారు.

కనవ్ తల్వార్: నా పేరు కనవ్ తల్వార్. నేను ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్నాను. నేను 11వ తరగతి విద్యార్థిని. గణితం నాకు ఇష్టమైన సబ్జెక్ట్. నాకు చిన్నప్పటి నుంచి గణితం అంటే చాలా ఇష్టం. నా చిన్నప్పుడు మా నాన్న నాతో పజిల్స్ చేయించేవారు. దానివల్ల నా ఆసక్తి పెరిగింది. 7వ తరగతి నుంచే ఒలింపియాడ్‌కు ప్రిపరేషన్‌ ప్రారంభించాను. ఇందులో నా సోదరి సహకారం చాలా ఉంది. మా  తల్లిదండ్రులు కూడా ఎల్లప్పుడూ నాకు సహకరించారు. ఈ ఒలింపియాడ్ ను హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ సంస్థ నిర్వహిస్తుంది. ఇది 5 దశల ప్రక్రియ. గత ఏడాది నేను టీంలో లేను.  చాలా దగ్గరలో ఉండి టీంలో లేనందుకు చాలా బాధపడ్డాను. అప్పుడు మా తల్లిదండ్రులు నాకు నేర్పించారు- మనం గెలుస్తాం లేదా నేర్చుకుంటాం అని. ప్రయాణం ముఖ్యం తప్ప విజయం కాదని చెప్పారు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఇదే - ‘మీరు చేసే పనిని ఇష్టపడండి. మీరు ఇష్టపడే పనిని చేయండి’. ప్రధానమైనది ప్రయాణం. విజయం ముఖ్యం కాదు. మనం చేసే పనిని ఇష్టపడితే  విజయాన్ని అందుకుంటూనే ఉంటాం. ప్రయాణాన్ని ఆనందిద్దాం.

ప్రధానమంత్రి: కనవ్... మీకు గణితంపై ఆసక్తి ఉంది. సాహిత్యంపై కూడా ఆసక్తి ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు.!

కనవ్ తల్వార్: అవును సార్! నేను నా చిన్నప్పుడు చర్చలు, ఉపన్యాసాల్లో కూడా  పాల్గొనేవాడిని.

ప్రధానమంత్రి: సరే... ఇప్పుడు ఆనందోతో మాట్లాడుదాం. ఆనందో.. మీరు ప్రస్తుతం గౌహతిలో ఉన్నారు. మీ మిత్రుడు రుషిల్ ముంబాయిలో ఉన్నారు. మీ ఇద్దరికీ నాదో ప్రశ్న. చూడండి.. నేను పరీక్ష గురించి చర్చిస్తూనే ఉంటాను. పరీక్ష గురించి చర్చించడమే కాకుండా ఇతర కార్యక్రమాలలో కూడా విద్యార్థులతో మాట్లాడుతూ ఉంటాను. చాలా మంది విద్యార్థులు గణితం అంటే చాలా భయపడతారు. దాని పేరు వినగానే వారు కంగారుపడతారు. గణితంతో స్నేహం చేయడం ఎలాగో చెప్పగలరా?

రుశీల్ మాథుర్: సార్! నేను రుశీల్ మాథుర్‌ని మాట్లాడుతున్నాను. మన చిన్నప్పుడు కూడికలు నేర్చుకున్నప్పుడు క్యారీ ఫార్వర్డ్ నేర్పిస్తారు. కానీ క్యారీ ఫార్వర్డ్ అంటే ఏమిటో ఎప్పుడూ వివరించరు. చక్రవడ్డీని చదువుకున్నప్పుడు చక్రవడ్డీ సూత్రం ఎక్కడ నుండి వస్తుంది అనే ప్రశ్న మనం ఎప్పుడూ అడగం. గణితం నిజానికి ఆలోచనాత్మక,  సమస్యా పరిష్కార కళ అని నేను నమ్ముతున్నాను. కాబట్టి మనమందరం గణితానికి కొత్త ప్రశ్నను జోడించాలనిపిస్తుంది.  మనం దీన్ని ఎందుకు చేస్తున్నాం, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న వేసుకోవాలి. అప్పుడు ఇది గణితంపై ప్రజల ఆసక్తిని చాలా పెంచుతుందని నేను భావిస్తున్నాను! ఎందుకంటే మనం ఏదైనా అర్థం చేసుకోలేనప్పుడు మనకు భయం కలుగుతుంది. గణితం చాలా లాజికల్ సబ్జెక్ట్ అని అందరూ అనుకుంటున్నారని నేను కూడా భావిస్తున్నాను. అయితే అంతే కాకుండా గణితంలో సృజనాత్మకత కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే సృజనాత్మకత ద్వారా మాత్రమే మనం ఒలింపియాడ్‌లో చాలా ఉపయోగకరంగా ఉండే పరిష్కారాల  నుండి ఆలోచించగలుగుతాం. అందువల్ల గణితంపై ఆసక్తిని పెంచడానికి మ్యాథ్స్ ఒలింపియాడ్‌కు చాలా ముఖ్యమైన ఔచిత్యం ఉంది.

ప్రధానమంత్రి: ఆనందో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా!

ఆనందో భాదురి: నమస్కారం ప్రధానమంత్రి గారూ..! నేను గౌహతికి చెందిన ఆనందో భాదురిని. నేను ఈ మధ్యే 12వ తరగతి పాసయ్యాను. నేను 6,7 తరగతుల్లో ఇక్కడి లోకల్ ఒలింపియాడ్ లో  పాల్గొనేవాడిని. అప్పటి  నుండి ఆసక్తి కలిగింది. ఇది నా రెండవ అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్. రెండు ఒలింపియాడ్లూ బాగా జరిగాయి. రుశీల్ చెప్పిన దానితో నేను ఏకీభవిస్తున్నాను. ఇక లెక్కలంటే భయపడే వారికి ఓపిక చాలా అవసరమని కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం గణిత శాస్త్రాన్ని అలా బోధిస్తారు. ఒక సూత్రాన్ని ఇస్తారు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ సూత్రాన్ని ఉపయోగించి వంద ప్రశ్నలను అధ్యయనం చేయడం జరుగుతుంది. కానీ మీరు ఆ సూత్రాన్ని అర్థం చేసుకున్నారో లేదో చూడరు. ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండాలి. సూత్రం కూడా బట్టీ పట్టేస్తాం. మరి పరీక్షలో సూత్రం మర్చిపోతే ఏం చేస్తాం? అందుకే రుశీల్ చెప్పినట్టు సూత్రాన్ని అర్థం చేసుకోండి. ఓపికగా చూడండి! మీరు సూత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే వంద ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. కేవలం ఒకటి లేదా రెండు ప్రశ్నలలోనే పూర్తవుతుంది. గణితానికి భయపడాల్సిన అవసరం లేదు.

ప్రధానమంత్రి: ఆదిత్య, సిద్ధార్థ్! మీరు మొదట్లో మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోయారు. ఇప్పుడు ఈ స్నేహితులందరి మాటలు విన్న తర్వాత మీకు కూడా ఏదో చెప్పాలనిపిస్తుంది కదా. మీరు మీ అనుభవాన్ని పంచుకోగలరా?

సిద్ధార్థ్ :- అనేక ఇతర దేశాల వారితో మాట్లాడాం. అనేక సంస్కృతులు ఉన్నాయి. ఇతర విద్యార్థులతో సంభాషించడం, కనెక్ట్ అవ్వడం చాలా బాగుంది. చాలా మంది ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞులు ఉన్నారు.

ప్రధానమంత్రి :- అవును... ఆదిత్యా!

ఆదిత్య:- ఇది చాలా మంచి అనుభవం. వారు మాకు బాత్ సిటీ మొత్తం తిప్పి చూపించారు. చాలా చక్కటి దృశ్యాలు చూశాం. మమ్మల్ని పార్కులకు తీసుకెళ్లారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి కూడా తీసుకెళ్లారు. అది చాలా గొప్ప అనుభవం.

ప్రధాన మంత్రి: మిత్రులారా! నేను మీతో మాట్లాడటం నాకు నిజంగా ఆనందంగా ఉంది. నేను మీకు శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ రకమైన ఒలింపియాడ్ క్రీడకు చాలా ప్రత్యేక దృష్టి అవసరమని నాకు తెలుసు. మీరు మీ మెదడును ఉపయోగించాలి. కుటుంబ సభ్యులు కూడా కొన్నిసార్లు విసుగు చెందుతారు.  ఎప్పుడూ ఈ లెక్కలేమిటి అనుకుంటారు. మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. మీరు దేశ గౌరవం, పేరు పెంచారు. మిత్రులారా! మీకు ధన్యవాదాలు.

విద్యార్థులు:- ధన్యవాదాలు, ధన్యవాదాలు సార్.

ప్రధానమంత్రి:- ధన్యవాదాలు.

విద్యార్థులు:- ధన్యవాదాలు సార్, జై హింద్.

ప్రధాన మంత్రి :- జై హింద్! జై హింద్!

 

విద్యార్థులతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. 'మన్ కీ బాత్'తో అనుసంధానమైనందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ యువ గణిత నిపుణుల మాటలు విన్న తర్వాత యువతరానికి గణితాన్ని ఆస్వాదించడానికి ప్రేరేపణ లభిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా! 'మన్ కీ బాత్'లో ఇప్పుడు నేను ప్రతి భారతీయుడు గర్వించే అంశాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. కానీ దాని గురించి చెప్పే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. చరాయిదేవ్ మైదామ్ అనే పేరు విన్నారా? మీరు గతంలో వినకపోతే ఇప్పుడు మీరు ఈ పేరు పదేపదే వింటారు. ఇతరులకు చాలా ఉత్సాహంగా చెప్తారు. అస్సాంలోని చరాయిదేవ్ మైదామ్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో చేర్చారు. ఈ జాబితాలో ఇది భారతదేశంలోని 43వ ప్రదేశం. ఈశాన్య ప్రాంతంలో ఈ జాబితాలో మొట్టమొదటిది.

స్నేహితులారా! చరాయిదేవ్ మైదామ్ అంటే ఏమిటి, ఇంత ప్రత్యేకమెందుకు అనే ప్రశ్న మీ మనసులో తప్పక వస్తుంది. చరాయిదేవ్ అంటే కొండలపై ఉన్న ప్రకాశవంతమైన నగరం. ఇది అహోం రాజవంశ మొదటి రాజధాని. అహోం రాజవంశానికి చెందినవారు తమ పూర్వికుల మృతదేహాలను, వారి విలువైన వస్తువులను మైదామ్‌లో సంప్రదాయ బద్ధంగా ఉంచేవారు. మైదామ్  ఒక మట్టిదిబ్బ లాంటి నిర్మాణం. ఇది పైన మట్టితో కప్పి ఉంటుంది. కింద ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గదులు ఉంటాయి. ఈ మైదాం అహోం రాజ్యానికి చెందిన దివంగత రాజులు, ప్రముఖుల పట్ల గౌరవానికి చిహ్నం. మన పూర్వికుల పట్ల గౌరవం చూపించే ఈ విధానం చాలా ప్రత్యేకమైంది. ఈ ప్రదేశంలో సామూహిక ఆరాధనలు కూడా జరిగేవి.

మిత్రులారా! అహోం సామ్రాజ్యం గురించిన ఇతర సమాచారం మిమ్మల్ని మరింత ఆశ్చర్యపరుస్తుంది. 13వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ సామ్రాజ్యం 19వ శతాబ్దం ప్రారంభం వరకు కొనసాగింది. ఒక సామ్రాజ్యం ఇంత కాలం మనుగడ సాగించడం గొప్ప విషయం. బహుశా అహోం సామ్రాజ్య  సిద్ధాంతాలు, నమ్మకాలు చాలా బలమైనవి కాబట్టి అది చాలా కాలం పాటు ఈ రాజవంశాన్ని కొనసాగించింది. ఎడతెగని సాహసం, శౌర్యపరాక్రమాలకు ప్రతీక అయిన గొప్ప అహోం యోధుడు లసిత్ బోర్ఫుకాన్  ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం ఈ సంవత్సరం మార్చి 9వ తేదీన నాకు లభించిందని గుర్తుంది. ఈ కార్యక్రమంలో అహోం సమాజ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని అనుసరిస్తున్నప్పుడు నాకు భిన్నమైన అనుభవం ఎదురైంది. లసిత్ మైదామ్ లో అహోం సమాజ పూర్వికులకు నివాళులు అర్పించడం నాకు చాలా గొప్ప విషయం. ఇప్పుడు చరాయిదేవ్ మైదామ్ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారడం అంటే ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. మీరు మీ భవిష్యత్ ప్రయాణ ప్రణాళికల్లో ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని కూడా చేర్చుకుంటారు.

మిత్రులారా! ఒక దేశం దాని సంస్కృతిని గౌరవించడం ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతుంది. భారతదేశంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. అలాంటి ఒక ప్రయత్నమే – ప్రాజెక్ట్ పరీ. ఇప్పుడు మీరు పరీ అనే పేరు విని అయోమయానికి గురికాకండి. ఈ అద్భుతం స్వర్గపు ఊహకు అనుసంధానం కాలేదు. కానీ భూమిని స్వర్గంగా మారుస్తోంది. పరీ అంటే పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా. ప్రజా కళను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు, వర్ధమాన కళాకారులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రాజెక్ట్ పరీ ఒక ప్రధాన మాధ్యమంగా మారుతోంది. మీరు తప్పక చూస్తూ ఉంటారు.. రోడ్ల పక్కన, గోడలపై, అండర్‌పాస్‌లపై చాలా అందమైన పెయింటింగ్స్ కనిపిస్తాయి. ఈ పెయింటింగులు, ఈ కళాఖండాలు పరీతో అనుసంధానమైన కళాకారులు రూపొందించినవి. ఇది మన బహిరంగ ప్రదేశాల అందాన్ని మెరుగుపరుస్తుంది. మన సంస్కృతిని మరింత ప్రాచుర్యం పెంచడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఉదాహరణకు ఢిల్లీలోని భారత్ మండపాన్ని తీసుకోండి. ఇక్కడ మీరు దేశం నలుమూలల నుండి అద్భుతమైన కళాఖండాలను చూడవచ్చు. ఢిల్లీలోని కొన్ని అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్‌లపై కూడా మీరు అలాంటి అందమైన ప్రజాకళను చూడవచ్చు. కళ, సంస్కృతి ప్రేమికులు పబ్లిక్ ఆర్ట్‌పై మరింత కృషి చేయాలని నేను కోరుతున్నాను. ఇది మన మూలాల గురించి గర్వించే ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది.

నా ప్రియమైన దేశప్రజలారా! 'మన్ కీ బాత్'లో ఇప్పుడు 'రంగుల' గురించి మాట్లాడుకుందాం. హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాకు చెందిన 250 మందికి పైగా మహిళల జీవితాలను సమృద్ధితో వర్ణమయం చేసిన రంగులు. చేనేత పరిశ్రమతో అనుబంధం ఉన్న ఈ మహిళలు ఇంతకు ముందు చిన్న చిన్న దుకాణాలు నిర్వహిస్తూ, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే ప్రతి ఒక్కరిలో ముందుకు వెళ్లాలనే కోరిక ఉంటుంది.   కాబట్టి వాళ్ళు ‘ఉన్నతి’ స్వయం సహాయ సమూహంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ సమూహంలో చేరడం ద్వారా బ్లాక్ ప్రింటింగ్, డైయింగ్‌లో శిక్షణ పొందారు. బట్టలపై రంగుల మాయాజాలాన్ని కూర్చడం నేర్చుకున్న ఈ మహిళలు నేడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళు తయారు చేసే బెడ్ కవర్లు, చీరలు, దుపట్టాలకు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది.

మిత్రులారా! రోహ్‌తక్‌కు చెందిన ఈ మహిళల మాదిరిగానే దేశంలోని వివిధ ప్రాంతాల్లోని కళాకారులు చేనేతకు ప్రాచుర్యం కల్పించడంలో బిజీగా ఉన్నారు. ఒడిశాకు చెందిన 'సంబల్‌పురి చీర' అయినా, మధ్యప్రదేశ్ కు చెందిన 'మహేశ్వరి చీర' అయినా, మహారాష్ట్రకు చెందిన 'పైథానీ' అయినా, విదర్భకు చెందిన 'హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్' అయినా, హిమాచల్‌కు చెందిన 'భూట్టికో' శాలువాలు, ఉన్ని బట్టలు అయినా లేదా జమ్మూ కశ్మీర్  కనీ శాలువాలు అయినా దేశంలోని నలుమూలలా చేనేత కళాకారుల కృషి కనిపిస్తుంది. మరి కొన్ని రోజుల తర్వాత ఆగస్టు 7వ తేదీన 'జాతీయ చేనేత దినోత్సవం' జరుపుకుంటామని మీకు తెలిసి ఉండవచ్చు. ఈ రోజుల్లో చేనేత ఉత్పత్తులు ప్రజల హృదయాలలో తమ స్థానాన్ని సంపాదించుకున్న విధానం చాలా విజయవంతమైనది, అద్భుతమైనది. ఇప్పుడు చాలా ప్రైవేటు  కంపెనీలు కూడా కృత్రిమ మేధ ద్వారా చేనేత ఉత్పత్తులను, ఫ్యాషన్  ఉత్పత్తులను రూపొందిస్తున్నాయి. కోషా ఏఐ, హ్యాండ్ లూం ఇండియా, డి- జంక్, నోవా టాక్స్, బ్రహ్మపుత్ర ఫెబుల్స్  లాంటి అనేక స్టార్టప్‌లు కూడా చేనేత ఉత్పత్తులను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో కృషి చేస్తున్నాయి. ఇలాంటి స్థానిక ఉత్పత్తులను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారని తెలిసి నేను కూడా సంతోషిస్తున్నాను. మీరు మీ స్థానిక ఉత్పత్తులను సోషల్ మీడియాలో ‘హ్యాష్‌ట్యాగ్ మై ప్రోడక్ట్ మై ప్రైడ్’ పేరుతో కూడా అప్‌లోడ్ చేయవచ్చు. మీ ఈ చిన్న ప్రయత్నం చాలా మంది జీవితాలను మారుస్తుంది.

మిత్రులారా! చేనేతతో పాటు నేను ఖాదీ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. ఇంతకు ముందు ఖాదీ ఉత్పత్తులను ఉపయోగించని వారు మీలో చాలా మంది ఉండవచ్చు. కానీ నేడు ఖాదీని చాలా గర్వంగా ధరిస్తున్నారు. ఖాదీ గ్రామోద్యోగ్  టర్నోవర్ మొదటిసారిగా లక్షన్నర కోట్ల రూపాయలు దాటిందని మీకు చెప్పడానికి కూడా సంతోషిస్తున్నాను. ఊహించుకోండి... ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలు!! మరి ఖాదీ అమ్మకాలు ఎంత పెరిగాయో తెలుసా? 400 శాతం. ఈ పెరుగుతున్న ఖాదీ, చేనేత విక్రయాలు పెద్ద సంఖ్యలో కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నాయి. చాలా మంది మహిళలకు ఈ పరిశ్రమతో అనుబంధం ఉంది. వారు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. నేను మళ్ళీ మిమ్మల్ని ఒక విషయం కోరుతున్నాను.  మీ దగ్గర  తప్పనిసరిగా వివిధ రకాల బట్టలు ఉండవచ్చు. మీరు ఇప్పటి వరకు ఖాదీ బట్టలు కొనకపోతే ఈ సంవత్సరం నుండి ప్రారంభించండి. ఆగస్ట్ నెల వచ్చేసింది. ఇది స్వాతంత్ర్యం వచ్చిన నెల. ఇది విప్లవ మాసం. ఖాదీని కొనడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది!

నా ప్రియమైన దేశవాసులారా! డ్రగ్స్ సవాలు గురించి నేను మీతో 'మన్ కీ బాత్'లో తరచుగా చర్చించాను. తమ బిడ్డ డ్రగ్స్ బారిన పడే ప్రమాదం ఉందని ప్రతి కుటుంబం ఆందోళన చెందుతోంది. ఇప్పుడు అలాంటి వారికి సహాయం చేసేందుకు ప్రభుత్వం ‘మానస్’ పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించింది. డ్రగ్స్‌పై పోరాటంలో ఇదొక పెద్ద ముందడుగు. ‘మానస్’ హెల్ప్‌లైన్, పోర్టల్ కొద్ది రోజుల కిందటే ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ‘1933’ అనే టోల్‌ ఫ్రీ నంబర్‌ను కూడా ప్రారంభించింది. దీనికి కాల్ చేయడం ద్వారా, ఎవరైనా అవసరమైన సలహాలను పొందవచ్చు లేదా సహాయ పునరావాసాలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. ఎవరి దగ్గరైనా  డ్రగ్స్‌కు సంబంధించిన ఇతర సమాచారం ఉంటే వారు ఈ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా దాన్ని మాదక ద్రవ్యాల నిరోధక సంస్థ- నారోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో పంచుకోవచ్చు. 'మానస్'తో పంచుకునే ప్రతి సమాచారాన్ని రహస్యంగా ఉంచుతారు. మానస్ హెల్ప్‌లైన్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలని భారతదేశాన్ని 'డ్రగ్స్ ఫ్రీ'గా మార్చడంలో కృషి చేస్తున్న అందరు వ్యక్తులను, అన్ని కుటుంబాలను, అన్ని సంస్థలను కోరుతున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా! పులుల దినోత్సవాన్ని రేపు ప్రపంచమంతటా జరుపుకుంటున్నారు. పులులు మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయి.  మనమందరం పులులకు సంబంధించిన కథలను వింటూ పెరిగాం. అడవి చుట్టూ ఉన్న గ్రామాలలో ప్రతి ఒక్కరికీ పులితో సామరస్యంగా ఎలా జీవించాలో తెలుసు. మనుషులు, పులుల మధ్య ఎప్పుడూ ఘర్షణలు జరగని చోట్లు కూడా దేశంలో ఉన్నాయి. అలాంటి చోట్ల కూడా పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి ప్రజా భాగస్వామ్య ప్రయత్నాలలో ఒకటి "కుల్హాడి బంద్ పంచాయితీ".  రాజస్థాన్‌లోని రణతంబోర్ లో ప్రారంభమైన కుల్హాడి బంద్ పంచాయితీ ఒక ఆసక్తికరమైన ఉద్యమం. గొడ్డలితో అడవిలోకి వెళ్లబోమని, చెట్లను నరకబోమని అక్కడి స్థానిక సంఘాలు స్వచ్ఛందంగా ప్రమాణం చేశాయి. ఈ ఒక్క నిర్ణయంతో ఇక్కడి అడవులు మరోసారి పచ్చగా మారడంతోపాటు పులులకు చక్కటి వాతావరణం ఏర్పడుతోంది.

మిత్రులారా! మహారాష్ట్రలోని తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ పులుల ప్రధాన నివాసాలలో ఒకటి. ఇక్కడి స్థానిక సమాజాలు- ముఖ్యంగా గోండు, మానా ఆదివాసీ  తెగలకు చెందిన మన సోదర సోదరీమణులు ఎకో-టూరిజం వైపు వేగంగా అడుగులు వేశారు. ఇక్కడ పులులు పెరిగేలా చేసేందుకు తాము అడవిపై ఆధారపడడాన్ని తగ్గించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల కొండలపై నివసించే 'చెంచు' తెగ కృషి చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. వారు టైగర్ ట్రాకర్లుగా, అడవిలో వన్యప్రాణుల సంచారం గురించి ప్రతి సమాచారాన్ని సేకరించారు. దీంతో పాటు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాలపై నిఘా పెట్టారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లోని పీలీభీత్‌లో జరుగుతున్న 'బాగ్ మిత్ర కార్యక్రమం' కూడా చాలా చర్చనీయాంశమైంది. దీని కింద స్థానిక ప్రజలకు 'బాగ్ మిత్ర'- అంటే పులి మిత్రులు గా పని చేసేందుకు శిక్షణ ఇస్తారు.  పులులకు, మనుషులకు మధ్య ఎలాంటి ఘర్షణ జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు ఈ 'పులి మిత్రులు’. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను ఇక్కడ కొన్ని ప్రయత్నాలను మాత్రమే చర్చించాను. అయితే పులుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం చాలా సహాయపడుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో పులుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రపంచంలోని 70 శాతం పులులు మన దేశంలోనే ఉన్నాయని తెలిస్తే మీరు సంతోషంగా, గర్వంగా అనుభూతి చెందుతారు. ఆలోచించండి! 70 శాతం పులులు!! - అందుకే మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక పులుల అభయారణ్యాలు ఉన్నాయి.

మిత్రులారా! మన దేశంలో పులుల పెరుగుదలతో పాటు అటవీ ప్రాంతం కూడా వేగంగా పెరుగుతోంది. ఇందులో కూడా సమాజం చేస్తోన్న కృషి వల్లనే గొప్ప విజయం లభిస్తోంది. గత ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం గురించి మీతో చర్చించాను. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ఉద్యమంలో చేరడం నాకు సంతోషంగా ఉంది. పరిశుభ్రతకు ప్రసిద్ధి చెందిన ఇండోర్‌లో కొద్ది రోజుల క్రితం ఓ అద్భుతమైన కార్యక్రమం జరిగింది. ఇక్కడ ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో ఒకే రోజు 2 లక్షలకు పైగా మొక్కలు నాటారు. మీరు కూడా మీ అమ్మ పేరు మీద మొక్కలు నాటే ఈ ఉద్యమంలో పాల్గొని సెల్ఫీ తీసుకుని సామాజిక మాధ్యమంలో పోస్టు చేయాలి. ఈ ఉద్యమంలో చేరడం ద్వారా, మీరు మీ అమ్మ కోసం, మాతృభూమి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని భావిస్తారు.

నా ప్రియమైన దేశప్రజలారా! ఆగస్టు 15వ తేదీ ఎంతో దూరంలో లేదు. ఇప్పుడు ఆగస్టు 15వ తేదీకి 'హర్ ఘర్ తిరంగా అభియాన్' అనే మరో ఉద్యమం  అనుసంధానమైంది. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా 'హర్ ఘర్ తిరంగా అభియాన్'పై అందరి ఉత్సాహం ఎక్కువగా ఉంది. పేదవారైనా, ధనవంతులైనా, చిన్న ఇల్లు అయినా, పెద్ద ఇల్లు అయినా అందరూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి గర్వాన్ని అనుభూతి చెందుతారు. త్రివర్ణ పతాకంతో సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడంలో కూడా క్రేజ్ ఉంది. కాలనీ లేదా సొసైటీలోని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడినప్పుడు ఇతర ఇళ్లపై కూడా త్రివర్ణ పతాకం కనిపించడం ప్రారంభించడాన్ని మీరు గమనించి ఉండాలి. అంటే ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ త్రివర్ణ పతాక చరిత్రలో ఒక అపూర్వమైన పర్వదినంగా మారింది. ఇప్పుడు దీనికి సంబంధించి వివిధ రకాల ఆవిష్కరణలు జరగడం ప్రారంభించాయి. ఆగస్టు 15వ తేదీ సమీపిస్తున్న కొద్దీ, త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించే వివిధ రకాల ఉత్పత్తులు ఇళ్లు, కార్యాలయాలు, కార్లలో కనిపించడం ప్రారంభిస్తాయి. కొందరు వ్యక్తులు తమ స్నేహితులకు, పొరుగువారికి త్రివర్ణ పతాకాన్ని కూడా పంపిణీ చేస్తారు. త్రివర్ణ పతాకం పట్ల ఉన్న ఈ ఆనందం, ఈ ఉత్సాహం మనల్ని ఒకరికొకరిని  కలుపుతాయి.

మిత్రులారా! గతంలో లాగే ఈ ఏడాది కూడా త్రివర్ణ పతాకంతో కూడిన మీ సెల్ఫీని 'హర్ ఘర్ తిరంగా డాట్ కామ్’ లో అప్‌లోడ్ చేయాలి. నేను మీకు మరో విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీకి ముందు మీరు నాకు చాలా సలహాలు పంపుతారు. మీరు ఈ సంవత్సరం కూడా మీ సలహాలను నాకు పంపాలి. మీరు మై గవ్ లేదా నమో యాప్‌లో కూడా మీ సూచనలను పంపవచ్చు. నేను ఆగస్టు 15వ తేదీన నా ప్రసంగంలో వీలైనన్ని ఎక్కువ సూచనలను పొందుపర్చడానికి ప్రయత్నిస్తాను.

నా ప్రియమైన దేశవాసులారా! ఈ ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లో మీతో అనుసంధానం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశం సాధించే కొత్త విజయాలు, ప్రజల భాగస్వామ్యం కోసం కొత్త ప్రయత్నాలతో మనం వచ్చేసారి కలుస్తాం. ‘మన్ కీ బాత్’ కోసం మీరు మీ సూచనలు పంపిస్తూ ఉండండి. రాబోయే కాలంలో అనేక పండుగలు కూడా వస్తున్నాయి. మీకు అన్ని పండుగల శుభాకాంక్షలు. మీరు కుటుంబ సమేతంగా పండుగలను ఆనందించండి. దేశం కోసం ఏదైనా కొత్త పని చేసే శక్తిని నిరంతరం కొనసాగించండి. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi