The youth of the nation has benefitted by the space sector reforms: PM Modi
Youth are eager to enter politics, seeking the right opportunity and guidance: PM Modi
‘Har Ghar Tiranga’ campaign wove the entire country into a thread of togetherness: PM Modi
#MannKiBaat: PM Modi shares the heartwarming connection between Barekuri villagers and hoolock gibbons
Toy recycling can protect the environment: PM Modi
Today, there is a growing interest in Sanskrit both in India and globally: PM Modi
Children’s nutrition is a priority for the country: PM Modi

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమానికి నా కుటుంబ సభ్యులైన మీ అందరికీ మరోసారి స్వాగతం. ఈ రోజు మనం మరోసారి దేశం సాధించిన విజయాలు, దేశ ప్రజల సామూహిక కృషి గురించి మాట్లాడుకుంటాం. 21వ శతాబ్దపు భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వికసిత భారతదేశ పునాదిని బలోపేతం చేస్తున్నాయి. ఉదాహరణకు ఈ ఆగస్టు 23వ తేదీన మనమందరం మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకున్నాం. మీరందరూ ఈ రోజును తప్పకుండా జరుపుకున్నారని, చంద్రయాన్-3 విజయాన్ని మరోసారి జరుపుకున్నారని నాకు విశ్వాసం ఉంది. గత సంవత్సరం ఇదే రోజున చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ భాగంలోని శివ-శక్తి స్థలంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్‌ నిలిచింది.

మిత్రులారా! అంతరిక్ష రంగ సంస్కరణల వల్ల దేశంలోని యువతకు కూడా చాలా ప్రయోజనం లభించింది. కాబట్టి ఈ రోజు 'మన్ కీ బాత్'లో అంతరిక్ష రంగానికి సంబంధించిన కొంతమంది యువ సహోద్యోగులతో సంభాషించాలని నేను అనుకున్నాను. నాతో మాట్లాడేందుకు స్పేస్ టెక్ స్టార్ట్ అప్ GalaxEye బృందం సిద్ధంగా ఉంది. ఈ స్టార్టప్‌ను ఐఐటీ-మద్రాస్ పూర్వ విద్యార్థులు ప్రారంభించారు. ఈ యువకులు – సూయశ్, డేనిల్, రక్షిత్, కిషన్, ప్రణీత్- ఈరోజు ఫోన్ లైన్‌లో మనతో ఉన్నారు. రండి, ఈ యువత అనుభవాలను తెలుసుకుందాం.

ప్రధానమంత్రి: హల్లో!

యువకులందరూ: హల్లో సార్!

ప్రధానమంత్రి: అందరికీ నమస్కారం!

యువకులందరూ (కలిసి): నమస్కారం సార్!

ప్రధానమంత్రి: మిత్రులారా! మద్రాసు ఐఐటి లో ఏర్పడిన మీ స్నేహం నేటికీ బలంగా ఉండడాన్ని చూసి నేను సంతోషిస్తున్నాను. అందుకే మీరు GalaxEyeని ప్రారంభించాలని కలిసి నిర్ణయించుకున్నారు. ఈ రోజు నేను దాని గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను. దాని గురించి చెప్పండి. దాంతో పాటు మీ సాంకేతికత వల్ల దేశానికి ఎంత మేలు జరుగుతుందో కూడా చెప్పండి.

సూయశ్: సార్.. నా పేరు సూయశ్. మేం మీరు చెప్పినట్టే ఐఐటీ-మద్రాస్‌లో కలుసుకున్నాం. మేమంతా వేర్వేరు సంవత్సరాల్లో అక్కడ చదువుకున్నాం. అక్కడ ఇంజనీరింగ్ చేశాం. హైపర్‌లూప్ అనే ప్రాజెక్ట్ చేయాలని అప్పట్లో అనుకున్నాం. మేం అనుకున్నది కలిసి చేయాలనుకున్నాం. ఆ సమయంలో మేం ఒక బృందాన్ని ప్రారంభించాం. దాని పేరు 'ఆవిష్కార్ హైపర్‌లూప్'. ఆ బృందంతో మేం అమెరికా కూడా వెళ్ళాం. ఆ సంవత్సరం ఆసియా నుండి అక్కడికి వెళ్లి దేశ జెండాను ప్రదర్శించిన ఏకైక బృందం మాది మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పదిహేను వందల బృందాల్లో అత్యుత్తమమైన 20 జట్లలో మేం ఉన్నాం.

ప్రధానమంత్రి: ఇంకా విందాం. ఇంకా వినడానికి ముందు ఈ విషయంలో నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను.

సూయశ్: మీకు చాలా ధన్యవాదాలు సార్. అదే సమయంలో మా స్నేహం ఈ విధంగా దృఢమైంది. కష్టతరమైన ప్రాజెక్ట్‌లు చేయగలమనే విశ్వాసాన్ని కూడా పొందాం. అదే సమయంలో SpaceX చూశాం. మీరు అంతరిక్ష రంగంలో ప్రారంభించిన ప్రైవేటీకరణ 2020లో ఒక మైలురాయిగా చెప్పగలిగే నిర్ణయం సార్. ఆ విషయంలో మేం చాలా సంతోషించాం. మరి మేం చేసిన పనుల గురించి మాట్లాడేందుకు, ఆ కృషి వల్ల జరిగిన ప్రయోజనం చెప్పేందుకు రక్షిత్‌ని ఆహ్వానించాలనుకుంటున్నాను.

రక్షిత్: సార్. నా పేరు రక్షిత్. ఈ సాంకేతికతతో మనకు ఏ ప్రయోజనం కలిగిందో నేను చెప్తాను సార్.

ప్రధానమంత్రి: రక్షిత్.. ఉత్తరాఖండ్‌లో మీ స్వగ్రామం ఎక్కడ?

రక్షిత్: సార్… మాది అల్మోరా.

ప్రధానమంత్రి: అంటే మీరు బాల్ మిఠాయి వారా?

రక్షిత్: అవును సార్. అవును సార్. బాల్ మిఠాయి మాకు చాలా ఇష్టం.

ప్రధానమంత్రి: మన లక్ష్యా సేన్ నాకు ఎప్పుడూ బాల్ మిఠాయి తినిపిస్తూ ఉంటాడు. రక్షిత్.. చెప్పండి.

రక్షిత్: మా ఈ సాంకేతికత అంతరిక్షం నుండి మేఘాలకు అవతల కూడా చూడగలదు. రాత్రిపూట కూడా చూడగలదు. కాబట్టి మనం ప్రతిరోజూ దేశంలోని ఏ మూలనైనా స్పష్టమైన చిత్రాన్ని తీయవచ్చు. మేం ఈ డేటాను రెండు రంగాలలో అభివృద్ధి కోసం ఉపయోగిస్తాం. మొదటిది భారతదేశాన్ని అత్యంత సురక్షిత ప్రదేశంగా రూపొందించడం. మేం ప్రతిరోజూ మన సరిహద్దులు, మహాసముద్రాలు, సముద్రాలను పర్యవేక్షిస్తాం. శత్రువు కార్యకలాపాలను పరిశీలిస్తుంటాం. మన సాయుధ దళాలకు ఈ సాంకేతికత ద్వారా ఇంటెలిజెన్స్ సమాచారం అందుతుంది. ఇక రెండవది భారతదేశంలోని రైతులకు సాధికారత కల్పించడం. మేం ఇప్పటికే భారతదేశంలోని రొయ్యల రైతుల కోసం ఒక ఉత్పత్తిని సృష్టించాం. ఇది ప్రస్తుత ధరలో 1/10వ వంతుతో అంతరిక్షం నుండి వారి చెరువుల నీటి నాణ్యతను కొలుస్తుంది. మేం మరింత ముందుకు సాగి, అత్యుత్తమ నాణ్యత ఉండే ఉపగ్రహ చిత్రాలను ప్రపంచానికి అందించాలనుకుంటున్నాం. గ్లోబల్ వార్మింగ్ వంటి అంతర్జాతీయ సమస్యలతో పోరాడేందుకు ప్రపంచానికి అత్యుత్తమ నాణ్యత ఉండే ఉపగ్రహ డేటాను అందించాలనేది మా లక్ష్యం సార్.

ప్రధానమంత్రి: అంటే మీ బృందం కూడా జై జవాన్, జై కిసాన్ అని చెప్తుంది.

రక్షిత్: అవును సార్, ఖచ్చితంగా.

ప్రధానమంత్రి: మిత్రులారా! మీరు ఇంత మంచి పని చేస్తున్నారు. మీ సాంకేతిక పరిజ్ఞానం ఖచ్చితత్వం ఎంతో కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.

రక్షిత్: సార్.. మనం 50 సెంటీమీటర్ల కంటే తక్కువ రిజల్యూషన్‌ పొందగలం. మేం ఒకే సమయంలో సుమారు 300 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రాంతాన్ని చిత్రించగలం.

ప్రధానమంత్రి: సరే... ఇది విని దేశప్రజలు చాలా గర్వపడతారని నేను అనుకుంటున్నాను. నేను మరొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను.

రక్షిత్: సార్.

ప్రధాన మంత్రి: అంతరిక్ష పర్యావరణ వ్యవస్థ చాలా శక్తిమంతంగా మారుతోంది. మీ బృందం ఇప్పుడు ఎలాంటి మార్పులను చూస్తోంది?

కిషన్: సార్.. నా పేరు కిషన్. మేం GalaxEye ప్రారంభించినప్పటి నుండి IN-SPAce రావడాన్ని చూశాం. 'జియో-స్పేషియల్ డేటా పాలసీ', భారత అంతరిక్ష విధానం మొదలైన అనేక విధానాలు రావడాన్ని మేం చూశాం. గత 3 సంవత్సరాలలో చాలా మార్పులు రావడం చూశాం. చాలా ప్రక్రియలు, చాలా మౌలిక సదుపాయాలు, చాలా సౌకర్యాలు ఇస్రో ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ చాలా మంచి మార్గంలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఇస్రోకి వెళ్లి మన హార్డ్‌వేర్‌ని చాలా సులభంగా పరీక్షించవచ్చు. మూడేళ్ల కిందట ఆ ప్రక్రియలు అంతగా లేవు. ఇది మాకు, అనేక ఇతర స్టార్ట్-అప్‌లకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఇటీవలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాల కారణంగా, సౌకర్యాల లభ్యత కారణంగా స్టార్ట్-అప్‌లు రావడానికి చాలా ప్రోత్సాహకాలు ఉన్నాయి. ఈ విధంగా స్టార్ట్-అప్‌లు అభివృద్ధి చెందడం చాలా కష్టంగా, ఖర్చుతో కూడుకుని సమయం తీసుకునే రంగాలలో కూడా చాలా సులభంగా, చాలా బాగా అభివృద్ధి చెందుతాయి. కానీ ప్రస్తుత విధానాలు, ఇన్-స్పేస్ వచ్చిన తర్వాత స్టార్ట్-అప్‌లకు చాలా విషయాలు సులభంగా మారాయి. నా స్నేహితుడు డేనిల్ చావ్రా కూడా దీని గురించి చెప్తాడు.

ప్రధానమంత్రి: డేనిల్.. చెప్పండి...

డేనిల్: సార్... ఇంకో విషయం గమనించాం. ఇంజినీరింగ్ విద్యార్థుల ఆలోచనలో మార్పు కనిపించింది. ఇంతకు ముందు వారు బయటకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలనుకునేవారు. అక్కడ అంతరిక్ష రంగంలో పని చేయాలనుకునేవారు. కానీ ఇప్పుడు భారతదేశంలో అంతరిక్ష పర్యావరణ వ్యవస్థ చాలా బాగా ఉన్నందువల్ల వారు భారతదేశానికి తిరిగి వచ్చి ఈ వ్యవస్థలో పనిచేయడం ప్రారంభించారు. కాబట్టి మాకు చాలా మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. కొంతమంది ఈ కారణం వల్ల విదేశాల నుండి తిరిగి వచ్చి, మా కంపెనీలో పని చేస్తున్నారు.

ప్రధానమంత్రి: కిషన్, డేనిల్ ఇద్దరూ ప్రస్తావించిన అంశాల గురించి ఎక్కువ మంది ఆలోచించరని నేను భావిస్తున్నాను. ఒక రంగంలో సంస్కరణలు జరిగినప్పుడు ఆ సంస్కరణలు ఎన్ని బహుళ ప్రభావాలను కలిగిస్తాయనే వాస్తవాన్ని, ఎంత మంది వ్యక్తులు ప్రయోజనం పొందుతున్నారనే విషయాన్ని చాలా మంది పట్టించుకోలేదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీరు ఆ రంగంలో ఉన్నందు వల్ల ఇది మీ దృష్టికి వస్తుంది. దేశంలోని యువత ఇప్పుడు ఈ రంగంలో తమ భవిష్యత్తును ఉపయోగించాలనుకుంటున్నారని, తమ ప్రతిభను ప్రదర్శించాలనుకుంటున్నారని మీరు గమనించారు. మీ పరిశీలన చాలా బాగుంది. మరో ప్రశ్న అడగాలనుకుంటున్నాను. స్టార్టప్‌లు, అంతరిక్ష రంగంలో విజయం సాధించాలనుకునే యువతకు మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను.

ప్రణీత్: సార్..నేను ప్రణీత్ ను మాట్లాడుతున్నాను. మీ ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను.

ప్రధానమంత్రి: సరే.. ప్రణీత్, చెప్పండి.

ప్రణీత్: సార్… కొన్ని సంవత్సరాల నా అనుభవం నుండి రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అన్నింటిలో మొదటిది మీరు స్టార్ట్-అప్ ప్రారంభించాలనుకుంటే ఇదే మంచి అవకాశం. ఎందుకంటే మొత్తం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంది. దీని అర్థం మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది మేం ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నామని ఇలా 24 ఏళ్ల వయసులో చెప్పడాన్ని నేను గర్వంగా భావిస్తున్నాను. దాని ఆధారంగా మన ప్రభుత్వం కొన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకుంటుంది. దానిలో మాకు చిన్న భాగస్వామ్యం ఉంటుంది. అటువంటి కొన్ని జాతీయ ప్రభావ ప్రాజెక్ట్‌లలో పని చేయండి. ఇది అలాంటి సరైన పరిశ్రమ. ఇది అలాంటి సరైన సమయం. ఇది జాతీయ ప్రభావం కోసం మాత్రమే కాకుండా వారి స్వంత ఆర్థిక వృద్ధికి, ప్రపంచ సమస్యను పరిష్కరించడానికి ఇది ఒక అవకాశమని నా యువ స్నేహితులకు చెప్పాలనుకుంటున్నాను. పెద్దయ్యాక నటులం అవుతాం, క్రీడాకారులం అవుతాం అని చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళం. కాబట్టి ఇక్కడ అలాంటివి జరిగేవి. కానీ పెద్దయ్యాక పారిశ్రామికవేత్త కావాలని, అంతరిక్ష పరిశ్రమలో పనిచేయాలని కోరుకుంటున్నానని ఈ రోజు మనం వింటున్నాం. ఈ మొత్తం పరివర్తనలో చిన్న పాత్ర పోషిస్తున్నందుకు ఇది మాకు చాలా గర్వకారణం.

ప్రధానమంత్రి: మిత్రులారా! ప్రణీత్, కిషన్, డానిల్, రక్షిత్, సూయశ్.. ఒక విధంగా చెప్పాలంటే.. మీ స్నేహం లాగే మీ స్టార్టప్ కూడా దృఢంగా ఉంది. అందుకే మీరు ఇంత అద్భుతమైన పని చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం మద్రాస్‌ ఐఐటి ని సందర్శించే అవకాశం నాకు లభించింది. ఆ సంస్థ గొప్పతనాన్ని ప్రత్యక్షంగా అనుభవించాను. ఏమైనప్పటికీ ఐఐటిల పట్ల ప్రపంచం మొత్తం మీద గౌరవం ఉంది. అక్కడి నుండి బయటకు వచ్చే మన ప్రజలు భారతదేశం కోసం పని చేసినప్పుడు ఖచ్చితంగా ఏదైనా మంచిని అందిస్తారు. మీ అందరికీ- అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న ఇతర స్టార్ట్-అప్‌లందరికీ నేను చాలా చాలా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీ ఐదుగురు స్నేహితులతో మాట్లాడటం నాకు ఆనందాన్ని కలిగించింది. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా!

సూయశ్: చాలా ధన్యవాదాలు సార్!

నా ప్రియమైన దేశవాసులారా! రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువతను రాజకీయ వ్యవస్థతో అనుసంధానించాలని ఈ సంవత్సరం నేను ఎర్రకోట నుండి పిలుపునిచ్చాను. దీనికి నాకు అద్భుతమైన స్పందన వచ్చింది. దీన్నిబట్టి మన యువత ఎంత పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారో అర్థమవుతుంది. వారు సరైన అవకాశం, సరైన మార్గదర్శకత్వం కోసం చూస్తున్నారు. దేశవ్యాప్తంగా యువత నుంచి ఈ అంశంపై నాకు లేఖలు కూడా వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో కూడా విశేష స్పందన వస్తోంది. ప్రజలు కూడా నాకు చాలా రకాల సలహాలు పంపారు. ఇది నిజంగా తమకు ఊహకందని విషయమని కొందరు యువకులు లేఖలో రాశారు. తాతగారికి గానీ తల్లిదండ్రులకు గానీ రాజకీయ వారసత్వం లేకపోవడంతో రాజకీయాల్లోకి రావాలనుకున్నా వారు రాలేకపోయారు. రాలేకపోయింది తమకు అట్టడుగు స్థాయిలో పనిచేసిన అనుభవం ఉందని, ప్రజల సమస్యల పరిష్కారానికి తమ అనుభవం ఉపయోగపడుతుందని కొంతమంది యువకులు రాశారు. కుటుంబ రాజకీయాలు కొత్త ప్రతిభను అణిచివేస్తాయని కూడా కొందరు రాశారు. ఇలాంటి ప్రయత్నాలు మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని కొందరు యువకులు అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై సూచనలను పంపినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని యువత కూడా ఇప్పుడు మన సామూహిక కృషితో రాజకీయాల్లో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. వారి అనుభవం, ఉత్సాహం దేశానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను.

మిత్రులారా! సమాజంలోని వివిధ వర్గాలకు చెంది, రాజకీయ నేపథ్యం లేని అనేక మంది స్వాతంత్య్ర పోరాట సమయంలో కూడా ముందుకు వచ్చారు. భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం తమను తాము త్యాగం చేసుకున్నారు. వికసిత భారతదేశ లక్ష్యాన్ని సాధించడానికి ఈ రోజు మనకు మరోసారి అదే స్ఫూర్తి అవసరం. తప్పకుండా ఈ ప్రచారంలో పాల్గొనమని నా యువ స్నేహితులందరికీ చెప్తాను. మీ ఈ అడుగు మీ భవిష్యత్తును, దేశ భవిష్యత్తును మారుస్తుంది.

నా ప్రియమైన దేశప్రజలారా! ‘హర్ ఘర్ తిరంగా, పూరా దేశ్ తిరంగా’ ప్రచారం ఈసారి పూర్తి స్థాయిలో ఉంది. దేశంలోని నలుమూలల నుండి ఈ ప్రచారానికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించడం చూశాం. స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని చూశాం. ప్రజలు తమ దుకాణాలు, కార్యాలయాల్లో పతాకాన్ని ఎగురవేశారు. తమ డెస్క్‌టాప్‌లు, మొబైళ్లు, వాహనాలపై కూడా త్రివర్ణ పతాకాన్ని ఉంచారు. ప్రజలు ఒకచోట చేరి తమ భావాలను వ్యక్తం చేసినప్పుడు ప్రతి ప్రచారానికి ఊతం లభిస్తుంది. మీరు ప్రస్తుతం మీ టీవీ స్క్రీన్‌పై చూస్తున్న చిత్రాలు జమ్మూ కాశ్మీర్‌లోని రియాసికి చెందినవి. అక్కడ 750 మీటర్ల పొడవైన జెండాతో త్రివర్ణ పతాక ర్యాలీని నిర్వహించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జిపై ఈ ర్యాలీ జరిపారు. ఈ చిత్రాలను చూసిన వారందరికీ ఆనందం కలిగింది. శ్రీనగర్‌లోని దాల్ లేక్‌లో త్రివర్ణ పతాక యాత్రకు సంబంధించిన అందమైన చిత్రాలను అందరం చూశాం. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈస్ట్ కామెంగ్ జిల్లాలో 600 అడుగుల పొడవైన త్రివర్ణ పతాకంతో యాత్ర నిర్వహించారు. అదేవిధంగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ అన్ని వయసుల వారు ఇలాంటి త్రివర్ణ పతాక ఊరేగింపుల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం ఇప్పుడు సామాజిక పర్వదినంగా మారుతోంది. మీరు కూడా దీన్ని అనుభూతి చెంది ఉండవచ్చు. ప్రజలు తమ ఇళ్లను త్రివర్ణ మాలలతో అలంకరిస్తారు. స్వయం సహాయక సంఘాలతో సంబంధం ఉన్న మహిళలు లక్షల జెండాలను తయారు చేస్తారు. ఇ-కామర్స్ వేదికలో త్రివర్ణ రంగులో ఉన్న వస్తువుల విక్రయం పెరుగుతుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని నలుమూలల, నేల- నీరు-ఆకాశంలో ఎక్కడ చూసినా మన జెండా మూడు రంగులే కనిపించాయి. హర్ ఘర్ తిరంగా వెబ్‌సైట్‌లో కూడా ఐదు కోట్లకు పైగా సెల్ఫీలు పోస్ట్ అయ్యాయి. ఈ ప్రచారం మొత్తం దేశాన్ని ఒక చోట చేర్చింది. ఇదే 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్'.

నా ప్రియమైన దేశవాసులారా! మనుషులు, జంతువుల ప్రేమపై మీరు చాలా సినిమాలు చూసి ఉంటారు. అయితే ఈ రోజుల్లో అస్సాంలో ఓ రియల్ స్టోరీ తయారవుతోంది. అస్సాంలోని తిన్ సుకియా జిల్లాలోని చిన్న గ్రామం బారేకురీలో, మోరాన్ ఆదివాసీ తెగకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ఇదే గ్రామంలో 'హూలాక్ గిబన్లు' కూడా నివసిస్తున్నాయి. వాటిని అక్కడ 'హోలో కోతులు' అని పిలుస్తారు. హూలాక్ గిబ్బన్లు ఈ గ్రామంలోనే తమ నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు- ఈ గ్రామ ప్రజలకు హూలాక్ గిబ్బన్‌లతో చాలా లోతైన అనుబంధం ఉంది. ఇప్పటికీ గ్రామ ప్రజలు తమ సంప్రదాయ విలువలను పాటిస్తున్నారు. అందువల్ల గిబ్బన్లతో తమ సంబంధాన్ని మరింత బలోపేతం చేసే అన్ని పనులను చేశారు. గిబ్బన్లు అరటిపండ్లను ఇష్టపడతాయని తెలుసుకున్న వారు అరటి సాగును కూడా ప్రారంభించారు. అంతే కాకుండా గిబ్బన్ల జనన మరణాలకు సంబంధించిన ఆచారాలను మనుషులకు చేసే విధంగానే నెరవేర్చాలని నిర్ణయించుకున్నారు. వారు గిబ్బన్లకు పేర్లు కూడా పెట్టారు. ఇటీవల సమీపంలోని విద్యుత్ తీగల వల్ల గిబ్బన్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అటువంటి పరిస్థితిలో, ఈ గ్రామ ప్రజలు ఈ విషయాన్ని ప్రభుత్వం ముందు ఉంచారు. త్వరలోనే దాని పరిష్కారం లభించింది. ఇప్పుడు ఈ గిబ్బన్లు ఫోటోలకు కూడా పోజులిస్తాయని నాకు తెలిసింది.

స్నేహితులారా! అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన మన యువ స్నేహితులు కూడా జంతువులపై ప్రేమలో వెనుకాడరు. అరుణాచల్‌లోని మన యువ స్నేహితులు కొందరు 3-డి ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించడం ప్రారంభించారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే కొమ్ములు, దంతాల కోసం అడవి జంతువులను వేటాడకుండా కాపాడాలని వారు కోరుకుంటారు. నాబమ్ బాపు, లిఖా నానా నేతృత్వంలో ఈ బృందం జంతువులలోని వివిధ భాగాలను 3-డి ప్రింటింగ్ చేస్తుంది. జంతువుల కొమ్ములు కావచ్చు. దంతాలు కావచ్చు. వీటన్నింటినీ 3-డి ప్రింటింగ్ ద్వారా రూపొందిస్తారు. వీటి నుండి దుస్తులు, టోపీలు వంటి వాటిని తయారు చేస్తారు. బయో-డిగ్రేడబుల్ సామగ్రిని ఉపయోగించే అద్భుతమైన ప్రత్యామ్నాయం ఇది. ఇలాంటి అద్భుతమైన ప్రయత్నాలను ఎంత ప్రశంసించినా తక్కువే. మన జంతువుల రక్షణ కోసం, సంప్రదాయ పరిరక్షణ కోసం ఈ రంగంలో మరిన్ని స్టార్టప్‌లు రావాలని నేను చెప్తాను.

నా ప్రియమైన దేశప్రజలారా! మధ్యప్రదేశ్‌లోని ఝాబువాలో ఒక అద్భుతం జరుగుతోంది. దాని గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. మన పారిశుద్ధ్య కార్మిక సోదర సోదరీమణులు అక్కడ అద్భుతాలు చేశారు. ఈ సోదర సోదరీమణులు ' వ్యర్థం నుండి సంపద' అనే సందేశాన్ని వాస్తవంగా మార్చి, మనకు చూపించారు. ఈ బృందం ఝాబువాలోని ఒక పార్కులో చెత్త నుండి అద్భుతమైన కళాకృతులను రూపొందించింది. ఇందుకోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలు, సీసాలు, టైర్లు, పైపులను సేకరించారు. ఈ కళాఖండాలలో హెలికాప్టర్లు, కార్లు, ఫిరంగులు కూడా ఉన్నాయి. అందమైన వేలాడే పూల కుండీలను కూడా తయారు చేశారు. వాడిన టైర్లను ఇక్కడ సౌకర్యవంతమైన బెంచీల తయారీకి ఉపయోగించారు. ఈ పారిశుద్ధ్య కార్మికుల బృందం రెడ్యూస్, రీ యూజ్, రీసైకిల్ అనే మంత్రాన్ని స్వీకరించింది. వారి కృషి వల్ల పార్క్ చాలా అందంగా కనిపించడం ప్రారంభించింది. దీన్ని చూసేందుకు స్థానికులే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లో నివసించే వారు కూడా అక్కడికి చేరుకుంటున్నారు.

మిత్రులారా! ఈ రోజు మన దేశంలో అనేక స్టార్టప్ టీమ్‌లు కూడా పర్యావరణాన్ని ప్రోత్సహించే ఇటువంటి ప్రయత్నాలలో పాలుపంచుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఇ-కాన్షస్ పేరుతో ఉన్న ఒక బృందం పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేయడానికి ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగిస్తోంది. మన పర్యాటక ప్రదేశాలలో- ముఖ్యంగా కొండ ప్రాంతాలలో- పేరుకుపోయిన చెత్తను చూసిన తర్వాత వారికి ఈ ఆలోచన వచ్చింది. అలాంటి వారితో కూడిన మరో బృందం ఎకోకారీ అనే స్టార్టప్‌ను ప్రారంభించింది. ఆ బృందం ప్లాస్టిక్ వ్యర్థాల నుండి వివిధ అందమైన వస్తువులను తయారు చేస్తుంది.

మిత్రులారా! టాయ్ రీసైక్లింగ్ అనేది మనం కలిసి పని చేసే మరొక రంగం. చాలా మంది పిల్లలు బొమ్మలతో ఎంత త్వరగా విసుగు చెందుతారో కూడా మీకు తెలుసు. అదే సమయంలో ఆ బొమ్మలను ఆరాధిస్తూ కలలు కనే పిల్లలు కూడా ఉన్నారు. మీ పిల్లలు ఇకపై ఆడని బొమ్మలను వాటిని ఉపయోగించే ప్రదేశాలకు విరాళంగా ఇవ్వవచ్చు. పర్యావరణ పరిరక్షణకు ఇది కూడా మంచి మార్గం. మనందరం కలిసికట్టుగా కృషి చేస్తేనే పర్యావరణం పటిష్టంగా మారి దేశం కూడా పురోగమిస్తుంది.

నా ప్రియమైన దేశవాసులారా! కొద్ది రోజుల క్రితం ఆగస్టు 19వ తేదీన రక్షాబంధన్ పండుగను జరుపుకున్నాం. అదే రోజున ప్రపంచ వ్యాప్తంగా ‘ప్రపంచ సంస్కృత దినోత్సవం’ కూడా జరుపుకున్నారు. నేటికీ భారతదేశంతో పాటు విదేశాలలో కూడా సంస్కృతంతో ప్రజలకు ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో సంస్కృత భాషపై వివిధ రకాల పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతున్నాయి. మనం తర్వాతి సంభాషణ కొనసాగించే ముందు మీ కోసం చిన్న ఆడియో క్లిప్‌ వినిపిస్తున్నాను.

 

## ఆడియో క్లిప్####

మిత్రులారా! ఈ ఆడియో యూరప్‌లోని లిథువేనియా దేశానికి సంబంధించింది. అక్కడి ప్రొఫెసర్ వైటిస్ విదునాస్ అద్వితీయమైన ప్రయత్నం చేసి దానికి ‘నదులపై సంస్కృతం’ అని పేరు పెట్టారు. అక్కడి నెరిస్ నది ఒడ్డున ఒక సమూహం గుమిగూడి వేదాలు, గీతా పఠించారు. అక్కడ గత కొన్నేళ్లుగా అలాంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మీరు కూడా సంస్కృతాన్ని ముందుకు తీసుకెళ్లే ఇలాంటి ప్రయత్నాలను ముందుకు తీసుకువస్తూ ఉండండి.

నా ప్రియమైన దేశప్రజలారా! మనందరి జీవితాల్లో ఫిట్‌నెస్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఫిట్‌గా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లు, జీవనశైలిపై శ్రద్ధ పెట్టాలి. ఫిట్‌నెస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘ఫిట్ ఇండియా క్యాంపెయిన్’ ప్రారంభమైంది. వయస్సు, వర్గాలతో సంబంధం లేకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండటానికి యోగాను అవలంబిస్తున్నారు. ప్రజలు ఇప్పుడు తమ భోజనంలో సూపర్‌ఫుడ్ మిల్లెట్లకు- అంటే శ్రీ అన్నకి- స్థానం ఇవ్వడం ప్రారంభించారు. ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలన్నదే ఈ ప్రయత్నాల లక్ష్యం.

మిత్రులారా! మన కుటుంబం, మన సమాజం, మన దేశం- వారందరి భవిష్యత్తు మన పిల్లల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. పిల్లల మంచి ఆరోగ్యం కోసం వారు సరైన పోషకాహారాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. పిల్లల పౌష్టికాహారం దేశం ప్రాధాన్యత. మనం ఏడాది పొడవునా వారి పోషణపై శ్రద్ధ చూపినప్పటికీ ఒక నెల పాటు దేశం దానిపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. దీని కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 1వ తేదీ నుండి సెప్టెంబరు 30వ తేదీ మధ్య పోషకాహార మాసాన్ని జరుపుకుంటారు. పౌష్టికాహారంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోషకాహార మేళా, రక్తహీనత శిబిరం, నవజాత శిశువుల ఇంటి సందర్శన, సెమినార్, వెబ్‌నార్ వంటి అనేక పద్ధతులను అవలంబిస్తున్నారు. అనేక చోట్ల అంగన్‌వాడీల నిర్వహణలో మాతా శిశు కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పోషకాహార లోపం ఉన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువుల తల్లుల ఆరోగ్యంపై శ్రద్ద పెడుతుంది. వారిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. వారి పోషకాహారానికి ఏర్పాట్లు చేస్తుంది. గతేడాది నూతన విద్యా విధానానికి పౌష్టికాహార ప్రచారాన్ని అనుసంధానం చేశారు. ‘పోషణ్ భీ పఢాయీ భీ’ ప్రచారం పిల్లల సమతుల అభివృద్ధిపై దృష్టి సారించింది. మీ ప్రాంతంలో పోషకాహార అవగాహన ప్రచారంలో మీరు కూడా చేరాలి. పోషకాహార లోపానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో మీ చిన్న ప్రయత్నం ఎంతో దోహదపడుతుంది.

నా ప్రియమైన దేశవాసులారా! ఈసారి 'మన్ కీ బాత్'లో ఇంతే. 'మన్ కీ బాత్'లో మీతో మాట్లాడటం నాకు ఎప్పుడూ గొప్పగా అనిపిస్తుంది. నేను నా కుటుంబ సభ్యులతో కూర్చుని తేలికపాటి వాతావరణంలో నా మనసులోని మాటలను పంచుకున్నట్టు అనిపిస్తుంది. మీ మనసులతో అనుసంధానమవుతున్నాను. మీ అభిప్రాయాలు, సూచనలు నాకు చాలా విలువైనవి. మరికొద్ది రోజుల్లో ఎన్నో పండుగలు వస్తున్నాయి. ఆ పండుగల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జన్మాష్టమి పండుగ కూడా ఉంది. వచ్చే నెల ప్రారంభంలో వినాయక చవితి పండుగ కూడా ఉంది. ఓనం పండుగ కూడా దగ్గరలోనే ఉంది. మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను.

మిత్రులారా! ఈ నెల 29వ తేదీన 'తెలుగు భాషా దినోత్సవం' కూడా ఉంది. ఇది నిజంగా చాలా అద్భుతమైన భాష. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడేవారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న

తెలుగు వారికి

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

మిత్రులారా! ఈ వర్షాకాలంలో మీరందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాను. 'క్యాచ్ ద రెయిన్ మూవ్‌మెంట్'లో కూడా భాగస్వాములు కావాలని నా అభ్యర్థనను తెలియజేస్తున్నాను. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారాన్ని మీ అందరికీ గుర్తు చేయాలనుకుంటున్నాను. వీలైనన్ని ఎక్కువ చెట్లను నాటండి. ఇతరులను కూడా అలాగే చేయమని ప్రోత్సహించండి. మరికొద్ది రోజుల్లో పారిస్‌లో పారాలింపిక్స్ ప్రారంభమవుతాయి. మన దివ్యాంగ సోదర సోదరీమణులు అక్కడికి చేరుకున్నారు. 140 కోట్ల భారతీయులు మన అథ్లెట్లను, క్రీడాకారులను ఉత్సాహపరుస్తున్నారు. మీరు #cheer4bharatతో మన క్రీడాకారులను ప్రోత్సహించండి. వచ్చే నెలలో మరోసారి అనుసంధానమై అనేక అంశాలపై చర్చిద్దాం. అప్పటి వరకు నాకు వీడ్కోలు చెప్పండి. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage