Impact and Influence of Swami Vivekananda Remains Intact in Our National life: PM
Exhorts Youth to Contribute Selflessly and Constructively in Politics
Political Dynasty is the Major Cause of Social Corruption: PM

నమస్కారం!
అన్నింటికంటే ముందుగా ఈ ముగ్గురు యువకులకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వీరు సన్మార్గంలో పయనిస్తున్నారు, ఉత్తమమైన ఆలోచనలను, చక్కటి వక్తృత్వ కళను ప్రదర్శించారు. ఆలోచనలు, సిద్ధాంత ప్రవాహాన్ని చాలా చక్కగా వీరు వెల్లడించారు. వారి వ్యక్తిత్వంలో ఆత్మవిశ్వాసం నిండి ఉంది. ఈ ముగ్గురితోపాటు మన విజేతలుగా నిలిచిన యువ మిత్రులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.
లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా జీ, విద్యామంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ నిశంక్ జీ, క్రీడలు, యువజన సర్వీసుల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు జీ, దేశ యువ మిత్రులారా.. మీ అందరికీ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.
స్వామీ వివేకానందుని జయంతి మనందరికీ సరికొత్త ప్రేరణను అందిస్తుంది. ఈ ఏడాది యూత్ పార్లమెంటు ఉత్సవం పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరగడం ఈసారి ప్రత్యేకత. ఈ సెంట్రల్ హాల్ మన రాజ్యాంగ నిర్మాణానికి ప్రత్యక్ష సాక్షి. ఎందరోమంది మహానుభావులు, స్వాతంత్ర్య భారతం కోసం ఎన్నో నిర్ణయాలను ఈ వేదిక ద్వారానే తీసుకున్నారు. ఇక్కడే భవిష్యత్ భారతం కోసం సమాలోచనలు చేశారు. భవిష్యత్ భారతం కోసం వారి కలలను, వారి సమర్పణ భావాన్ని, వారి సాహసాన్ని, వారి సామర్థ్యాన్ని, వారి ప్రయత్నాలన్నింటికీ ఈ సెంట్రల్ హాల్ సాక్షీభూతంగా నిలిచింది. మిత్రులారా, మీరు కూర్చున్న ఈ స్థలంలోనే రాజ్యాంగ రూపకల్పన జరిగింది.. ఈ దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం మహానుభావులు మీరు కూర్చున్న సీట్లోనే కూర్చున్నారు. ఇవాళ ఆ సీట్లో మీరు కూర్చున్నారు. దేశంలోని మహాపురుషులు కూర్చున్న స్థలంలో మీరు కూర్చున్న ఈ సమయాన్ని మీ మనస్సులో ఊహించుకోండి. దేశానికి మీపై ఎన్నోఆశలు, ఆకాంక్షలు ఉన్నాయి. సెంట్రల్ హాల్లో కూర్చున్న యువ మిత్రులందరూ ఈ ఆశలు, ఆకాంక్షల గురించి ఆలోచిస్తారనే విశ్వాసం నాకుంది.
మీరందరూ ఇక్కడ విభిన్నమైన ఆలోచనలను చర్చించారు, మథనం చేశారు. అవన్నీ ఎంతో విలువైనవి. ఈసారి పోటీల్లో గెలిచిన వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇక్కడ యువ మిత్రుల మాటలను వింటున్నప్పుడు నా మనసులో ఓ ఆలోచన వచ్చింది. మీ ప్రసంగాలపై నా ట్వీటర్ హ్యండిల్ ద్వారా పోస్టు చేస్తాను. మీ ముగ్గురి గురించి ట్వీట్ చేస్తాను. ఒకవేళ రికార్డెడ్ మెటీరియల్ అందుబాటులో ఉంటే.. నిన్నటి ఫైనల్ ప్యానల్ ఉన్న వారందరి ప్రసంగాలను ట్వీట్ చేస్తాను. నా ప్రయత్నం ద్వారా పార్లమెంటు వేదిక ద్వారా భావిభారతం రూపుదిద్దుకుంటోందనే విషయం యావద్దేశానికి తెలుస్తుంది. ఇవాళ మీ ప్రసంగాలను ట్వీట్ చేయడాన్ని గర్వంగా భావిస్తున్నాను.
మిత్రులారా,
స్వామీ వివేకానంద చేసిన బోధనలు.. ప్రాంతం, సమయం, వయసుతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడికీ మార్గదర్శనం చేస్తాయి. స్వామీ వివేకానందుడి సందేశంతో అనుసంధానం కాని వ్యక్తి గానీ, వారి బోధనల స్ఫూర్తి పొందని గ్రామం గానీ, నగరం గానీ ఉండరనేది నా ప్రగాఢ విశ్వాసం. స్వామీజీ బోధనలు, సందేశం.. భారత స్వాతంత్ర్య సంగ్రామానికి కూడా కొత్త ప్రేరణను కలిగించింది. సుదీర్ఘమైన వలసపాలకుల సమయంలో.. వేల ఏళ్ల మన శక్తిసామర్థ్యాల నుంచి మనం దూరమయ్యాం. కానీ స్వామీ వివేకానందుడు మనలో నిబిడీకృతమైన ఆ శక్తిసామర్థ్యాలను మరోసారి జాగృతం చేశారు. మన సామర్థ్యాన్ని, మన మనస్సు-ఆలోచనను పునరుజ్జీవింపజేశారు. జాతీయ చైతన్యాన్ని జాగృతపరిచారు. మీకో విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆనాడు దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావాలని విప్లవ మార్గంలో, శాంతి మార్గంలో తమకు తోచిన పద్ధతిలో ప్రయత్నిస్తున్న అందరూ.. స్వామీ వివేకానందుడి నుంచి ప్రేరణ పొందిన వారే. వారిని అరెస్టు చేస్తున్న సమయంలోనో, వారి స్థావరాల్లో తనిఖీలు చేస్తున్న సమయంలోనో.. వారిని ఉరితీస్తున్న సమయంలోనో.. వారివద్ద వివేకానందుడికి సాహిత్యం పోలీసుల చేతికి చిక్కేది. అసలు స్వామీ వివేకానందుని రచనల్లో, ఆలోచనల్లో దేశభక్తి కోసం, జాతి నిర్మాణం కోసం, స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసేందుకు ప్రేరణ ఇవ్వడంతోపాటు.. ప్రతి నవయువకుడి మస్తిష్కాన్ని ఇంతగా ప్రభావితం చేసేలా ఏముందని బ్రిటిష్ పాలకులు అధ్యయనం చేయించారు. ఆ తర్వాత కాలం మారింది, దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.. కానీ ఇవాళ్టికి కూడా స్వామీజీ మన మధ్యలోనే ఉంటారు. ప్రతిక్షణం మనకు ప్రేరణ అందిస్తూనే ఉంటారు. వారి ప్రభావం మన ఆలోచనల్లో ఎక్కడో ఒకచోట స్పష్టంగా కనబడుతుంది. ఆధ్యాత్మికత, జాతీయవాదం, జాతి నిర్మాణం, దేశహితం, జనసేవ సంబంధిత అంశాల్లో స్వామీజీ చేసిన సూచనలు మన మనసుల్లో బలంగా నాటుకుపోయాయి. మన యువమిత్రులు కూడా ఈ అంశాన్ని తమన జీవితాల్లో స్వామీజీ బోధనల ప్రభావాన్ని గుర్తించిఉంటారని నేను విశ్వసిస్తున్నాను. ఎక్కడైనా స్వామీ వివేకానందుడి చిత్రపటం కనిపించగానే.. మనస్సులో శ్రద్ధ, ఓ గౌరవభావం జాగృతమై.. ఆ చిత్రపటానికి దండం పెట్టుకోవడం మనందరికీ అనుభవంలో ఉన్న అంశం.
మిత్రులారా,
స్వామీ వివేకానంద మనకో విలువైన కానుక ఇచ్చారు. వ్యక్తిత్వ నిర్మాణం, వ్యవస్థల నిర్మాణమే ఆ విలువైన కానుక. దీనిపై చాలా తక్కువగా చర్చ జరుగుతుంది. కానీ.. దీనిపై మనం అధ్యయనం చేస్తే.. స్వామీ వివేకానందుడు.. వ్యక్తి నిర్మాణ మహత్కార్యాన్ని సమర్థవతంగా ముందుకు తీసుకెళ్తున్న విలువైన సంస్థలను ఏర్పాటుచేసి ముందుకుతీసుకెళ్లారనే విషయం మనకు అవగతం అవుతుంది. వారి సంస్కారం, వారి సేవాభావం, వారి సమర్పణాభావం నిరంతరం మన సమాజంలో జాగృతమవుతూనే ఉన్నాయి. వ్యక్తి ద్వారా వ్యవస్థ నిర్మాణం.. వ్యవస్థల ద్వారా ఎందరోమంది వ్యక్తుల నిర్మాణం అనేది ఓ అనవరత, ఆలస్యం లేకుండా, నిరంతరంగా జరిగే చక్రప్రక్రియ. ఇది కొనసాగుతూనే ఉంటుంది. స్వామీజీ ప్రభావం ఉన్నవారు.. కొత్త వ్యవస్థల నిర్మాణానికి ప్రేరణ పొందుతారు. సంస్థలను, వ్యవస్థలను నిర్మించి.. స్వామీజీ బోధనల మార్గంలో ప్రయాణిస్తూ.. కొత్త వ్యక్తులను ఈ సిద్ధాంతంతో అనుసంధానం చేస్తూ ముందుకెళ్తారు. వ్యక్తుల నుంచి వ్యవస్థలు, వ్యవస్థలనుంచి వ్యక్తుల నిర్మాణ చక్రమే నేటికీ భారతదేశానికి ఓ బలమైన శక్తి. మీరందరూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి చాలా వినే ఉంటారు. అది కూడా దాదాపుగా ఇలాంటిదే. ఓ తెలివైన వ్యక్తి ఓ మంచి కంపనీని స్థాపిస్తారు.. ఆ తర్వాత ఆయన ఏర్పర్చే వ్యాపారానుకూల వాతావరణంతో ఆ కంపెనీ మరెందరో తెలివైన వ్యక్తులను తయారుచేస్తుంది. వీరు మరింత ముందుకెళ్లి కొత్త సంస్థలను ఏర్పాటుచేసి.. మరికొంతమంది తమలాంటి వారిని తయారుచేస్తారు. ఈ చక్రం దేశం, సమాజంలోని ప్రతి రంగానికి అంతే విలువైనది.
మిత్రులారా,
నేడు దేశంలో నూతన జాతీయ విద్యావిధానం అమల్లోకి వచ్చింది. దీని ప్రధాన లక్ష్యం కూడా.. చక్కటి వ్యక్తిత్వ నిర్మాణం చేయడమే. వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా జాతినిర్మాణం ఈ విధానం, యువత ఆకాంక్షలు, వారి నైపుణ్యత, వారి ఆలోచన, వారి నిర్ణయాలకు ప్రాధాన్యత కల్పిస్తోంది. ఇకపై వారు తమకు నచ్చిన విషయాలను ఎంచుకోవచ్చు.. నచ్చిన కాంబినేషన్లలో, స్ట్రీమ్ లలో విద్యాభ్యాసం చేయవచ్చు. ఒక కోర్సు ను బ్రేక్ చేసి మరో కోర్సులో చేరాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. అలాగని.. ఇంతకుముందు నేర్చుకున్న కోర్సులు, మీ కష్టం వ్యర్థమవుతాయని అనుకోవద్దు. ఆ చదువుకు తగిన సర్టిఫికెట్ కూడా దొరుకుతుంది.. కొత్త విధానాన్ని కూడా కొనసాగించవచ్చు.
మిత్రులారా,
విదేశాల్లో అందుబాటులో ఉండే ఏయే విద్యావకాశాల కోసం మన యువత ఎదురుచూసేదో.. అలాంటి ఎకోసిస్టమ్‌నే నేడు మన దేశంలో అందుబాటులోకి తీసుకొస్తున్నాము. అక్కడి ఆధునిక విద్య, చక్కటి వ్యాపార అవకాశాలు, టాలెంట్ ను గుర్తించడం, గౌరవప్రదమైన వ్యవస్థ వంటివి సహజంగానే మన విద్యార్థులను ఆకర్షించేవి. అలాంటి వ్యవస్థనే మన దేశంలో అందుబాటులోకి తీసుకురావాలని మేం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాం. మన యువత ధైర్యంగా తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ.. తన కలలను సాకారం చేసుకుంటూ స్వయం అభివృద్ధి చేసుకునేందుకు ఆవశ్యకమైన వాతావరణాన్ని రూపొందించడం జరుగుతోంది. విద్యావ్యవస్థ అయినా.. సమాజ వ్యవస్థ అయినా.. చట్టపరమైన సూక్ష్మ నైపుణ్యాలయినా.. ప్రతి అంశంలో ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవడం జరుగుతోంది. స్వామి వివేకానందుడి బోధనలు కూడా ఈ అంశాలను స్పష్టం చేస్తాయి. దాన్ని మనం ఎప్పుడూ విస్మరించకూడదు. ఈ అంశాలతోపాటు, శారీరక దృఢత్వం పైన, మానసిక స్థైర్యాన్ని పెంచుకోవడాన్ని కూడా ఆయన నొక్కిచెప్పేవారు. ఇనుప కండలు, ఉక్కునరాలు అన్న వారి సందేశాల ప్రస్తావనను స్ఫూర్తిగా తీసుకుని భారతదేశ యువత శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవడంపై ప్రత్యేక దృష్టిసారించాలి. ఈ దిశగా ఫిట్ ఇండియా ఉద్యమమైనా.. యోగ విషయంలో చైతన్యమైనా.. క్రీడలకు సంబంధించిన ఆధునిక మౌలికవసతుల కల్పన అయినా.. యువతను అన్ని రకాలుగా సుదృఢపరిచేందుకే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
మిత్రులారా,
ఈ మధ్య మీరు పర్సనాలిటీ డెవలప్‌మెంట్, టీమ్ మేనేజ్‌మెంట్ అనే మాటను తరచుగా వింటున్నాం. స్వామీ వివేకానందుడిని అధ్యయనం చేస్తే ఈ విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ను వివేకానందుడు ‘మీపై మీరు విశ్వాసాన్ని ఉంచండి’ (బిలీవ్ ఇన్ యువర్‌సెల్ఫ్) అని చెప్పారు. లీడర్‌షిప్ విషయంలో.. ‘అందరిపైనా విశ్వాసం ఉంచండి’ (బిలీవ్ ఇన్ ఆల్) అని బోధించారు. ‘పురాణాల ప్రకారం.. ఈశ్వరుడిపై విశ్వాసం ఉంచని వారిని నాస్తికులు అంటారు. కానీ ప్రస్తుత ధర్మం ప్రకారం.. తనపై తాను విశ్వాసం ఉంచని వాడే నాస్తికుడిగా చెప్పుకోవచ్చు’ అని స్వామీ వివేకానందుడు వివరించారు. నాయకత్వానికి సంబంధించిన విషయం వచ్చినపుడు.. వారు తనకంటే ముందు.. తన బృందం (టీమ్)పై విశ్వాసాన్ని ఉంచేవారు. నేనెక్కడో చదివాను. ఆ విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఓసారి స్వామి వివేకానంద.. తన సహచరుడైన స్వామి శారదానందజీ తో కలిసి లండన్‌లో ఓ బహిరంగ ఉపన్యాసం ఇచ్చేందుకు వెళ్లారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆహుతులందరూ వచ్చేశారు. సహజంగానే.. వీరిలో అధికులు.. స్వామీ వివేకానందుడి వాణిని వినేందుకు ఉత్సాహంగా వచ్చినవారే. ప్రసంగంలో వారి వంతు రాగానే.. స్వామీ వివేకానందుల వారు వేదికపైకి వచ్చి.. ఈసారి నా బదులుగా స్వామీ శారదానంద జీ ప్రసంగిస్తారని తెలిపారు. ఈ విషయాన్ని స్వామీ శారదానందజీ కూడా ఊహించలేదు. ఈ ప్రసంగానికి వారు సిద్ధంగా కూడా లేరు. కానీ ఎప్పుడైతే స్వామి శారదానందజీ ప్రసంగాన్ని ప్రారంభించారో.. ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా, ఆసక్తిగా ఆలకిస్తున్నారు. వారి ప్రసంగానికి ముగ్ధులయ్యారు. ఇదే నాయకత్వ లక్షణం. తనతోపాటు తన బృంద సభ్యులపై విశ్వాసాన్ని ఉంచడం. ఇవాళ మనం ఎంతవరకు స్వామీ వివేకానందుడి గురించి తెలుసుకుంటున్నామో.. అందులో స్వామీ శారదానందులవారి పాత్ర కూడా ఉందనే విషయాన్ని మనం మరవొద్దు.
మిత్రులారా,
స్వామీజీయే నిర్భయులు, సాహసీకులు, స్వచ్ఛహృదయులు, ధైర్యవంతులు, ఆకాంక్షలు నిండిన యువకులే పునాదులుగా దేశపు భవిష్యత్తు నిర్మాణమౌతుందని ఆ రోజుల్లో అన్నారు. ఆయన యువకులపై, యువశక్తిపై ఇంతటి నమ్మకాన్ని కలిగి ఉండేవారు. ఆయన మీ పై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాల్సిన బాధ్యత మీ వంటి యువకులపైనే ఉంది. మీలో కొందరు మేమింకా చిన్నవాళ్లమేనని అనుకోవచ్చు. ఇప్పుడింకా ఆడుతూ, పాడుతూ, జీవితంలో ఆనందాన్ని అనుభవించే వయస్సే కదా అని అనుకోవచ్చు. మిత్రులారా… లక్ష్యం విషయంలో స్పష్టత ఉన్నప్పుడు, దానిని సాధించాలన్న పట్టుదల ఉన్నప్పుడు వయసు అడ్డంకి కాబోదు. అసలు వయస్సుతో పనిలేదు. గుర్తుంచుకొండి… స్వాతంత్ర్య సమయంలో పోరాటానికి నాయకత్వం వహించింది యువతరమే. ఉరికంబం ఎక్కే సమయంలో అమరవీరుడు ఖుదీరామ్ బోస్ వయసెంతో తెలుసా? కేవలం 18-19 ఏళ్లు. భగత్ సింగ్ ఉరికంబం ఎక్కినప్పుడు ఆయన వయసెంత? కేవలం 24 ఏళ్లు. భగవాన్ బిర్సా ముండా పోరాటంలో అమరుడైనప్పుడు ఆయన వయసెంత? కేవలం 25 సంవత్సరాలు. ఆనాటి యువతరం దేశం కోసం జీవించాలని, దేశ స్వాతంత్ర్యం కోసం మరణించాలని దృఢ సంకల్పం చేసుకున్నారు. లాయర్లుగా, డాక్టర్లుగా, ప్రొఫెసర్లుగా, బ్యాంకర్లుగా, వివిధ వృత్తుల్లో పనిచేసేవారుగా ఉన్న యువకులే ముందుకు వచ్చారు. మనకు స్వాతంత్ర్యాన్ని అందించారు.
మిత్రులారా,
మనం స్వాతంత్ర్యం వచ్చాక పుట్టిన వాళ్లం. నేను కూడా స్వతంత్ర భారత దేశంలోనే జన్మించాను. నేను పరాధీనతను చూడలేదు. నా ముందు కూర్చున్న మీరందరూ కూడా స్వాతంత్ర్య భారత దేశంలోనే జన్మించారు. మనకు దేశ స్వాతంత్ర్యం కోసం చనిపోయే అవకాశం దొరకలేదు. కానీ స్వతంత్ర భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం మాత్రం తప్పకుండా లభించింది. ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. దేశంలోని నా యువ మిత్రులారా… స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలు అయిన నాటి నుంచి వంద సంవత్సరాలు పూర్తయ్యే వరకూ రానున్న 25-26 సంవత్సరాల మన ప్రయాణానికి చాలా ప్రాధాన్యం ఉంది. 2047 లో మనకి స్వాతంత్ర్యం వచ్చి వంద సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ రానున్న 25-26 సంవత్సరాల యాత్ర చాలా ముఖ్యమైనది. మిత్రులారా… ఆలోచించండి. మీరు ప్రస్తుతం ఉన్న వయసునుంచే ఈ సమయం ప్రారంభమౌతుంది. ఇది మీ జీవితాల్లో బంగారు కాలం. అత్యుత్తమమైన సమయం. ఇదే కాలఖండం భారత్ ను వంద సంవత్సరాల వైపు తీసుకువెళ్తోంది. అంటే మీ అభివృద్ధిలో కొత్త ఎత్తులకు చేరుకోవడం, స్వతంత్ర భారతదేశపు వందవ సంవత్సరం నాటికి సాధించిన విజయాలు – ఈ రెండూ అడుగులో అడుగు కలిపి ముందుకు వెళ్లబోతున్నాయి. అంటే మీ జీవితంలో రానున్న పాతికేళ్లు, దేశపు రానున్న పాతికేళ్లలో చాలా సామంజస్యం ఉంది. ఈ కాలఖండానికి చాలా ప్రాముఖ్యం ఉంది. మీ జీవితంలోని ఈ కాలంలో దేశానికి సర్వోచ్చ ప్రాథమ్యాన్ని ఇవ్వండి. దేశ సేవకు ఇవ్వండి. వివేకానందుడు ఈ శతాబ్దం భారతదేశానిదేనని అంటుండే వారు. ఈ శతాబ్దాన్ని భారతదేశపు శతాబ్దంగా మీరే చేయాలి. మీరేం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా దానిలో దేశానికి ఎలాంటి లాభం కలుగుతుందన్న విషయాన్ని తప్పనిసరిగా ఆలోచించండి.
మిత్రులారా,
మన యువత ముందుకు వచ్చి దేశానికి భాగ్యవిదాతలు కావాలని స్వామీ వివేకానంద అంటూండేవారు. కాబట్టి భారత దేశపు భవిష్యత్తుకు నాయకత్వం వహించడం మీ బాధ్యత. దేశ రాజకీయాల విషయంలోనూ మీకు బాధ్యత ఉంది. ఎందుకంటే దేశంలో సార్థకమైన మార్పు తెచ్చేందుకు రాజకీయాలు ఒక బలమైన మాధ్యమం. అన్ని రంగాల్లో లాగానే రాజకీయాల్లోనూ యువత అవసరం చాలా ఉంది. కొత్త ఆలోచనలు, కొత్త చైతన్యం, కొత్త కలలు, కొంగొత్త ఆకాంక్షలు - దేశ రాజకీయాల్లో ఇవి చాలా అవసరం.
మిత్రులారా,
మన దేశంలో ఎవరైనా యువకుడు రాజకీయాల పట్ల ఆసక్తిని కనబరిస్తే కుటుంబసభ్యులు పిల్లవాడు చెడిపోయాడని భావిస్తుంటారు. ఎందుకంటే రాజకీయం అంటేనే గొడవలు, దొమ్మీలు, దోపిడీ, అవినీతి…. ఎన్నెన్ని లేబిల్స్ అతికించారో? ప్రజలు దేశంలో అన్నీ మారవచ్చు కానీ రాజకీయాలు మారవని అనేవారు. కానీ ఇప్పుడు చూడండి. నేడు దేశవాసులు, పౌరులు జాగరూకులయ్యారు. వారు రాజకీయాల్లో నిజాయితీ కలిగిన వారికి దన్నుగా నిలుస్తున్నారు. నిజాయితీపరులకు అవకాశాలను ఇస్తున్నారు. దేశంలోని సాధారణ జనత నిజాయితీపరులతో, సమర్పితులైన వారితో, సేవాభావం ఉన్న వారితోపాటు దృఢంగా నిలుస్తున్నారు. నిజాయితీ, పనితీరు ఈ రోజు రాజకీయాల్లో అనివార్యమైన తొలి షరతుగా మారుతున్నాయి. దేశంలో వచ్చిన జాగరూకత వల్లే ప్రభావం నిర్మాణమైంది. అవినీతే వారసత్వంగా ఉన్నవారికి ఇప్పుడు ఆ అవినీతే బరువుగా మారిపోయింది. నిజానికి దేశంలోని సామాన్య పౌరుల జాగరూకతలోని బలిమి వల్ల లక్ష ప్రయత్నాలు చేసినా వారు దీనినుంచి తప్పించుకోలేకపోతున్నారు. దేశం ఇప్పుడు నిజాయితీపరులను ఇష్టపడుతోంది. వారిని ఆశీర్వదిస్తోంది. తన శక్తిని వారి పక్షాన ఒడ్డుతోంది. తన నమ్మకాన్ని వారిపై ఉంచుతోంది. ప్రజా ప్రతినిధులకు కూడా వచ్చే ఎన్నికల్లో పాల్గొనాలంటే తమ సీవీ బలంగా ఉండాలని, చేసిన పనుల వివరాలను చెప్పాల్స ఉంటుందని అర్థం అవుతోంది. మిత్రులారా… ఇప్పటికీ కొన్ని మార్పులు ఇంకా రావలసి ఉంది. ఈ మార్పులను మీరే తేవాలి. ప్రజాస్వామ్యానికి ఒక అతిపెద్ద శత్రువు తయారవుతోంది. అదే వంశపారంపర్య పాలన. రాజకీయ వంశపారంపర్య పాలన ఒక పెద్ద సవాలు. దానిని కూకటివేళ్లతో పెకలించి వేయాలి. కేవలం ఇంటిపేరు సహాయంతోటే ఎన్నికల్లో గెలిచే రోజులు పోయాయన్నది నిజమే. అయినప్పటికీ రాజకీయాల్లో వంశపారంపర్య వాదమనే రోగం పూర్తిగా సమసిపోలేదు. ఇప్పటికీ తమ కుటుంబ రాజకీయాలకు, రాజకీయాల్లో తమ కుటుంబాన్ని కాపాడుకోవడమే పరమావధిగా పనిచేసే వారు ఇంకా కొందరు ఉన్నారు.
మిత్రులారా,
ఈ వంశపారంపర్య రాజకీయం ప్రజాస్వామ్యంపై నిరంకుశత్వంతో పాటు సామర్థ్య రాహిత్యమనే బరువు మోపడాన్ని ప్రోత్సహిస్తుంది. వంశపారంపర్య రాజకీయాలు దేశమే సర్వోపరికి బదులు కేవలం నేను, నా కుటుంబం అన్న భావనకు బలం చేకూరుస్తుంది. ఇది రాజకీయ సామాజిక అవినీతికి ఒక ప్రధాన కారణం. వంశ పారంపర్య రాజకీయాల వల్ల బాగుపడ్డవాళ్లకు తమ ముందరి తరాల అవినీతిని ఎవరూ పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఎవరూ ఏమీ చేయలేరన్న భావన కలుగుతుంది. వారు తమ కుటుంబానికే చెందిన ఇలాంటి వికృతమైన ఉదాహరణలను కూడా ఇస్తూంటారు. అందుకే వీరికి చట్టాల పట్ల గౌరవం ఉండదు. చట్టాలంటే భయం కూడా ఉండదు.
మిత్రులారా,
ఈ పరిస్థితులను మార్చే బాధ్యత దేశంలో జాగృతిపై ఉంది. దేశంలోని యువతరంపై ఉంది. రాష్ట్రాయాం జాగృయామ వయం అన్న మంత్రాన్ని స్వీకరించాల్సిన అవసరం ఉంది.మీరు పెద్ద సంఖ్యలో రాజకీయాల్లో ఉత్సాహంతో పాలుపంచుకొండి. ఏదో తీసుకునేందుకు, ఏదో పొందేందుకు లేదా ఏదో స్థాయి కావాలన్న కోరికతో కాదు. ఏదో చేసేందుకు, ఏదో సాధించేందుకు కష్టించి పనిచేయండి. గుర్తుంచుకొండి. దేశంలోని సాధారణ యువకులు రాజకీయాల్లోకి రాకపోతే వంశపారంపర్య రాజకీయాల విషం ఇలాగే మన ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తూనే ఉంటుంది. ఈ దేశపు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మీరు రాజకీయాల్లోకి రావడం చాలా అవసరం. మా యువజన విభాగం ద్వారా మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దేశం గురించి యువ మిత్రులు కలిసి చర్చించాలి. దేశంలోని యువకులను భారత పార్లమెంటు సెంట్రల్ హాల్ వరకూ తీసుకురావాలి. మాక్ పార్లమెంట్ అసలు లక్ష్యం ఇదే. దేశంలో యువతరాన్ని మనం తయారు చేయాలి. తద్వారా వారు రానున్న రోజుల్లో దేశానికి నాయకత్వం ఇచ్చేందుకు ముందుకు రావాలి. ముందంజ వేయాలి. మీ ముందు స్వామీ వివేకానంద ఒక మహా మార్గదర్శకులు. వారి ప్రేరణతోనే మీ వంటి వారు రాజకీయాల్లోకి వస్తారు. దేశం మరింత బలోపేతం అవుతుంది.
మిత్రులారా,
స్వామి వివేకానందులు యువతకు మరో అత్యంత ముఖ్యమైన మంత్రాన్నిచ్చారు. ఏదైనా కష్టం లేదా ఇబ్బంది కన్నా దానినుంచి మనం ఏం నేర్చుకుంటున్నామన్నదే ముఖ్యమని ఆయన అనేవారు. విపత్సమయాలలో మనకు సంయమనం ఎంత ముఖ్యమో సాహసమూ అంతే అవసరం. విపత్తు మనకు నష్టమైపోయిన దానిని ఎలా పునర్నిర్మించుకోవాలో లేదా పూర్తిగా నవ నిర్మాణానికి పునాదులు ఎలా వేసుకోవాలో తెలుసుకునే అవకాశం ఇస్తుంది. చాలా సందర్భాల్లో మనం ఒక సంకటం లేదా ఆపద వచ్చినప్పుడు కొత్తగా ఆలోచించడం నేర్చుకుంటాం. అలా నేర్చుకున్న కొత్త విషయం మన భవితనే మార్చేస్తుంది. ఈ విషయం మీ జీవితంలోనూ అనుభవంలోకి వచ్చి ఉంటుంది. ఒక అనుభవాన్ని మీ ముందుంచాలని నాకు అనిపిస్తోంది. 2001 లో గుజరాత్ లోని కఛ్ లో భూకంపం వచ్చింది. క్షణాల్లోనే అంతా ధ్వంసమైపోయింది. మొత్తం కఛ్ ప్రాంతమంతా మృత్యు వస్త్రాన్ని కప్పుకుని పడుకున్నట్టయిపోయింది. భవనాలన్నీ నేలమట్టమైపోయాయి. పరిస్థితులను చూసిన వారందరూ కఛ్ ఇక శాశ్వతంగా విధ్వంసమైపోయిందని అనుకున్నారు. ఈ భూకంపం వచ్చిన కొన్ని నెలల తరువాత నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. నలువైపులా ఇక గుజరాత్ పనైపోయిందన్న మాటే మార్మోగుతోంది. ఇదే నాకు వినిపించింది. మేము ఒక కొత్త దృక్పథంతో పనిచేశాము. కొత్త వ్యూహంతో ముందుకు నడిచాం. మేము కఛ్ లో కేవలం భవనాల నిర్మాణాన్నే చూపట్టలేదు. కఛ్ లో అభివృద్ధిని కొత్త ఎత్తులకు తీసుకువెళ్తామని ప్రతిజ్ఞ చేశాము. అప్పట్లో అక్కడ ఇన్ని రోడ్లు లేవు. విద్యుత్ వ్యవస్థ సరిగ్గా లేదు. నీరు కూడా అంత తేలికగా దొరికేది కాదు. మేము అన్ని వ్యవస్థలనూ మెరుగుపరిచాము. మేము వందల కిలోమీటర్ల పొడవైన కాలువలు తవ్వించి నీటిని పైప్ లైన్ ద్వారా తీసుకువెళ్లాము. కఛ్ లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవంటే అప్పట్లో ఎవరూ టూరిజం గురించి ఆలోచించేవారే కారు. అంతే కాదు.. ప్రతి ఏటా వేలాది మంది కఛ్ ను వదిలి పారిపోయేవారు. ఈ రోజు అక్కడ పరిస్థితి ఎలా వుందంటే ఏళ్ల క్రితం కఛ్ ను వదిలి వెళ్లిపోయిన వారు కూడా ఇప్పుడు తిరిగి రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు కఛ్ కి లక్షల మంది పర్యాటకులు వస్తున్నారు. రణ్ ఉత్సవ్ లో ఆనందాన్ని పొందేందుకు వస్తున్నారు. అంటే మేము విపత్తు లో నుంచి ముందుకు వెళ్లే అవకాశాన్ని అన్వేషించామన్న మాట.
మిత్రులారా,
ఆ సమయంలో భూకంపం వచ్చినప్పుడు మరో పెద్ద పని జరిగింది. దాని గురించి అంతగా చర్చించడం జరగలేదు. ఈ రోజుల్లో కరోనా సందర్భంగా మీరంతా విపత్తు నివారణ చట్టం గురించి వినే ఉంటారు. ఈ రోజుల్లో అన్ని ప్రభుత్వ ఆదేశాలూ ఈ చట్టం ఆధారంగానే జారీ అవుతున్నాయి. కానీ ఈ చట్టంతో కఛ్ భూకంపం తో ఒక సంబంధం ఉంది. అదొక కథ. ఆ సంబంధం ఏమిటో తెలిస్తే మీరు ఆనందిస్తారు.
మిత్రులారా,
మొదట్లో మన దేశంలో విపత్తు నివారణను వ్యవసాయ శాఖలో అంతర్భాగంగా భావించేవారు. ఇది అందులో పనిగానే భావింఏవారు. ఎందుకంటే మనకు విపత్తు అంటే కరువు లేదా వరదలు. వానలు ఎక్కువగా కురిస్తే విపత్తు… లేదా వర్షం అసలు పడకపోతే విపత్తుగా భావించేవారు. పంటనష్టం ఇవ్వడమే విపత్తు నివారణగా భావించేవారు. కఛ్ భూకంపం నుంచి గుణపాఠం నేర్చుకుని గుజరాత్ 2003 లో గుజరాత్ రాష్ట్ర విపత్తు నివారణ చట్టాన్ని రూపొందించింది. అప్పుడు దేశంలో తొలి సారిగా విపత్తు నివారణను వ్యవసాయ శాఖ పరిధి నుంచి హోం శాఖ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఆ తరువాత 2005 లో గుజరాత్ రూపొందించిన చట్టాన్నే మొత్తం దేశానికి వర్తింపచేస్తూ విపత్తు నివారణ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ చట్టం సాయంతోనే మహమ్మారిపై దేశం ఇంత పెద్ద పోరాటం చేయగలుగుతోంది. ఈ రోజు ఈ చట్టం లక్షలాది ప్రాణాలను కాపాడేందుకు తోడ్పడుతోంది. ఇంత పెద్ద సంకటం నుంచి దేశాన్ని బయటకు తేగలుగుతోంది. అంతే కాదు. ఒకప్పుడు కేవలం నష్టపరిహరం, సహాయ సామగ్రి ఇవ్వడం వరకే పరిమితమైన విపత్తు నిర్వహణ ఇప్పుడు ప్రపంచానికే పాఠాలు చెప్పగలుగుతోంది.
మిత్రులారా,
విపత్తులలోనూ ప్రగతిని సాధించడం నేర్చుకున్న సమాజం తన భవిష్యత్తును తానే లిఖించుకోగలుగుతుంది. అందుకే నేడు భారతదేశంలోని 130 కోట్ల మంది భారతవాసులు తమ భవిష్యతును, అందునా ఉత్తమ భవిష్యత్తును తామే నిర్మించుకోగలుగుతున్నారు. మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం, ప్రతి సేవాకార్యం, ప్రతి ఇన్నొవేషన్, నిజాయితీతో కూడిన ప్రతి సంకల్పం భవిష్యత్తును నిర్మించే ప్రయత్నపు పునాదిలో వేస్తున్న బలమైన పునాది రాయి వంటిది. నేను మరోసారి ఈ కరోనా సమయంలో కొన్ని చోట్ల ప్రత్యక్షంగా, మరి కొన్ని చోట్ల వర్చువల్ పద్ధతిలో ఈ యువజనోద్యమంలో పాలుపంచుకున్న లక్షలాది మంది యువకులు, ఈ విభాగం లో పనిచేస్తున్న వారు అభినందనలకు పాత్రులు. మరోసారి మీ అందరి ప్రయత్నాలు సఫలం కావాలని మరో సారి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఇందులో పాల్గొంటున్న యువత కూడా అభినందనకు పాత్రులు. విజేతలకు అనేకానేక శుభాకాంక్షలతో మీరు చెప్పిన విషయాలన్నీ సమాజంలోని మూలాల వరకూ వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని పార్లమెంటు భవనంలో నిర్వహించాలని భావించిన లోకసభాధ్యక్షులకు కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ నా వాణికి విరామాన్నిస్తున్నాను.
అనేకానేక ధన్యవాదాలు.

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi