వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో బాధితుల క్షేమం కోసం ప్రార్థిస్తున్నానని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. రక్షణ, సహాయ-పునరావాస కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అన్నివిధాలా అండదండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి శనివారం నాడు కేరళలోని వాయనాడ్ ప్రాంతాన్ని విమానం నుంచి పరిశీలించారు. అనంతరం కొండచరియల పతనం వల్ల ప్రభావితమైన ప్రాంతాలకు వెళ్లి, ప్రజల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
ఈ ప్రకృతి విపత్తులో గాయపడినవారిని ప్రధానమంత్రి కలుసుకున్నారు. అలాగే సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న వారితో ఆయన మాట్లాడారు. ఈ విషాద సమయంలో బాధితులందరికీ కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రజలు వెన్నంటి నిలుస్తారంటూ శ్రీ నరేంద్ర మోదీ సమీక్ష సమావేశంలో పునరుద్ఘాటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి సంబంధించి సమగ్ర విజ్ఞాపన పత్రం పంపుతుందని ప్రధాని తెలిపారు.
వాయనాడ్‌లో కొనసాగుతున్న రక్షణ కార్యకలాపాలను తాను దగ్గర నుంచి పరిశీలిస్తున్నానని, అధికారులతో నిరంతర సంప్రదింపులలో పాలుపంచుకొంటున్నానని ప్రధానమంత్రి అన్నారు. విపత్తు నిర్వహణ నిధులను ఇప్పటికే విడుదల చేశామని, మిగిలిన ఆర్థిక సాయాన్ని కూడా వెంటనే అందజేస్తామని తెలిపారు.
Our prayers are with those affected by the landslide in Wayanad. The Centre assures every possible support to aid in relief efforts.https://t.co/3fS83dFmrp
— Narendra Modi (@narendramodi) August 10, 2024
ప్రస్తుత స్థితిని ఎదుర్కొనే సమర్థతగల కేంద్ర సంస్థలన్నిటిని బాధితుల సేవల కోసం మోహరించామని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఆయా సంస్థలు ప్రభావిత వ్యక్తులకు చేదోడుగా నిలుస్తున్నాయని చెప్పారు. విపత్తు ప్రాంతాలకు తక్షణం చేరుకుని, బాధితుల జాడను గుర్తించడానికి, రక్షణ\సహాయ కార్యకలాపాల్లో నిమగ్నమైన ‘ఎన్‌డిఆర్ఎఫ్’ ‘ఎస్‌డిఆర్ఎఫ్’, సైన్యం, రాష్ట్ర పోలీసులు, స్థానిక వైద్యచికిత్స బృందాలు, ప్రభుత్వేతర సంస్థ (ఎన్ జిఒలు) తదితర సేవాసంస్థల సిబ్బందిని ప్రధానమంత్రి ప్రశంసించారు.
ప్రభావిత వ్యక్తులకు, ప్రత్యేకించి తమ కుటుంబాలను కోల్పోయిన బాలలకు అండగా ఉండటానికి కొత్త దీర్ఘకాలిక పథకాల రూపకల్పన అవసరమని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ విషయంలో కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్నిరకాల సహకారం తీసుకుంటూ కీలక పాత్ర పోషించగలదన్న విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.
వాయనాడ్ ప్రాంతంలో జీవనోపాధి సహా ఇళ్లు, పాఠశాలలు, రహదారుల వంటి మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు వీలైనంత మేర సాయం అందిస్తామన్నారు. అలాగే చిన్నారుల భవిష్యత్తు దృష్ట్యా దేశం, కేంద్ర ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతాయంటూ వాయనాడ్ ప్రజలకు ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.
వాయనాడ్ ప్రాంతంలో జీవనోపాధి సహా ఇళ్లు, పాఠశాలలు, రహదారుల వంటి మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు వీలైనంత మేర సాయం అందిస్తామన్నారు. అలాగే చిన్నారుల భవిష్యత్తు దృష్ట్యా దేశం, కేంద్ర ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతాయంటూ వాయనాడ్ ప్రజలకు ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.