గౌరవనీయ అధ్యక్షులు బైడెన్; రెండు దేశాల ప్రతినిధులు… పాత్రికేయ మిత్రులారా…
అందరికీ వందనం!
భారత-అమెరికా సంబంధాలపై సానుకూల-స్నేహపూర్వక వ్యాఖ్యలకుగాను అధ్యక్షులు బైడెన్‌కు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా!
భారత-అమెరికా సంబంధాల చరిత్రలో ఈ రోజుకు ప్రత్యేక ప్రాధాన్యముంది. నేటి మా చర్చలు, తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు మా స్నేహ బంధంలో కొత్త అధ్యాయానికి నాంది పలికాయి. మా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యానికి నవ్యోత్తేజమిచ్చి, కొత్త దిశను నిర్దేశించాయి.
మిత్రులారా!
భారత-అమెరికా వాణిజ్య/పెట్టుబడి భాగస్వామ్యం మా రెండు దేశాలకు మాత్రమేగాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకూ కీలకమైనది. నేడు భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఈ నేపథ్యంలో అపరిష్కృత వాణిజ్య సంబంధ సమస్యలకు స్వస్తి పలికి సరికొత్తగా ప్రారంభించాలని మేం నిర్ణయించుకున్నాం. మా సాంకేతిక సహకారంలో భాగంగా ‘సునిశిత-భవిష్యత్ సాంకేతికతల కోసం చొరవ’ (ఇనిషియేటివ్ ఫర్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్-ఐసిఇటి) ఒక ముఖ్యమైన చట్రంగా రూపొందింది. ఆ మేరకు కృత్రిమ మేధస్సు. సెమి-కండక్టర్స్, అంతరిక్షం, క్వాంటం, టెలికాం వగైరా రంగాల్లో సహకార విస్తరణ ద్వారా బలమైన భవిష్యత్ భాగస్వామ్యం నిర్మిస్తున్నాం. మైక్రాన్, గూగుల్, అప్లైడ్ మెటీరియల్స్ వంటి అమెరికా కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించడమే దీనికి నిదర్శనం.
ఈ పర్యటన సందర్భంగా నేను అమెరికాలోని మరికొన్ని కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారుల (సీఈవో)ను కలిశాను. వారితో సంభాషణల్లో భారతదేశంపై వారి కుతూహలం, సానుకూల దృక్పథాన్ని నేను గమనించాను. రెండుదేశాల వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని సార్థకం చేయడంలో ప్రభుత్వాలు-వ్యాపారాలు-విద్యాసంస్థలు సమ్మేళనం కీలకమని మేమిద్దరం అంగీకారానికి వచ్చాం. పరిశుభ్ర ఇంధనంవైపు పరివర్తనలో భారత-అమెరికా భాగస్వామ్య దృక్కోణం అమలు దిశగా మేము అనేక ముఖ్యమైన కార్యక్రమాలను చేపట్టాం. ఇందులో హరిత ఉదజని, పవన శక్తి, బ్యాటరీ నిల్వ, కర్బన సంగ్రహణ వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి.
ప్రస్తుత ప్రపంచవ్యాప్త అనిశ్చితి నడుమ భారత్, అమెరికా విశ్వసనీయ భాగస్వాములుగా ఉన్నాయి. తద్వారా ఆధారపడదగిన, సురక్షిత, ప్రతిరోధక ప్రపంచ సరఫరా/విలువ శ్రేణులను సృష్టికి కృషి చేయాలని కూడా మేము నిర్ణయించాం. భారత-అమెరికాల మధ్య సన్నిహిత రక్షణ సహకారం మా పరస్పర విశ్వాసం-వ్యూహాత్మక భాగస్వామ్య ప్రాధాన్యతలకు ప్రతీక. గతకాలపు కొనుగోలుదారు-విక్రేత సంబంధాలకు స్వస్తి చెబుతూ నేడు సాంకేతికత బదిలీ, సహాభివృద్ధి, సహోత్పత్తి వైపు మళ్లుతున్నాం. ఈ నేపథ్యంలో సాంకేతిక బదిలీ విధానంతో భారతదేశంలో ఇంజిన్ల తయారీకి ‘జనరల్ ఎలక్ట్రిక్’ కంపెనీ నిర్ణయించడం ఒక మైలురాయి ఒప్పందం. ఇది రెండు దేశాల్లోనూ కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది. భవిష్యత్తులో మన రక్షణ సహకారానికి సరికొత్త రూపుదిద్దుతుంది. రెండు దేశాల రక్షణ పరిశ్రమలు, అంకుర సంస్థలు ఈ సహకారంలో కీలక భాగస్వాములుగా ఉంటాయి. మా రక్షణ-పారిశ్రామిక మార్గ ప్రణాళికలో ఈ పరిశ్రమల పరస్పర సంధానమే ప్రధాన లక్ష్యం. అంతరిక్ష విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానాల్లో మా సన్నిహిత సహకారానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. “ఆర్టెమిస్ అకార్డ్స్”లో సభ్యత్వం ద్వారా నేడు మా అంతరిక్ష సహకారంలో ఒక భారీ ముందడుగు వేశాం. ఒక్కమాటలో చెబితే… భారత-అమెరికా భాగస్వామ్యానికి ఆకాశం కూడా హద్దు కాబోదు!
మిత్రులారా!
రెండుదేశాల ప్రజానీకం మధ్య సంబంధాలే మా స్నేహబంధంలో అత్యంత కీలక మూలస్తంభం. భారత సంతతికి చెందిన 40 లక్షల మందికిపైగా నిపుణులు నేడు అమెరికా ప్రగతికి విశేషంగా సహకరిస్తున్నారు. భారతీయ అమెరికన్లు మన సంబంధాలకు చోదకశక్తి అనడానికి ఈ ఉదయం శ్వేతసౌధంలో భారీగా భారతీయులు హాజరు కావడమే నిదర్శనం. ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా బెంగళూరు, అహ్మదాబాద్‌లలో దౌత్య కార్యాలయాలు తెరవాలన్న అమెరికా నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. అలాగే సియాటిల్‌లో భారత్ కొత్త కాన్సులేట్‌ను ప్రారంభించనుంది.
మిత్రులారా!
అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై నేటి మా సమావేశంలో చర్చించాం. ఇండో-పసిఫిక్‌లో శాంతిభద్రతలే మా ఉమ్మడి ప్రాధాన్యం. ఈ ప్రాంత అభివృద్ధి, విజయం యావత్ ప్రపంచానికీ ముఖ్యమని మేం భావిస్తున్నాం. ‘క్వాడ్’ భాగస్వాములతో సంయుక్తంగా ఈ ప్రాంతంలోని అన్ని దేశాలతో మా సమన్వయం పెంచుకోవడంపై మా అభిప్రాయాలను పంచుకున్నాం. ఉగ్రవాదం, రాడికలిజంపై పోరాటంలో భారత్, అమెరికా ఇప్పటికే భుజం కలిపి నడుస్తున్నాయి. సీమాంతర ఉగ్రవాదం అంతానికి సంఘటిత కార్యాచరణ అవసరమనడంలో మాకు భిన్నాభిప్రాయం లేదు. కోవిడ్ మహమ్మారితోపాటు ఉక్రెయిన్ యుద్ధంవల్ల దక్షిణార్థ గోళంలోని దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి అన్ని దేశాలూ ఏకం కావాల్సిన అవసరం ఉందని మేం భావిస్తున్నాం. ఉక్రెయిన్ పరిణామాల ఆరంభ దశనుంచీ చర్చలు-దౌత్యంతో వివాదాన్ని పరిష్కరించుకోవాలని భారత్ పట్టుబడుతోంది. ఆ మేరకు శాంతి పునరుద్ధరణ కోసం శక్తివంచన లేకుండా చేయూతనిస్తామని పూర్తి సంసిద్ధత ప్రకటించాం. ఇక భారత జి20 అధ్యక్షత కింద “ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు”కు ప్రాధాన్యం, దక్షిణార్థ గోళ దేశాల గళానికి ప్రాముఖ్యం ఇస్తున్నాం. ఆఫ్రికా యూనియన్‌కు జి20లో పూర్తి సభ్యత్వంపై నా ప్రతిపాదనకు మద్దతిచ్చిన బైడెన్‌గారికి నా ధన్యవాదాలు.
మిత్రులారా!
ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య విలువలు-వ్యవస్థల బలోపేతమే మా సమష్టి కృషికి తారక మంత్రం. ప్రపంచ శాంతి, స్థిరత్వం, సౌభాగ్యం కోసం ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా సంయుక్తంగా గణనీయ స్థాయిలో తోడ్పడతాయి. ఈ విలువల మేరకు రెండు దేశాల ప్రజల అంచనాలను మాత్రమేగాక ప్రపంచ ఆశలు, ఆకాంక్షలను తీర్చగలమన్నది నా దృఢ విశ్వాసం.
అధ్యక్షులు బైడెన్ గారూ!
నేటి చర్చలు ఫలవంతంగా సాగడంపై మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఏడాది ఆఖరున జి20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మీకు సాదర స్వాగతం పలికేందుకు నేను మాత్రమే కాకుండా యావద్భారత ప్రజానీకం ఎదురుచూస్తోంది. అధ్యక్షులు బైడెన్ చెప్పినట్లు- నేను కాంగ్రెస్‌లో ప్రసంగించాల్పి ఉంది కాబట్టి, మరింత సమయం తీసుకోకుండా అధ్యక్షులు బైడెన్ గారికి మరోసారి ధన్యవాదాలు చెబుతూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను!