ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాల కోసం నామినేషన్ల ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొనాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రజలను కోరారు.
సమాజానికి విశేష సేవలందించిన క్షేత్రస్థాయి యోధులను గుర్తించాల్సిన ఆవశ్యకతను శ్రీ మోదీ స్పష్టంచేశారు. నామినేషన్ల ప్రక్రియలో పారదర్శకత, భాగస్వామ్య విధానానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో నామినేషన్లు రావడంపై హర్షం వ్యక్తంచేసిన మోదీ, ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు అర్హులైన వ్యక్తులందరినీ awards.gov.in అధికారిక పోర్టల్ ద్వారా నామినేట్ చేయాలని కోరారు.
“గత దశాబ్దకాలంలో ఎందరో క్షేత్రస్థాయి యోధులను #ప్రజాపద్మాలతో గౌరవించాం. పురస్కార గ్రహీతల జీవిత గాథలు దేశ ప్రజలెందరిలోనో స్ఫూర్తి నింపాయి. వారి కృషిలో ధైర్యసాహసాలు, పట్టుదల ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఈ పురస్కార ప్రదానాల్లో మరింత పారదర్శకతను తేవడంతో పాటు, భాగస్వామ్య పద్ధతిని ప్రోత్సహించే ఉద్దేశంతో వివిధ పద్మ పురస్కారాల కోసం అర్హులైన వ్యక్తులను నామినేట్ చేయాలని మా ప్రభుత్వం ప్రజలను ఆహ్వానిస్తోంది. అనేక నామినేషన్లు రావడం సంతోషాన్నిస్తోంది. నామినేట్ చేయడానికి చివరి తేదీ ఈ నెల15. స్ఫూర్తిదాయకమైన మరింత మంది వ్యక్తులను పద్మ పురస్కారాల కోసం నామినేట్ చేయాలని కోరుతున్నాను. awards.gov.in ద్వారా మీరు నామినేట్ చేయవచ్చు” అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో ప్రధాని పేర్కొన్నారు.
Over the last decade, we have honoured countless grassroots level heroes with the #PeoplesPadma. The life journeys of the awardees have motivated countless people. Their grit and tenacity are clearly visible in their rich work. In the spirit of making the system more transparent…
— Narendra Modi (@narendramodi) September 9, 2024