ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 జూలై 16న ఉత్తప్రదేశ్ సందర్శిస్తారు. ఈ పర్యటనలో భాగంగా జలౌన్ జిల్లా ఒరై తాలూకాలోని కైతేరి గ్రామంలో ఉదయం 11:30 గంటలకు బుందేల్ఖండ్ ‘ఎక్స్’ప్రెస్ వే’ని ఆయన ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా అనుసంధానం పెంచడంపై నిబద్ధతతో ఉన్న ప్రభుత్వం ముఖ్యంగా రహదారి మౌలిక సదుపాయాల మెరుగుకు ప్రాధాన్యమిస్తోంది. ఈ మేరకు 2020 ఫిబ్రవరి 29న బుందేల్ఖండ్ ఎక్స్’ప్రెస్ వే నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. అటుపైన ఈ ఎక్స్’ప్రెస్ వే పనులు శరవేగంగా సాగుతూ 28 నెలల్లో పూర్తికాగా, ఇప్పుడు దాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు.
ఉత్తరప్రదేశ్ ఎక్స్’ప్రెస్ వేస్-ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ (యూపీఈఐడీఏ) ఆధ్వర్యాన దాదాపు రూ.14,850 కోట్లతో ఈ 296 కిలోమీటర్ల నాలుగు వరుసల ఎక్స్’ప్రెస్ వే నిర్మితమైంది. కాగా, దీన్ని భవిష్యత్తులో ఆరు వరుసలకు విస్తరించే వీలుంది. ఈ రహదారి చిత్రకూట్ జిల్లాలోని భరత్కూప్ సమీపాన గోండా గ్రామం వద్ద ‘ఎన్హెచ్-35 నుంచి ప్రారంభమై ఎటావా జిల్లాలోని కుడ్రైల్ గ్రామందాకా వెళ్తుంది. అక్కడినుంచి ఆగ్రా-లక్నో ‘ఎక్స్’ప్రెస్ వే’ తో కలిసిపోతుంది. ఈ మేరకు చిత్రకూట్, బందా, మహోబా, హమీర్పూర్, జలౌన్, ఔరైయా, ఇటావా... మొత్తం ఏడు జిల్లాల మీదుగా వెళ్తుంది.
బుందేల్ఖండ్ ‘ఎక్స్’ప్రెస్ వే’ ఈ ప్రాంతంలో అనుసంధానాన్ని మెరుగుపరచడమే కాకుండా ఆర్థికాభివృద్ధికి ఇతోధికంగా దోహదం చేస్తుంది. దీంతో స్థానిక ప్రజలకు వేలాది ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. ఇందులో భాగంగా ‘ఎక్స్’ప్రెస్ వే’ వెంబడిగల బందా, జలౌన్ జిల్లాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు సంబంధిత పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.