ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 16 వ తేదీ నాడు హరియాణా లోని రేవాడీ ని సందర్శించనున్నారు. మధ్యాహ్నం పూట సుమారు ఒంటి గంట పదిహేను నిమిషాల వేళ లో పట్టణ ప్రాంత రవాణా, ఆరోగ్యం, రైళ్ల రంగం మరియు పర్యటన రంగాల కు చెందిన, 9750 కోట్ల రూపాయల కు పైచిలుకు విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ను ఆయన ప్రారంభించడం, దేశ ప్రజల కు అంకితమివ్వడం తో పాటు శంకుస్థాపన చేయనున్నారు.
సుమారు గా 5450 కోట్ల రూపాయలు వ్యయం తో అభివృద్ధి పరచనున్న గురుగ్రామ్ మెట్రో రైలు ప్రాజెక్టు కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 28.5 కిలో మీటర్ ల పొడవైన ఈ ప్రాజెక్టు లో మిలీనియమ్ సిటీ సెంటర్ ను ఉద్యోగ్ విహార్ అయిదో-దశ కు కలుపడం జరుగుతుంది. అలాగే, దీనిని సైబర్ సిటీ కి సమీపం లోని మౌల్‌సారీ ఎవెన్యూ స్టేశన్ వద్ద రేపిడ్ మెట్రో రైల్ గురుగ్రామ్ కు ఇప్పటికే ఉన్న మెట్రో నెట్‌వర్క్ తో కలపడం జరుగుతుంది. ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే మీద కూడా దీనిని విస్తరించడం జరుగుతుంది. దేశ పౌరుల కు పర్యావరణ మిత్రపూర్వకమైనటువంటి శీఘ్రగతి న రాకపోకల కు అనువైన ప్రయాణ వ్యవస్థల ను అందుబాటు లోకి తీసుకు రావాలన్న ప్రధాన మంత్రి దృష్టి కోణాన్ని ఆవిష్కరించే దిశ లో ఒక ప్రధానమైన అడుగు ఈ ప్రాజెక్టు అని చెప్పాలి.
దేశం లో సార్వజనిక ఆరోగ్యం సంబంధి మౌలిక సదుపాయాల ను పటిష్ట పరచాలన్న ప్రధాన మంత్రి దృష్టి కోణాని కి తగినట్లు గా హరియాణా లోని రేవాడీ లో అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్ర సంస్థ (ఎఐఐఎమ్ఎస్) కు శంకుస్థాపన జరగనుంది. దీని నిర్మాణానికి సుమారు గా 1650 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనిని రేవాడీ లోని మాజ్‌రా ముస్తిల్ భాల్ ఖీ గ్రామం లో 203 ఎకరాల భూమి లో అభివృద్ధి పరచడం జరుగుతుంది. దీనిలో 720 పడకల తో కూడిన ఆసుపత్రి భవనాల సముదాయం, 100 సీట్ లను కలిగివుండేటటువంటి వైద్య కళాశాల, 60 సీట్ లను కలిగి ఉండేటటువంటి సర్సింగ్ కళాశాల, 30 పడకల తో కూడి వుండేటటువంటి ఆయుష్ బ్లాకు, అధ్యాపక సిబ్బంది కి నివాస భవన వసతి, అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు బస చేసేందుకు వసతి, రాత్రి పూట బస ఏర్పాటు, అతిథి గృహం, సభ భవనం వగైరా సదుపాయాలు కూడా ఇక్కడ ఉంటాయి. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పిఎమ్ఎస్ఎస్‌వై) లో భాగం గా ఏర్పాటు అయ్యే ఎఐఐఎమ్ఎస్ రేవాడీ తో హరియాణా లో ప్రజల కు సమగ్రమైన , నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటు లోకి రానున్నాయి. ఇక్కడ సమకూర్చబోయే సౌకర్యాల లో 18 విభాగాల లో రోగుల సంరక్షణ కు సంబంధించిన సేవలు మరియు కార్డియోలాజీ, గ్యాస్ట్రో- ఎంటరోలాజీ, నెఫ్రోలాజీ, యూరోలాజీ, న్యూరోలాజీ, న్యూరోసర్జరీ, మెడికల్ ఆంకోలాజీ, సర్జికల్ ఆంకోలాజీ, ఎండోక్రినాలజీ, కాలిన గాయాల కు శస్త్రచికిత్స లు మరియు ప్లాస్టిక్ సర్జరీ లు సహా 17 విధాలైన సూపర్ స్పెశాలిటీస్ లభించనున్నాయి. ఈ సంస్థ లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఇమర్జనీ యూనిట్ & ట్రామా యూనిట్ ల సంబంధి సదుపాయాలు, మాడ్యులర్ ఆపరేశన్ థియేటర్ లు పదహారు, రోగ నిర్ధారణ ప్రయోగశాల లు, రక్త నిధి, ఔధాలయం వగైరా సదుపాయాలు కూడా ఉంటాయి. హరియాణా ఎఐఐఎమ్ఎస్ ను ఏర్పాటు చేయడం అనేది ఆ రాష్ట్ర ప్రజల కు సమగ్రమైన, నాణ్యమైన, సంపూర్ణమైన తృతీయ పక్ష ఆరోగ్య సంరక్షణ రంగం లో సేవల ను అందుబాటు లోకి తీసుకు రావడం లో ఒక ముఖ్యమైన మైలు రాయి అని చెప్పాలి.
కురుక్షేత్ర లోని జ్యోతిసర్ ప్రాతం లో క్రొత్త గా నిర్మించినటువంటి ‘అనుభవ్ కేంద్ర’ ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ మ్యూజియమ్ నిర్మించడాని కి దాదాపు గా 240 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. 17 ఎకరాల లో విస్తరించినటువంటి ఈ మ్యూజియమ్ లో లోపలి భాగం లక్ష చదరపు అడుగుల మేర ఉంది. ఇది మహాభారత వీర గాథ ఘట్టాల ను మరియు గీత లోని బోధనల ను కళ్ళకు కడుతుంది. ఈ మ్యూజియమ్ లో సందర్శకుల కు ఎంతో చక్కని అనుభూతి ని అందించేందుకు గాను ఆగ్‌మెంటెడ్ రియాలిటీ (ఎఆర్), 3డి లేజర్ మరియు ప్రొజెక్శన్ మేపింగ్ లు సహా అత్యధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమైంది. అర్జునుని కి భగవాన్ కృష్ణుడు భగవద్ గీత యొక్క శాశ్వత జ్ఞానాన్ని బోధించినటువంటి పవిత్రమైన స్థానమే కురుక్షేత్ర లోని జ్యోతిసర్.
ప్రధాన మంత్రి అనేక రైల్ వే ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం తో పాటు, వాటిని దేశ ప్రజల కు అంకితమివ్వనున్నారు. శంకుస్థాపన జరిగే ప్రాజెక్టుల లో రేవాడీ-కాఠువాస్ రైలు మార్గం యొక్క డబ్లింగ్ పనులు (27.73 కిలో మీటర్ లు); కాఠువాస్-నార్‌నౌల్ రైలు మార్గం (24.12 కిమీ) యొక్క డబ్లింగ్ పనులు; భివానీ-డోభ్ భాలీ రైలు మార్గం (42.30 కిమీ) లతో పాటు; మాన్‌హేరూ-బవానీ ఖేడా రైలు మార్గం (31.50 కిమీ) డబ్లింగ్ పనులు భాగం గా ఉన్నాయి. ఈ రైలు మార్గాల ను డబ్లింగ్ చేసినందువల్ల ఆ ప్రాంతం లో రైల్ వే సంబంధి మౌలిక సదుపాయాల కు ఊతం లభించడంతో పాటు ప్రయాణికుల రైళ్ళు మరియు సరకు రవాణా రైళ్ళు సకాలం లో పయనించేందుకు కూడా వీలు చిక్కనుంది. రోహ్ తక్ మరియు హిసార్ ల మధ్య ప్రయాణానికి పట్టే కాలాన్ని తగ్గించేటటువంటి రోహ్‌తక్-మహమ్-హాంసీ రైలు మార్గాన్ని (68 కిమీ) దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. ఆయన రోహ్‌తక్-మహమ్-హాంసీ సెక్శను లో ఒక రైలు సర్వీసు కు ప్రారంభ సూచకం గా ఆకుపచ్చ జెండా ను కూడా చూపెడతారు. ఈ రైలు ద్వారా రోహ్‌తక్ మరియు హిసార్ లో రైలు సంధానం మెరుగుపడి, రైలు ప్రయాణికుల కు ప్రయోజనం సమకూరనుంది.