ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని పూణెని , ఆగస్టు 1న సందర్శిస్తారు. ఆరోజు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి దగదుషేత్ మందిర్ ను దర్శించి, పూజ చేస్తారు. ఉదయం గం 11.45 లకు ప్రధానమంత్రి లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం అందుకుంటారు. అనంతరం 12.45 గంటలకు ప్రధానమంత్రి మెట్రోరైలు సర్వీసులను జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే పలు అభివ్రుద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
పూణే మెట్రో తొలి దశ లోని రెండు కారిడార్ లలో పూర్తి అయిన సెక్షన్లలో ప్రధానమంత్రి , జెండా ఊపి రైలు సర్వీసులను ప్రారంభిస్తారు. ఇవి, ఫూగేవాడి స్టేషన్ నుంచి సివిల్ కోర్టు స్టేషన్, గర్వరే కాలేజ్ స్టేషన్ నుంచి రూబీ హాల్ క్లినిక్ స్టేషన్ ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు 2016లో ప్రధానమంత్రే శంకుస్థాపన చేశారు. నూతన సెక్షన్లు పూణే నగరంలోని ప్రధాన ప్రాంతాలైన శివాజీ నగర్, సివిల్ కోర్టు , పూణె మునిసిపల్ కార్పొరేషన్ ఆఫీస్, పూణె ఆర్.టి.ఒ, పూణె రైల్వే స్టేషన్ లను కలుపుతాయి.ప్రజలకు ఆధునిక ,పర్యావరణ హితకరమైన సత్వర నగర రవాణా వ్యవస్థను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేవాలన్న ప్రధానమంత్రి దార్శనికత దిశగా ఈ ప్రారంభోత్సవం ఒక ముందడుగు కాగలదు.
కొన్ని మెట్రోస్టేషన్ల డిజైన్ ఛత్రపతి శివాజీ మహరాజ్ ప్రేరణను అందించేవిగా ఉన్నాయి. ఛత్రపతి శంభాజీ ఉదయన్ మెట్రో స్టేషన్, దక్కన్ జింఖానా మెట్రోస్టేషన్లను ఛత్రపతి శివాజీ మహరాజ్ పాలనలో సైనికులు ధరించే తలపాగా రూపంలో తీర్చిదిద్దారు. దీనిని మవలా పగడి అంటారు. శివాజీ నగర్ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్, ఛత్రపతి శివాజీ మహరాజ్ నిర్మించిన కోటలను గుర్తుకుతెస్తుంది.
మరో ముఖ్యమైన ఫీచర్ ఏమంటే, సివిల్ కోర్టు మెట్రో స్టేషన్, దేశంలోని అత్యంత లోతైన మెట్రో స్టేషన్లలో ఒకటి. ది 33.1 మీటర్ల లోతులో ఉంది. ఈ మెట్రో స్టేషన్ ప్లాట్ ఫాంపై నేరుగా సూర్యరశ్మి పడేట్టు స్టేషన్ పైకప్పును రూపొందించారు.
ప్రధానమంత్రి తన పర్యటనలో భాగంగా, పింప్రి చించ్ వాడ మునిసిపల్ కార్పొరేషన్ (పిసిఎంసి) మునిసిపల్ కార్పొరేషన్ పరిథిలో వ్యర్థాలనుంచి ఇంధనాన్ని తయారు చేసే ప్లాంటును ప్రారంభిస్తారు. ఈ ప్లాంటును 300 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టారు. ఇది సంవత్సరానికి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థఆలను ఉపయోగించి విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది.
అందరికీ గ్రుహ సదుపాయం అన్న లక్ష్యసాధనలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, పిసిఎంసి నిర్మించిన 1280 ఇళ్లను ప్రధానమంత్రి, లబ్ధిదారులకు అందజేస్తారు. పూణే మునిసిపల్ కార్పొరేషన్ పిఎంఎవై కింద నిర్మించిన 2650 ఇళ్లను, పూణే మెట్రోపాలిటన్ రీజియన్ డవలప్ మెంట్ అథారిటీ నిర్మించిన 6400 ఇళ్లను కూడా ప్రధానమంత్రి లబ్ధిదారులకు అందజేస్తారు.
ప్రధానమంత్రి కి ఆగస్టు 1న లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును అందజేస్తారు. ఈ అవార్డును తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ 1983లో ఏర్పాటు చేసింది. లోకమాన్య తిలక్ పట్ల గౌరవసూచకంగా ఈ అవార్డును ఏర్పాటుచేశారు. దేశ పురోగతి అభివ్రుద్ధికి విశేష క్రుషి చేసిన వారికి ఈ అవార్డు ఇస్తారు. ఈ అవార్డును ప్రతి ఏడాది ఆగస్టు 1 వతేదీన లోకమాన్య తిలక్ వర్ధంతి సందర్భంగా అందజేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోకమాన్య తిలక్ అవార్డు అందుకుంటున్న 41 వ వ్యక్తి . గతంలో ఈ అవార్డును అందుకున్న వారిలో డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, శ్రీ ప్రణబ్ ముఖర్జీ, శ్రీ అటల్ బిహారి వాజ్ పేయీ, శ్రీమతి ఇందిరా గాంధీ, డాక్టర్ మన్ మోహన్ సింగ్, శ్రీ ఎన్.ఆర్.నారాయణ మూర్తి, డాక్టర్. ఇ. శ్రీధరన్ తదితరులు ఉన్నారు.