Quoteదాదాపు రూ.7500 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులు జాతికి అంకితం.. శంకుస్థాపన;
Quoteసుమారు 2 లక్షల మంది ‘ఆహార్ అనుదాన్’ పథకం లబ్ధిదారులైన ప్రత్యేక వెనుకబడిన తెగల మహిళలకు నెలవారీ వాయిదా పంపిణీ చేయనున్న ప్రధానమంత్రి;
Quoteస్వామిత్వ పథకం లబ్ధిదారులకు 1.75 లక్షల ‘అధికార్ అభిలేఖ్’ పంపిణీ;
Quoteగిరిజన ప్రాబల్యంగల జిల్లాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ‘తాంత్యా మామా భిల్ యూనివర్సిటీ’కి శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి;
Quoteప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కింద 550కిపైగా గ్రామాలకు నిధులు బదిలీ;
Quoteరత్లాం-మేఘ్‌నగర్ రైల్వే స్టేషన్ల నవీకరణకు శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి; రోడ్డు, రైలు, విద్యుత్.. జల రంగాల్లో పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతోపాటు శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 11న మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తారు. ఆ రోజున మధ్యాహ్నం 12:40 గంటలకు ఝబువాలో దాదాపు రూ.7500 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులలో కొన్నిటిని జాతికి అంకితం చేసి, మరికొన్నిటికి శంకుస్థాపన చేస్తారు. అంత్యోదయ సూత్రం నిర్దేశిత ఆదర్శాలకు అనుగుణంగా ప్రధానమంత్రి ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక దశాబ్దాలు గడిచినా కనీస ప్రయోజనాలు పొందలేకపోయిన గిరిజన సమాజానికి ప్రగతి ఫలితాలు దక్కేలా చూడటం ఈ ఆదర్శాల్లో కీలకాంశం. తదనుగుణంగా ఈ ప్రాంతంలో గణనీయ సంఖ్యలోగల గిరిజనానికి ప్రయోజనం చేకూర్చే అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి అంకితం చేయడంతోపాటు కొన్నిటికి పునాదిరాయి వేస్తారు.

   ఈ కార్యక్రమాల్లో భాగంగా ‘ఆహార్ అనుదాన్ యోజన’ కింద సుమారు 2 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు నెలవారీ వాయిదాను ప్రధాని పంపిణీ చేస్తారు. కాగా, ఈ పథకం కింద రాష్ట్రంలోని పలు ప్రత్యేక వెనుకబడిన తెగల మహిళలకు పౌష్టికాహారం కోసం నెలకు రూ.1500 వంతున ప్రభుత్వం అందజేస్తోంది.

   అలాగే ‘స్వామిత్వ’ పథకం కింద లబ్ధిదారులకు వారి భూమిపై హక్కును నిర్ధారించే 1.75 లక్షల హక్కు పత్రాలను (అధికార్ అభిలేఖ్) ఆయన పంపిణీ చేస్తారు.

   ఈ ప్రాంతంలో గిరిజన సాంద్రత అధికంగాగల జిల్లాల యువత కోసం ప్రత్యేకంగా ‘తాంత్యా మామా భిల్ విశ్వవిద్యాలయం’ ఏర్పాటుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. మొత్తం రూ.170 కోట్లతో నిర్మించనున్న ఈ విశ్వవిద్యాలయం విద్యార్థుల సమగ్రాభివృద్ధికి తగిన ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది.

   ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కింద 559 గ్రామాలకు రూ.55.9 కోట్ల మేర నగదును ప్రధానమంత్రి బదిలీ చేస్తారు. ఆయా గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, చౌకధర దుకాణాలు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలకు అదనపు గదులు, అంతర్గత రోడ్లు వంటి వివిధ రకాల నిర్మాణాత్మక కార్యకలాపాల కోసం ఈ నిధులను వినియోగిస్తారు.

   ఝబువాలో ‘సీఎం రైజ్ స్కూల్’కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. దీంతో పాఠశాల విద్యార్థులకు అత్యాధునిక తరగతి గదులు, ఇ-లైబ్రరీ తదితర ఆధునిక సౌకర్యాలు కల్పించడానికి తగిన సాంకేతికత అందుబాటులోకి వస్తుంది.

   మధ్యప్రదేశ్‌లో నీటి సరఫరా, తాగునీటి సదుపాయాలను బలోపేతం చేసే పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతోపాటు మరికొన్నిటికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు ధార్-రత్లాం పరిధిలోని వెయ్యికిపైగా గ్రామాలకు తాగునీరందించే ‘తలవాడ ప్రాజెక్ట్’; అమృత్ 2.0 (అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్) కింద రాష్ట్రంలోని వివిధ జిల్లాల పరిధిలోగల 50వేలకుపైగా కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే 14 పట్టణ నీటి సరఫరా పథకాలు ప్రధాని శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టుల జాబితాలో ఉన్నాయి. మరోవైపు ఝబువా జిల్లా పరిధిలోని 50 పంచాయతీలలో దాదాపు 11 వేల గృహాలకు కొళాయి నీరందించే ‘నల్ జల్ యోజన’ను ఆయన జాతికి అంకితం చేస్తారు.

   ఈ కార్యక్రమాల్లో భాగంగా రైల్వే రంగానికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేసి, మరికొన్నిటికి శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు రత్లాం, మేఘ్‌నగర్ రైల్వే స్టేషన్ల నవీకరణకు ఆయన శంకుస్థాపన చేయనుండగా, ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద ఈ స్టేషన్ల సుందరీకరణ, అదనపు సదుపాయాల కల్పన చేపడతారు. ఇండోర్-దేవాస్-ఉజ్జయిని ‘సి’ క్యాబిన్ రైలు మార్గం డబ్లింగ్; యార్డ్ నవీకరణతో ఇటార్సీ-నార్త్/సౌత్ గ్రేడ్ సెపరేటర్; బర్ఖెరా-బుధ్నీ-ఇటార్సీ మార్గాన్ని కలుపుతూ నిర్మించిన మూడోలైన్ వంటి ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. వీటివల్ల రైల్వే మౌలిక సదుపాయాలు బలోపేతం కావడంతోపాటు ప్రయాణిక-సరకు రవాణా రైళ్ల ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది.

   మధ్యప్రదేశ్‌లో రూ.3275 కోట్లకుపైగా విలువైన పలు రహదారి అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఈ జాబితాలో- జాతీయ రహదారి నం.47 (ఎన్‌హెచ్‌-47) పరిధిలో హర్దా-బెతుల్ (ప్యాకేజీ-I) మధ్య 0.00 నుంచి 30.00 కిలోమీటర్ల (హర్దా-తేమగావ్) మార్గం నాలుగు వరుసలుగా విస్తరణ; అలాగే జాతీయ రహదారి నం.752డి (ఎన్‌హెచ్‌-752డి) పరిధిలో ఉజ్జయిని దేవాస్ విభాగం; జాతీయ రహదారి నం.47 (ఎన్‌హెచ్‌-47) పరిధిలో మధ్యప్రదేశ్ సరిహద్దులోని  ఇండోర్-గుజరాత్ విభాగం (16 కి.మీ) నాలుగు వరుసలుగా విస్తరణ; జాతీయ రహదారి నం.47 (ఎన్‌హెచ్‌-47) పరిధిలో హర్దా-బెతుల్ (ప్యాకేజీ-III) మధ్య చిచోలి-బెతుల్ విభాగం నాలుగు వరుసలుగా విస్తరణ; జాతీయ రహదారి నం.552జి (ఎన్‌హెచ్‌-552జి) పరిధిలో ఉజ్జయిని-ఝల్వార్ విభాగం రహదారి ప్రాజెక్టులున్నాయి. వీటన్నిటితో రహదారి అనుసంధానం మెరుగుతోపాటు ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి బాటలు పడతాయి.

   అంతేకాకుండా వ్యర్థాలు పోగువేసే ప్రదేశాలకు సంబంధించి ‘డంప్‌సైట్ రిమెడియేషన్’, విద్యుత్ సబ్‌స్టేషన్ తదితర అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం, శంకుస్థాపన చేస్తారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Over 28 lakh companies registered in India: Govt data

Media Coverage

Over 28 lakh companies registered in India: Govt data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 ఫెబ్రవరి 2025
February 19, 2025

Appreciation for PM Modi's Efforts in Strengthening Economic Ties with Qatar and Beyond