ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2020 డిసెంబర్ 15వ తేదీన గుజరాత్, కచ్ లోని ధోర్డో లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలోని అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులలో – లవణ నిర్మూలన ప్లాంటు; హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్తు పార్కుతో పాటు పూర్తిగా ఆటోమేటిక్ గా నడిచే పాల ప్రాసెసింగ్ మరియు ప్యాకింగ్ ప్లాంటు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి కూడా హాజరుకానున్నారు. ప్రధానమంత్రి వైట్ రాన్ లో కూడా పర్యటించి, అక్కడ ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించనున్నారు.
గుజరాత్ తన విస్తారమైన సముద్ర తీరప్రాంతాన్ని ఉపయోగించి, కచ్ లోని మాండ్వి వద్ద నెలకొల్పే లవణ నిర్మూలన ప్లాంటు తో సముద్రపు నీటిని త్రాగునీటిగా మార్చడంలో ఒక ముఖ్యమైన అడుగు వేస్తోంది. రోజుకు 10 కోట్ల లీటర్ల సామర్థ్యం (100 ఎం.ఎల్.డి) ఉన్న ఈ లవణ నిర్మూలన ప్లాంటు, నర్మదా గ్రిడ్, సౌని నెట్‌వర్క్ మరియు శుద్ధి చేసిన వ్యర్థ నీటి మౌలిక సదుపాయాలను పూర్తి చేయడం ద్వారా గుజరాత్ లో నీటి భద్రతను బలోపేతం చేస్తుంది. దేశంలో స్థిరమైన, సరసమైన నీటి వనరుల అభివృద్ధికి, ఇది ఒక చరిత్రాత్మక సంఘటన అవుతుంది. ముంద్రా, లఖ్ పత్, అబ్దాసా, నఖత్రానా తాలూకాలలోని దాదాపు 8 లక్షల మందికి ఈ లవణ నిర్మూలన ప్లాంటు ద్వారా స్వచ్ఛమైన నీరు లభిస్తుంది. మిగులు జలాలను భాచౌ, రాపర్, గాంధీధామ్ వంటి ఎగువ జిల్లాలకు పంచుకోవడంలో కూడా ఈ ప్లాంటు సహాయపడుతుంది. త్వరలో గుజరాత్ లోని – దహేజ్ (100 ఎం.ఎల్.డి), ద్వారకా (70 ఎమ్.ఎల్.డి), ఘోఘా భావనగర్ (70 ఎమ్.ఎల్.డి), గిర్ సోమనాథ్ (30 ఎం.ఎల్.డి) లలో నెలకొల్పే ఐదు లవణ నిర్మూలన ప్లాంట్లలో ఇది ఒకటి.
గుజరాత్, కచ్ జిల్లాలోని విఘాకోట్ గ్రామానికి సమీపంలో నెలకొల్పనున్న హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్తు పార్కు, దేశంలో అతిపెద్ద పునరుత్పాదక విద్యుదుత్పత్తి పార్కుగా ఉంటుంది. ఇది 30 జి.డబ్ల్యూ. వరకు పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయడానికి దోహదపడుతుంది. 72,600 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులో పవన మరియు సౌర విద్యుత్తు నిల్వ కోసం ప్రత్యేక హైబ్రిడ్ పార్కు ప్రాంతం ఉంటుంది, అలాగే పవన విద్యుత్తు పార్కు కార్యకలాపాలకు ప్రత్యేకమైన ప్రాంతం ఉంటుంది.
కచ్ లోని సర్హాద్ డెయిరీ అంజార్ వద్ద పూర్తిగా ఆటోమేటిక్ గా నడిచే పాల ప్రాసెసింగ్ మరియు ప్యాకింగ్ ప్లాంటు కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 121 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ ప్లాంటుకు, రోజుకు 2 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉంటుంది.