ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 నవంబర్, 11-
12 తేదీల్లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. నవంబర్, 11వ తేదీ ఉదయం 9 గంటల 45 నిమిషాలకు, బెంగళూరులోని విధాన సౌధ లో గొప్ప భక్తుడు, కవి శ్రీ కనక దాసు విగ్రహానికి, మహర్షి వాల్మీకి విగ్రహానికి ప్రధానమంత్రి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ఉదయం 10 గంటల 20 నిమిషాల సమయంలో, బెంగళూరులోని కె.ఎస్.ఆర్. రైల్వే స్టేషన్ వద్ద వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ను, భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం, ఉదయం 11 గంటల 30 నిమిషాలకు, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రెండవ టెర్మినల్ ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఆ తర్వాత, మధ్యాహ్నం 12 గంటలకు, 108 అడుగుల నాదప్రభు కెంపెగౌడ కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు బెంగళూరులో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు, తమిళనాడు, దిండిగల్ లోని గాంధీగ్రామ్ గ్రామీణ సంస్థ 36వ స్నాతకోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి హాజరవుతారు.
నవంబర్,12వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు, ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు, తెలంగాణ లోని రామగుండంలో ఉన్న ఆర్.ఎఫ్.సి.ఎల్. ప్లాంటును ప్రధానమంత్రి సందర్శిస్తారు. ఆ తర్వాత, సాయంత్రం 4 గంటల 15 నిమిషాల ప్రాంతంలో, రామగుండం వద్ద పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
కర్ణాటక, బెంగళూరు లో ప్రధానమంత్రి :
బెంగళూరు లో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రెండవ టెర్మినల్ ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఏడాదికి 2.5 కోట్లుగా ఉన్న విమానాశ్రయ ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యం, ఈ టెర్మినల్ అందుబాటులోకి వచ్చాక రెట్టింపై సంవత్సరానికి 5-6 కోట్ల మంది ప్రయాణికుల నిర్వహణ సామర్ధ్యానికి చేరనుంది.
ఉద్యానవన నగరమైన బెంగళూరుకు ఒక బహుమతిగా, ప్రయాణీకులకు ఒక ఉద్యానవనంలో నడిచిన అనుభూతి కలిగేలా ఈ రెండవ టెర్మినల్ రూపొందించడం జరిగింది. ప్రయాణికులు పది వేలకు పైగా చదరపు మీటర్ల పచ్చని గోడలు, వేలాడే తోటలు, ఆరుబయలు ఉద్యానవనాల గుండా ప్రయాణిస్తారు. ప్రాంగణం అంతా నూరు శాతం పునరుత్పాదక ఇంధన వినియోగం తో ఈ విమానాశ్రయం ఇప్పటికే స్థిరత్వం లో ఒక గుర్తింపు పొందింది. ఈ రెండవ టెర్మినల్ రూపకల్పన స్థిరత్వ సూత్రాలతో సృష్టించబడింది. స్థిరత్వం కోసం చేపట్టిన చర్యల ఆధారంగా, ఈ రెండవ టెర్మినల్, కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందే అమెరికా జి.బి.సి. (గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్) ద్వారా ప్రీ సర్టిఫైడ్ ప్లాటినం రేటింగ్ ను పొందిన ప్రపంచంలోని అతిపెద్ద టెర్మినల్ గా నిలిచింది. రెండవ టెర్మినల్ కోసం ఏర్పాటుచేసిన అన్ని కళాఖండాలను 'నవరస' ఇతివృత్తం ఏకం చేస్తుంది. ఇక్కడ అమర్చిన కళాఖండాలు కర్ణాటక వారసత్వం, సంస్కృతి తో పాటు, సువిశాల భారతీయ తత్వాన్ని ప్రతిబింబిస్తాయి.
మొత్తం మీద, రెండవ టెర్మినల్ రూపకల్పన, నిర్మాణం నాలుగు మార్గదర్శక సూత్రాల ద్వారా ప్రభావితమైంది : పచ్చని తోటలో టెర్మినల్, స్థిరత్వం, సాంకేతికత, కళ & సంస్కృతి. రెండవ టెర్మినల్ ఆధునికమైనది అయినప్పటికీ, ఈ అంశాలవల్ల ఈ టెర్మినల్ ప్రకృతిలో మమేకమై, ప్రయాణికులందరికీ ఒక చిరస్మరణీయమైన 'గమ్యం' అనుభవాన్ని అందిస్తుంది.
చెన్నై-మైసూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న (కె.ఎస్.ఆర్) రైల్వే స్టేషన్ లో ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. ఇది దేశంలో ఐదవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కాగా, దక్షిణ భారతదేశంలో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది పారిశ్రామిక కేంద్రమైన చెన్నై, టెక్ & స్టార్టప్ హబ్ బెంగళూరు, ప్రసిద్ధ పర్యాటక నగరం మైసూర్ నగరాల మధ్య అనుసంధానతను మెరుగుపరుస్తుంది.
బెంగుళూరు కె.ఎస్.ఆర్. రైల్వే స్టేషన్ నుండి భారత్ గౌరవ్ కాశీ యాత్ర రైలును కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించనున్నారు. కర్ణాటక నుండి కాశీకి యాత్రికులను పంపేందుకు, కర్ణాటక ప్రభుత్వం మరియు రైల్వే మంత్రిత్వ శాఖ సంయుక్తంగా కృషి చేసి, భారత్ గౌరవ్ పథకం కింద ఈ రైలును ప్రారంభిస్తున్న మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. కాశీ, అయోధ్య, ప్రయాగ్ రాజ్ లను సందర్శించడానికి, యాత్రీకులకు సౌకర్యవంతమైన బస, మార్గదర్శకత్వం అందించబడుతుంది.
శ్రీ నాదప్రభు కెంపెగౌడ 108 మీటర్ల పొడవైన కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. బెంగళూరు నగర అభివృద్ధి కోసం నగర స్థాపకుడైన నాదప్రభు కెంపెగౌడ చేసిన కృషికి గుర్తుగా ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారు. "స్టాచ్యూ ఆఫ్ యూనిటీ" ద్వారా పేరు గాంచిన రామ్ వి సుతార్ ఈ విగ్రహానికి రూపకల్పన చేసి చెక్కారు. 98 టన్నుల కాంస్యం, 120 టన్నుల స్టీల్ ను వినియోగించి, ఈ విగ్రహాన్ని తయారుచేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ప్రధానమంత్రి:
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ప్రధానమంత్రి 10,500 కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. రాయపూర్ `విశాఖపట్నం ఎకనమిక్ కారిడార్‌కు సంబంధించిన ఆరులేన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీనిని రూ 3750 కోట్ల రూపాయల పైబడిన వ్యయంతో నిర్మిస్తారు.ఈ ఎకనమిక్ కారిడార్ ఛత్తీస్‌ఘడ్, ఒడిషాలోని పారిశ్రామిక ప్రాంతాలనుంచి విశాఖపట్నం పోర్టు,చెన్నై `కోల్ కతా జాతీయ రహదారితో సత్వర అనుసంధానతను కలిగి ఉంటుంది.ఇది ఆంధ్రప్రదేశ్, ఒడిషాలలోని గిరిజన వెనుకబడిన ప్రాంతాలతో అనుసంధానతను మెరుగు పరుస్తుంది. విశాఖపట్నంలోని కాన్వెంట్‌జంక్షన్ నుంచి షీలా నగర్ జంక్షన్ వరకు ప్రత్యేక పోర్టు రోడ్డుకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇది విశాఖపట్నం నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి , స్థానిక సరకరు రవాణాను, పోర్టు వైపు వెళ్ళే సరకురవాణాను వేరు చేయడానికి ఉపకరిస్తుంది. అలాగే ప్రధానమంత్రి, 200 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీకాకుళం `గజపతి కారిడార్ లో నరసనన్నపేట, పాతపట్నం సెక్షన్ ఎన్ హెచ్ 326 ఎ ను జాతికి అంకితం చేస్తారు.ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో మెరుగైన అనుసంధానతను కల్పిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో 2900 కోట్ల రూపాయలకు పైబడిన వ్యయంతో చేపట్టిన ఒఎన్‌జిసి కిచెందిన యు`ఫీల్డ్ సముద్రతీర వాటర్‌బ్లాక్ ప్రాజెక్టును ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు.రోజుకు 3 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి సామర్ధ్యంగల లోతైన గ్యాస్ అన్వేషణ ప్రాజెక్టు ఇది. అలాగే ప్రధానమంత్రి జిఎఐఎల్ కు చెందిన శ్రీకాకుళం అంగుల్ సహజవాయు పైప్ లైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. దీని సామర్ధ్యం 6.65 ఎంఎంఎస్‌సిఎండిలు. 745కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టును 2650 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్నారు. సహజవాయు గ్యాస్ గ్రిడ్ లో అంతర్భాగమైన ఈ పైప్ లైన్ ఆంధ్రప్రదేశ్ , ఒడిషాలోని వివిధ జిల్లాలకు చెందిన గృహాలకు, పరిశ్రమలకు వాణిజ్య సంస్థలకు, ఆటోమోబైల్ రంగానికి సహజవాయు పంపిణీకి అవసరమైన కీలక మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. ఈ పైప్‌లైను, ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సహజవాయువును సిటీ గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌లకు సరఫరా చేస్తుంది
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ప్రధానమంత్రి:
విశాఖపట్నం రైల్వేస్టేషన్ పునర్ అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపనచేస్తారు.దీనిని 450 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేస్తారు. పునర్ అభివృద్ధిచేసిన విశాఖపట్నం రైల్వే స్టేషన్ రోజుకు 75 వేలమంది ప్రయాణికుల సామర్ధ్యాన్ని తట్టుకోగలదు. ఇది ప్రయాణికులకు ఆధునిక సదుపాయాలను కల్పిస్తుంది. ప్రధానమంత్రి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ, ఉన్నతీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.150 కోట్లరూపాయల వ్యయంతో ఈ పనులు చేపడతారు. ఫిషింగ్ హార్బర్ ఉన్నతీకరణ, ఆధునీకరణ అయిన తర్వాత రోజుకు 150 టన్నుల నుంచి 300 టన్నుల వరకు సరకు ఎగుమతి దిగుమతులకు వీలు కల్పిస్తుంది. ఆధునీకరణ సదుపాయాల వల్ల వృధా తగ్గుతుంది. అలాగే జెట్టిలో సరకు ఉండే సమయం తగ్గుతుంది. దీనివల్ల సరుకు మంచి ధర పలుకుతుంది.
తెలంగాణా లోని రామగుండంలో ప్రధానమంత్రి పర్యటన:
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, రామగుండంలో 9500 కోట్ల రూపాయలకు పైగా విలువగల పలు ప్రాజుక్టులకు శంకుస్థాపన చేస్తారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రామగుండంలో ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. రామగుండం ప్రాజెక్టుకు ప్రధానమంత్రి 2016 ఆగస్టు 7న శంకుస్థాపన చేశారు. దేశంలో ఎరువుల ఉత్పత్తిరంగంలో స్వావలంబన సాధించేందుకు ప్రధానమంత్రి దార్శనికత నుంచి ఈ ప్రాజెక్టు పునరుద్ధరణ రూపుదిద్దుకుంది. రామగుండం ప్లాంటు ఏటా 12.7 లక్షల మెట్రిక్ టన్నుల వేప పూతపూసిన దేశీయ యూరియాను ఉత్పత్తి చేస్తుంది.
ఈ ప్రాజెక్టును రామగుండం ఫర్టిలైజర్స్ , కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ ఎఫ్‌సిఎల్) ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఇది నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ ఎఫ్ ఎల్), ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఇఐఎల్), ఫర్టిలైజర్స్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్.సిఐఎల్) ల సంయుక్త భాగస్వామ్య సంస్థ. ఆర్‌ఎఫ్ సి ఎల్ కు 6,300 కోట్ల రూపాయలపైగా వ్యయంతో నూతనంగా అమ్మోనియా యూరియా ప్లాంటును ఏర్పాటుచేసే బాధ్యతను అప్పగించడం జరిగింది. ఆర్.ఎఫ్.సి.ఎల్‌ప్లాంటుకు గ్యాస్‌ను జగదీష్‌పూర్ `ఫూల్‌పూర్` హాల్దియా పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తారు.
ఈ ప్లాంటు తెలంగాణాతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, చత్తీస్‌ఘడ్, మహారాష్ట్రలోని రైతులకు సకాలంలో తగినంత యూరియా ఎరువును సరఫరాచేస్తుంది. ఈ ప్లాంటు ఎరువుల అందుబాటును మెరుగ పరచడమే కాక, ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుంది. అలాగే మౌలికసదుపాయాలైన రోడ్డు, రైలు, అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుంది.దీనికితోడు ఈ ఫ్యాక్టరీకి అవసరమైన వివిధ ఉత్పత్తులను సరఫరాచేయడంలో ఎం.ఎస్.ఎం.ఇ వెండర్లు కూడా లబ్ధిపొందుతారు. ఆర్‌ఎఫ్‌సిఎల్ వారి భారత్ యూరియా ఆర్ధిక వ్యవస్థకు అద్భుత చోదకశక్తిగా అవడమే కాక ఎరువుల దిగుమతులను గణనీయంగా తగ్గిస్తుంది. ఇది స్థానిక రైతులకు సకాలంలో ఎరువులు అందుబాటులోకి వచ్చేలా చేయడానికి, విస్తరణ సేవలకు ఉపకరిస్తుంది.
ప్రధానమంత్రి, తన పర్యటన సందర్భంగా భద్రాచలం రోడ్ `సత్తుపల్లి రైల్ లైన్‌ను జాతికి అంకితం చేస్తారు. సుమారు 1000 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని చేపట్టారు. 2200 కోట్లరూపాయల విలువగల వివిధ రోడ్డు ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. వీటిలో మెదక్`సిద్దిపేట`ఎల్కతుర్తి సెక్షన్ ఎన్‌హెచ్ 765 డిజి, బోధన్`భైంసా సెక్షన్ ఎన్‌హెచ్‌ఖ 161 బిబి, సిరోంచ నుంచి మహదేవపూర్ సెక్షన్ ఎన్‌హెచ్ 353సి రహదారులు ఉన్నాయి.
తమిళనాడులో గాంధీగ్రామ్ లో ప్రధానమంత్రి:
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 36 వస్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. 2018`19 , 2019`20బ్యాచ్ లకు చెందిన 2300 మందికిపైగా విద్యార్థులు ఈ స్నాతకోత్సవంలో పట్టాలు అందుకుంటారు.