ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఫిబ్రవరి 27వ తేదీన కర్ణాటకలో పర్యటిస్తారు. ఆ రోజు ఉదయం సుమారు 11:45 గంటల ప్రాంతంలో శివమొగ్గ విమానాశ్రయం మొత్తాన్నీ ఆయన పరిశీలిస్తారు. అనంతరం శివమొగ్గలో అనేక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:15 గంటలకు బెళగావిలోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రారంభించి, కొన్నిటిని జాతికి అంకితం చేస్తారు. అలాగే ‘పీఎం-కిసాన్’ పథకం కింద 13వ విడత నిధులను ఆయన విడుదల చేస్తారు.
శివమొగ్గలో ప్రధానమంత్రి
దేశవ్యాప్తంగా విమాన అనుసంధానం మెరుగుకు ప్రధాని ఇస్తున్న ప్రాధాన్యం శివమొగ్గలో విమానాశ్రయం ప్రారంభంతో మరింత ప్రస్ఫుటమవుతుంది. ఈ కొత్త విమానాశ్రయాన్ని దాదాపు రూ.450 కోట్లతో నిర్మించారు. ఇందులోని ప్రయాణికుల కూడలి భవనం గంటకు 300 మంది ప్రయాణిక లావాదేవీలను పూర్తిచేయగలదు. అంతేకాకుండా దీనివల్ల మల్నాడు ప్రాంతంలోని శివమొగ్గ, పొరుగునగల ఇతర ప్రాంతాల మధ్య అనుసంధానం, సౌలభ్యం మెరుగుపడతాయి.
శివమొగ్గలో రెండు రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఇందులో శివమొగ్గ- షికారిపుర-రాణేబెన్నూరు కొత్త రైలుమార్గం, కోటగంగూరు రైల్వే కోచ్ డిపో ఉన్నాయి. ఈ కొత్త రైలుమార్గాన్ని రూ.990 కోట్లతో నిర్మించనుండగా ఇది బెంగళూరు-ముంబై ప్రధాన మార్గంలో మల్నాడు ప్రాంతానికి మెరుగైన అనుసంధానం కల్పిస్తుంది. శివమొగ్గ నుంచి కొత్త రైళ్ల ప్రారంభానికి, బెంగళూరుతోపాటు మైసూరులో నిర్వహణ సదుపాయంలో రద్దీ తగ్గించడానికి వీలుగా శివమొగ్గ నగరంలోని కోటగంగూరు రైల్వే కోచ్ డిపోను రూ.100కుపైగా వ్యయంతో రూపొందిస్తారు.
వీటితోపాటు బహుళ రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకూ ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఇందులో రూ.215 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించే రహదారులలో బైందూరు-రాణిబెన్నూరును కలుపుతూ ఎన్‌హెచ్-766సి పరిధిలో షికారిపుర పట్టణం కోసం కొత్త బైపాస్ రోడ్డు ఒకటి. మెగారవల్లి నుంచి అగుంబే దాకా ఎన్‌హెచ్-169ఎ విస్తరణ; ఎన్‌హెచ్-169 పరిధిలోని తీర్థహళ్లి తాలూకాలోగల భారతీపుర వద్ద కొత్త వంతెన నిర్మాణం చేపడతారు.
ఈ పర్యటనలో భాగంగా జల్ జీవన్ మిషన్ కింద రూ.950 కోట్లతో చేపట్టిన పలు గ్రామీణ పథకాలకు ప్రారంభోత్సవంతోపాటు మరికొన్నిటికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. వీటిలో గౌతమపురసహా 127 గ్రామాలకు సంబంధించిన బహుళ-గ్రామ పథకం ప్రారంభోత్సవం ఒకటి కాగా, రూ.860 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించే మరో మూడు బహుళ-గ్రామ పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నాలుగు పథకాలు గృహాలకు కొళాయి కనెక్షన్ల సదుపాయం కల్పిస్తాయి. తద్వారా 4.4 లక్షల మంది ప్రజలు లబ్ధి పొందుతారని అంచనా.
శివమొగ్గ నగరంలో రూ.895 కోట్లకుపైగా విలువైన 44 స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. వీటిలో 110 కి.మీ.ల 8 స్మార్ట్ రోడ్ ప్యాకేజీలున్నాయి; ఈ మేరకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, బహుళ-స్థాయి కార్ పార్కింగ్; స్మార్ట్ బస్ షెల్టర్ ప్రాజెక్టులు; ఘన వ్యర్థ పదార్థాల ఆధునిక నిర్వహణ వ్యవస్థ; శివప్ప నాయక్ ప్యాలెస్ వంటి వారసత్వ ప్రాజెక్టులను ఇంటరాక్టివ్ మ్యూజియంగా రూపొందించడం, 90 కన్సర్వెన్సీ లేన్‌లు, పార్కులు, రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టులు వీటిలో భాగంగా ఉన్నాయి.
బెళగావిలో ప్రధానమంత్రి
రైతు సంక్షేమంపై ప్రధాని నిబద్ధతకు నిదర్శనంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) 13వ విడత కింద 8 కోట్లమందికిపైగా లబ్ధిదారులకు రూ.16,000 కోట్లు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పద్ధతిలో విడుదల చేస్తారు. ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు తలా రూ.2,000 వంతున మూడు సమాన వాయిదాలలో ప్రభుత్వం ఏటా రూ.6000 ఆర్థిక సహాయం అందిస్తోంది.
ఇక్కడి కార్యక్రమాల్లో భాగంగా నవీకృత బెళగావి రైల్వే స్టేషన్ భవనాన్ని ప్రధాని జాతికి అంకితం చేస్తారు. ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాల కల్పన లక్ష్యంగా సుమారు రూ.190 కోట్లతో ఈ స్టేషన్ పునరాభివృద్ధి చేయబడింది. అలాగే బెళగావి వద్ద లోండా-బెళగావి-ఘటప్రభ సెక్షన్ మధ్య రైలు మార్గం డబ్లింగ్ ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. దాదాపు రూ.930 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుతో ముంబై-పుణె-హుబ్బళ్లి- బెంగళూరు మార్గం సామర్థ్యం పెరుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో వాణిజ్య, వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు పెరిగేందుకు దోహదపడుతుంది.
జల్ జీవన్ మిషన్ బెళగావిలో ఆరు బహుళ గ్రామ పథకాల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దాదాపు రూ.1585 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుల ద్వారా 315కుపైగా గ్రామాల్లోని 8.8 లక్షల మంది ప్రజానీకానికి ప్రయోజనం చేకూరుతుంది.