ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 డిసెంబర్ 28న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 1:30 గంటలకు ఆయన కాన్పూర్ మెట్రోరైల్ ప్రాజెక్టులో ఇప్పటిదాకా పూర్తయిన భాగాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ‘బినా-పంకి’ బహుళ ఉత్పత్తుల పైప్‌లైన్ ప్రాజెక్టును కూడా ప్రారంభిస్తారు. దీనికిముందు ఉదయం 11:00 గంటల ప్రాంతంలో ఐఐటీ-కాన్పూర్ 54వ స్నాతకోత్సవానికి ప్రధాని హాజరవుతారు.
ప్రధానమంత్రి ప్రధానంగా దృష్టి సారించిన అంశాల్లో పట్టణ రవాణాకు నూతనోత్తేజం ఇవ్వడం కూడా ఒకటి. కాన్పూర్ మెట్రోరైల్ ప్రాజెక్టులో ఇప్పటివరకూ పూర్తయిన భాగాన్ని ఆయన ప్రారంభించనుండటం ఈ దిశగా ఒక ముందడుగు. ప్రస్తుతం ఐఐటీ-కాన్పూర్ నుంచి మోతీఝీల్ వరకూ 9 కిలోమీటర్ల పొడవునగల భాగం పనులు పూర్తయ్యాయి. కాన్పూర్ మెట్రోరైల్ ప్రాజెక్టు పనులపై తనిఖీ నిమిత్తం ప్రధానమంత్రి ఐఐటీ మెట్రో స్టేషన్ నుంచి గీతానగర్ వరకూ మెట్రో రైలులో ప్రయాణిస్తారు. ఈ మెట్రోరైల్ ప్రాజెక్టు మొత్తం పొడవు 32 కిలోమీటర్లు కాగా, రూ.11,000 కోట్లతో దీన్ని నిర్మిస్తున్నారు.
బినా-పంకి బహుళ ఉత్పత్తుల పైప్‌లైన్ ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. మొత్తం 356 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టు సామర్థ్యం సంవత్సరానికి 3.45 మిలియన్ టన్నులుగా ఉంది. ఇది మధ్యప్రదేశ్‌లోని బినా చమురుశుద్ధి కర్మాగారం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోగల పంకీ వరకూ సాగుతుంది. దీన్ని రూ.1,500 కోట్లతో నిర్మించారు. ఈ ప్రాంతానికి బినా చమురుశుద్ధి కర్మాగారం నుంచి పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతకు ఇది దోహదపడుతుంది.
ఐఐటీ-కాన్పూర్ 54వ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఇందులో భాగంగా బ్లాక్‌చెయిన ఆదారిత డిజిటల్ పట్టాలకు ఆయన శ్రీకారం చుడతారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఈ డిజిటల్ పట్టాలు ప్రదానం చేయబడతాయి. ‘నేషనల్ బ్లాక్‌చెయిన్ ప్రాజెక్ట్’ కింద ఐఐటీలోనే రూపొందించిన బ్లాక్‌చెయిన్ చోదిత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ డిజిటల్ పట్టాల ప్రదానం సాగుతుంది. ఈ డిజిటల్ పట్టాలకు నకిలీల తయారీ అసాధ్యం మాత్రమేగాక ప్రపంచంలో ఎక్కడైనా వీటిని ధ్రువీకరించుకునే వీలుంటుంది.