ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు (2024 మార్చి11) హర్యానాలోని గురుగ్రామ్ లో పర్యటించ నున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాన మంత్రి దేశ వ్యాప్తంగా సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన 112 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.
జాతీయ రహదారి-48పై ఢిల్లీ- గురుగ్రామ్ ల మధ్య ట్రాఫిక్ ను మెరుగు పరచడానికి , రద్దీని తగ్గించడానికి దోహదపడే ల్యాండ్ మార్క్ ద్వారకా ఎక్స్ ప్రెస్ వే హర్యానా విభాగాన్ని ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఎనిమిది లేన్ ల ద్వారకా ఎక్స్ ప్రెస్ వే లోని 19 కిలోమీటర్ల పొడవైన హర్యానా సెక్షన్ ను సుమారు రూ.4,100 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇందులో 10.2 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-హర్యానా బోర్డర్ నుండి బసాయి రైల్-ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబి), 8.7 కిలోమీటర్ల పొడవైన బసాయి ఆర్ఓబి నుండి ఖేర్కి దౌలా వరకు రెండు ప్యాకేజీలు ఈ సెక్షన్ లో ఉన్నాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి, గురుగ్రామ్ బైపాస్ కు ఇది నేరుగా కనెక్టివిటీని అందిస్తుంది.
ప్రధాన మంత్రి ప్రారంభించనున్న ఇతర ప్రధాన ప్రాజెక్టులలో - నంగ్లోయి - నజఫ్ ఘడ్ రోడ్డు నుంచి ఢిల్లీలోని సెక్టార్ 24 ద్వారకా సెక్షన్ వరకు 9.6 కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్-2 (యు ఇ ఆర్-2)- ప్యాకేజీ 3; ఉత్తరప్రదేశ్ లో సుమారు 4,600 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన లక్నో రింగ్ రోడ్డు మూడు ప్యాకేజీలు ; ఆంధ్రప్రదేశ్ లో రూ 2,950 కోట్లతో అభివృద్ధి చేసిన ఎన్ హెచ్ 16 లోని ఆనందపురం- పెందుర్తి- అనకాపల్లి సెక్షన్ ; హిమాచల్ ప్రదేశ్ లో సుమారు ఎన్ హెచ్ -21 (2 ప్యాకేజీలు)లో రూ.3,400 కోట్ల విలువైన కిరాత్ పూర్ నుంచి నెర్ చౌక్ సెక్షన్; కర్ణాటకలో రూ.2,750 కోట్ల విలువైన దోబాస్ పేట - హెస్కోటే సెక్షన్ (రెండు ప్యాకేజీలు) ; ఇంకా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రూ.20,500 కోట్ల విలువైన 42 ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన కూడా చేయనున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ లో రూ.14,000 కోట్ల విలువైన బెంగళూరు - కడప - విజయవాడ ఎక్స్ ప్రెస్ వేకు చెందిన 14 ప్యాకేజీ లు; కర్ణాటకలో రూ.8,000 కోట్ల విలువైన ఎన్ హెచ్ -748ఎ లోని బెల్గాం - హుంగుండ్ - రాయచూర్ సెక్షన్ ఆరు ప్యాకేజీలు; హర్యానాలో రూ.4,900 కోట్ల విలువైన షామ్లీ - అంబాలా హైవే మూడు ప్యాకేజీలు; పంజాబ్ లో రూ.3,800 కోట్ల విలువైన అమృత్ సర్ - బటిండా కారిడార్ రెండు ప్యాకేజీలు; ఇంకా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రూ.32,700 కోట్ల విలువైన 39 ప్రాజెక్టులు ఉన్నాయి.
ఈ ప్రాజెక్టులు జాతీయ రహదారి నెట్వర్క్ అభివృద్ధికి గణనీయంగా దోహదం చేస్తాయి, అలాగే సామాజిక-ఆర్థిక వృద్ధిని పెంచడానికి, ఉద్యోగ అవకాశాలను పెంచడానికి , దేశవ్యాప్తంగా ప్రాంతాలలో వ్యాపారం వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి.