ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు 2023 అక్టోబరు 2న ఉదయం 10:45 గంటలకు రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్‌లో రూ.7,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతోపాటు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరానికి చేరుకుంటారు. అక్కడ రూ.19,260 కోట్ల విలువైన పలు అభివృద్ధి పథకాలను జాతికి అంకితం చేయడంతోపాటు శంకుస్థాపన చేస్తారు.
చిత్తోడ్‌గఢ్‌లో ప్రధానమంత్రి
దేశంలో గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ దిశగా మరో ముందడుగులో భాగంగా రూ.4,500 కోట్లతో నిర్మించిన మెహ్‌సానా-భటిండా-గురుదాస్పూర్ గ్యాస్ పైప్‌లైన్‌ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. అలాగే అబూ రోడ్‌లో ‘హెచ్‌పిసిఎల్’ ఎల్పీజీ ప్లాంట్‌ను కూడా ఆయన అంకితం చేయనున్నారు. ఈ ప్లాంటు ద్వారా ఏటా 86 లక్షల సిలిండర్లలో గ్యాస్ నింపి, పంపిణీ చేస్తారు. తద్వారా దాదాపు 0.75 మిలియన్ కిలోమీటర్ల మేర సిలిండర్ రవాణా ట్రక్కుల వినియోగం నికరంగా తగ్గుతుంది. ఈ తగ్గుదలతో ఏటా 0.5 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించే వీలు కలుగుతుంది. మరోవైపు అజ్మీర్‌లోని ‘ఐఒసిఎల్’ ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంటు ప్రాంగణంలో అదనపు నిల్వ సదుపాయాన్ని కూడా జాతికి అంకితం చేస్తారు.
జాతీయ రహదారి నం.12 (కొత్త ఎన్‌హెచ్-52)లో భాగంగా రూ.1480 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన దారా-ఝలావర్-తీంధర్ విభాగంలో నాలుగు వరుసల రహదారిని ప్రధాని జాతికి అంకితం చేస్తారు. దీంతో కోట-ఝలావర్ జిల్లాల్లో గనుల నుంచి ఉత్పత్తుల రవాణా సులభమవుతుంది. అంతేకాకుండా సవాయ్ మాధోపూర్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)ని 2 వరుసల నుంచి 4 వరుసలుగా విస్తరించి నిర్మించే పనులకు శంకుస్థాపన చేస్తారు. తద్వారా తరచూ సంభవించే వాహనాల రద్దీ చిక్కుముడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్న రైల్వే ప్రాజెక్టులలో చిత్తోర్‌గఢ్-నీముచ్ రైల్వే లైన్ కోటా-చిత్తోడ్‌గఢ్ విద్యుదీకరణ రైల్వే లైన్ల డబ్లింగ్ పనులున్నాయి. వీటిని రూ.650 కోట్లకుపైగా వ్యయంతో పూర్తిచేశారు. వీటివల్ల ఈ ప్రాంతంలో రైల్వే మౌలిక సదుపాయాలు బలోపేతమై రాజస్థాన్‌లోని చారిత్రక ప్రదేశాలకు పర్యాటకుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. మరోవైపు స్వదేశ్ దర్శన్ పథకం కింద నాథ్‌ద్వారా వద్ద నిర్మించిన పర్యాటక సదుపాయాలను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. వల్లభాచార్య ప్రబోధిత ‘పుష్టిమార్గ్’ను అనుసరించే లక్షలాది భక్తులకు నాథ్‌ద్వారా కీలక విశ్వాస కేంద్రం. ఇక్కడ ఆధునిక ‘పర్యాటక వివరణ-సాంస్కృతిక కేంద్రం’ కూడా నిర్మించబడింది. పర్యాటకులు శ్రీనాథ్ జీవిత విశేషాలను వివిధ కోణాల్లో అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. అలాగే కోటాలోని ‘ఐఐఐటీ’ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) శాశ్వత ప్రాంగణాన్ని కూడా ప్రధాని జాతికి అంకితం చేస్తారు.
గ్వాలియర్‌లో ప్రధానమంత్రి
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతులమీదుగా మధ్యప్రదేశ్లో రూ.19,260 కోట్ల విలువైన ప్రాజెక్టులు జాతికి అంకితం, శంకుస్థాపన చేయబడతాయి. దేశవ్యాప్తంగా అనుసంధానం పెంపు కృషిలో భాగంగా రూ.11,895 కోట్లతో నిర్మించిన ఢిల్లీ-వడోదర ఎక్స్‌ప్రెస్ వేను ఆయన జాతికి అంకితం చేస్తారు. దీంతో రోడ్ల అనుసంధానానికి మరింత ఉత్తేజం లభిస్తుంది. మరోవైపు రూ.1,880 కోట్లతో చేపట్టే 5 వేర్వేరు రహదారి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ప్రతి ఒక్కరికీ స్వంత ఇల్లు ఉండేవిధంగా ప్రధానమంత్రి నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ మేరకు ‘పిఎంఎవై-గ్రామీణ’ పథకం కింద నిర్మించిన 2.2 లక్షలకుపైగా ఇళ్లలో గృహప్రవేశం కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అలాగే పిఎంఎవై- గ్రామీణ కింద సుమారు రూ.140 కోట్లతో నిర్మించిన గృహాలను ఆయన లబ్ధిదారులకు అంకితం చేయనున్నారు.
దేశ ప్రజలకు సురక్షిత తాగునీటిని తగు పరిమాణంలో అందించడమన్నది ప్రభుత్వం నిశితంగా దృష్టి సారించిన అంశాల్లో ఒకటిగా ఉంది. ఈ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా గ్వాలియర్, శివపూర్ జిల్లాల్లో రూ.1530 కోట్ల విలువైన జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులతో పరిసరాల్లోని 720 గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్య మౌలిక సదుపాయాల పెంపు దిశగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కింద 9 ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. వీటిని రూ.150 కోట్లకుపైగా వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు.
ప్రధానమంత్రి ఐఐటీ-ఇండోర్ అకడమిక్ భవనాన్ని జాతికి అంకితం చేస్తారు. అలాగే అక్కడ నిర్మించనున్న హాస్టల్, ఇతర భవనాలకు శంకుస్థాపన చేస్తారు. ఇవేకాకుండా ఇండోర్‌లో మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్క్‌కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఉజ్జయినిలో సమీకృత పారిశ్రామిక పట్టణం, ‘ఐఒసిఎల్’ బాట్లింగ్ ప్లాంట్, గ్వాలియర్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి దివ్యాంగ క్రీడాకారుల శిక్షణ ప్రాంగణం వగైరాలను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు.