అధిక దిగుబడినిచ్చే, వాతావరణాన్ని తట్టుకోగలిగే, 109 బయోఫోర్టిఫైడ్ వంగడాలను న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఆగస్టు 11, ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రైతులు, శాస్త్రవేత్తలతో కూడా ప్రధాని సంభాషించనున్నారు.
34 క్షేత్రస్థాయి పంటలు, 27 ఉద్యానవన పంటలు సహా మొత్తం 61 పంటల కోసం 109 వంగడాలను ప్రధాన మంత్రి విడుదల చేయనున్నారు. క్షేత్రస్థాయి పంటలలో, చిరుధాన్యాలు, పశుగ్రాసం, నూనెగింజలు, పప్పుధాన్యాలు, చెరకు, పత్తి, ఫైబర్, ఇతర సంభావ్య పంటలు సహా వివిధ తృణధాన్యాల వంగడాల విత్తనాలు విడుదల చేయనున్నారు. అలాగే ఉద్యానవన పంటల్లో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తోటలు, దుంపలు, మసాలా దినుసులు, పుష్పాలు, ఔషధ సంబంధ పంటల కోసం వివిధ వంగడాలను విడుదల చేయనున్నారు.
ప్రధాన మంత్రి సుస్థిర వ్యవసాయ పద్ధతులు, వాతావరణాన్ని తట్టుకునే పద్ధతులను అవలంబించడాన్ని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తున్నారు. పోషకాహార లోపం లేని భారతదేశాన్ని సాకారం చేయడం కోసం మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ మొదలైన అనేక ప్రభుత్వ కార్యక్రమాలతో వాటిని అనుసంధానం చేయడం ద్వారా బయోఫోర్టిఫైడ్ వంగడాలతో పంటల సాగును ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. ఈ చర్యలు రైతులకు మంచి ఆదాయాన్ని అందజేస్తాయని, అలాగే వారికి మంచి వ్యాపార అవకాశాలను అందించే కొత్త మార్గాలకు ఆస్కారం ఉంటుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. అధిక దిగుబడినిచ్చే 109 వంగడాలను విడుదల చేయడం ఈ దిశగా మరో ముందడుగు అవుతుంది.