బోడో ఒప్పందం పై సంతకాల నేపథ్యం లో 2020వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ నాడు జరిగే వేడుకల లో పాలుపంచుకోవడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అసమ్ లోని కోక్ రాఝార్ ను సందర్శించనున్నారు.
ఈ కార్యక్రమాని కి బిటిఎడి జిల్లా లు మరియు అసమ్ రాష్ట్రం లో అన్ని ప్రాంతాల నుండి 4,00,000 మంది కి పైగా హాజరు అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భం లో అసమ్ రాష్ట్రం యొక్క వివిధత్వాన్ని కళ్ళ కు కట్టే రీతి లో రాష్ట్ర ప్రభుత్వం అసమ్ కు చెందిన విభిన్న సముదాయాల తో ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది.
ఈ సంవత్సరం జనవరి లో సంతకాలు అయిన చారిత్రక బోడో ఒప్పందాన్ని అభినందించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సభికుల ను ఉద్దేశించి ప్రసంగం చేస్తారు.
ఈ ఒప్పందం పై 2020వ సంవత్సరం జనవరి 27వ తేదీన న్యూ ఢిల్లీ లో సంతకాలు అయ్యాయి.
ప్రధాన మంత్రి ట్విటర్ లో తన వ్యక్తిగత ఖాతా లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, అందులో ‘‘ఈ రోజు భారతదేశాని కి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు’’ అని, ఈ ఒడంబడిక ‘‘బోడో ప్రజల కు శాంతి, సద్భావన మరియు ఐకమత్యం లతో కూడిన ఒక నవోదయాన్ని తీసుకు రావడమే కాకుండా వారికి పరివర్తనాత్మకమైన ఫలితాల ను అందిస్తుంద’’ని పేర్కొన్నారు.
ఈ ఒప్పందం ప్రధాన మంత్రి యొక్క ‘‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’’ దార్శనికత కు అనుగుణం గాను, అయిదు దశాబ్దాలు గా కొనసాగుతూ వచ్చిన బోడో సంక్షోభాని కి స్వస్తి పలుకుతూ ఈశాన్య ప్రాంత సర్వతోముఖాభివృద్ధి దిశ గా ఒక వచనబద్ధత గా కూడాను నిలుస్తున్నది.
‘‘బోడో ఒప్పందం అనేక కారణాల వల్ల ప్రత్యేకమైనటువంటిది. ఇదివరకు సాయుధ ప్రతిఘటన సమూహాల తో సంబంధం పెట్టుకొన్న వారు ప్రస్తుతం ప్రధాన స్రవంతి లోకి అడుగిడి, మన దేశ పురోగతి కి వారి వంతు తోడ్పాటు ను అందించనున్నారు’’ అని ప్రధాన మంత్రి తన ట్విటర్ సందేశం లో వివరించారు.
దీని కి అనుగుణం గానే, ఈ ఒప్పందం పై సంతకాలు జరిగిన రెండు రోజుల లోపే ఎన్‌డిఎఫ్‌బి లోని వివిధ వర్గాల కు చెందిన 1615 మంది కి పైగా వారి యొక్క ఆయుధాల ను అప్పగించి, ప్రధాన స్రవంతి లో చేరిపోయారు.
‘‘బోడో సమూహాల తో జరిగిన సంధి బోడో ప్రజల విశిష్ట సంస్కృతి ని పరిరక్షించగలదు; దాని కి బహుళ జనాదరణ ను సంతరించగలదు. వారు అభివృద్ధి ప్రధానమైనటువంటి పలు కార్యక్రమాల లాభాల ను అందుకోగలుగుతారు. బోడో ప్రజలు వారి ఆకాంక్షల ను సాకారం చేసుకోగలిగేటట్టుగా వారి కి చేతనైన ప్రతిదీ చేయడానికి మేము కంకణం కట్టుకొన్నాము’’ అని ప్రధాన మంత్రి తన ట్విటర్ సందేశం లో వివరించారు.
ఈ ప్రాంతం అభివృద్ధి కి గాను 1,500 కోట్ల రూపాయల విలువైన ఒక ప్రత్యేక ప్యాకేజీ ని కేటాయించడమైంది.
బ్రూ-రియాంగ్ శరణార్థులు 35,000 మంది కి పైగా రక్ష ను మరియు ఉపశమనాన్ని అందించడం కోసం భారత ప్రభుత్వం ఇటీవల త్రిపుర, మిజోరం ప్రభుత్వాల తో బ్రూ-రియాంగ్ ఒప్పందం పై సంతకాలు చేసింది; మరి అదే విధం గా త్రిపుర లో ఎన్ఎల్ఎఫ్ టి కి చెందిన 85 మంది కి పైగా లొంగిపోవడమనేది ఈశాన్య ప్రాంతాల లో శాంతి మరియు సమగ్ర అభివృద్ధి కి కట్టుబడినటువంటి ప్రధాన మంత్రి యొక్క దార్శనికత కు నిదర్శనం గా నిలుస్తున్నది.
హింసా మార్గం లో నడుస్తున్న వారందరు ఆయుధాల ను విడచిపెట్టి ప్రధాన స్రవంతి లోకి తిరిగి రావాలి అంటూ ప్రధాన మంత్రి గణతంత్ర దినం నాడు ‘‘మన్ కీ బాత్’’ (మనసు లో మాట) కార్యక్రమం ద్వారా దేశ ప్రజల తో మాట్లాడుతూ, పిలుపునిచ్చారు.
‘‘పవిత్రమైన గణతంత్ర దినం సందర్భం లో దేశం లో ఏ ప్రాంతం లో నివసిస్తున్న ఏ ఒక్కరికి అయినా నేను ఒక విజ్ఞప్తి ని చేస్తాను. అది ఏమిటి అంటే ఎవరైతే ఇప్పటికీ హింస ద్వారాను, ఆయుధాల ద్వారాను సమస్యల కు పరిష్కారాల కై అన్వేషిస్తున్నారో అటువంటి వారు ప్రధాన స్రవంతి లోకి తిరిగి రావాలి అనేదే. వారు వారి యొక్క స్వీయ సామర్ధ్యాల పట్ల మరియు సమస్యల ను శాంతియుతం గా పరిష్కరించగిగిన ఈ దేశం యొక్క శక్తియుక్తుల పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి’’ అని ఆయన అన్నారు.