ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అహమదాబాద్ లో 2022 డిసెంబర్ 14వ తేదీ నాడు సాయంత్రం 5:30 గంటల కు ప్రముఖ్ స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సవ్ తాలూకు ప్రారంభ కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు.
పరమ పూజనీయుడు ప్రముఖ్ స్వామి మహారాజ్ ఒక మార్గదర్శి మాత్రమే కాకుండా భారతదేశం అంతటా మరియు ప్రపంచ వ్యాప్తం గా అసంఖ్యాకుల జీవనం పై ప్రభావాన్ని ప్రసరించినటువంటి గురువు కూడాను. ఒక మహా ఆధ్యాత్మిక నేత గా ఆయన కు విస్తృతమైన ఆదరణ కు, అభిమానాని కి పాత్రుడు అయ్యారు. ఆయన తన జీవనాన్ని ఆధ్యాత్మిక వాదాన్ని సేవించడానికి మరియు మానవ జాతి కి సమర్పణం చేసివేశారు. బిఎపిఎస్ స్వామినారయణ్ సంస్థ నాయకుని గా ఆయన అనేక సాంస్కృతిక కార్యక్రమాల కు, సామాజిక కార్యక్రమాల కు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల కు ప్రేరణ ను ఇచ్చి, లక్షల కొద్దీ ప్రజల కు సంరక్షణ ను అందించారు.
హెచ్ హెచ్ ప్రముఖ్ స్వామి మహారాజ్ శత జయంతి సంవత్సరం లో, ప్రపంచం లో అనేక దేశాల ప్రజలు ఆయన జీవనాన్ని మరియు ఆయన ప్రయాసల ను ఒక ఉత్సవం గా జరుపుకొంటున్నారు. ప్రపంచం అంతటా ఏడాది పొడవునా సాగిన ఉత్సవాలు బిఎపిఎస్ స్వామినారాయణ్ సంస్థ ప్రపంచ వ్యాప్త ప్రధాన కార్యాలయం నెలకొన్న శాహీబాగ్ లోని బిఎపిఎస్ స్వామినారాయణ్ మందిర్ ఆధ్వర్యం లో నిర్వహించేటటువంటి ‘ప్రముఖ్ స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సవ్’ తో ముగియనున్నాయి. ఈ మహోత్సవ్ ను ఒక నెల రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. అహమదాబాద్ లో 2022 డిసెంబర్ 15వ తేదీ మొదలుకొని 2023 జనవరి 15వ తేదీ వరకు ప్రతి రోజూ జరిపే కార్యక్రమాలు, ప్రత్యేక ఇతివృత్తం తో కూడిన ప్రదర్శన లు, ఆలోచనల ను రేకెత్తించేటటువంటి మండపాల వంటివి ఈ మహోత్సవ్ లో చోటు చేసుకోనున్నాయి.
బిఎపిఎస్ స్వామినారాయణ్ సంస్థ ను శాస్త్రీజీ మహారాజ్ 1907వ సంవత్సరం లో స్థాపించారు. వేద ప్రబోధాల పై ఆధారపడి మరి ఆచరణాత్మక ఆధ్యాత్మిక వాదం తాలూకు మూలస్తంభాల దన్ను తో స్థాపించిన బిఎపిఎస్ నేటి కాలం లో సామాజికం గా, నైతికం గా, ఆధ్యాత్మికం గా ఎదురవుతున్నటువంటి సవాళ్ళ ను పరిష్కరించడం కోసం విరివి గా పాటుపడుతున్నది. విశ్వాసం, ఏకత్వం మరియు స్వార్థ రహితమైన సేవ అనే విలువల ను కాపాడడం బిఎపిఎస్ ధ్యేయం గా ఉంది. అలాగే జీవనం లో అన్ని రంగాల కు చెందిన ప్రజల యొక్క ఆధ్యాత్మికమైన అవసరాల, సాంస్కృతికపరమైన అవసరాల, భౌతిక అవసరాల మరియు భావోద్వేగ భరిత అవసరాల ను తీర్చడం కోసం బిఎపిఎస్ తన వంతు కృషి ని చేస్తున్నది. ప్రపంచ వ్యాప్త సంపర్కం మరియు ప్రయాస ల ద్వారా ఈ సంస్థ మానవతాపూర్వక కార్యకలాపాల ను సైతం భుజానికి ఎత్తుకొంటున్నది.