ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 జనవరి 2న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 1:00 గంటకు ఆయన మేజర్ ధ్యాన్‌చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. మీరట్‌లోని సర్ధానా పట్టణ పరిధిలోగల సలావా, కైలి గ్రామాలలో రమారమి రూ.700 కోట్ల వ్యయంతో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటవుతుంది. ప్రధాని ప్రముఖంగా దృష్టి సారించిన రంగాలలో క్రీడా సంస్కృతిని ప్రోదిచేయడం, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల ఏర్పాటు కూడా భాగంగా ఉన్నాయి. మీరట్‌లో మేజర్ ధ్యాన్‌చంద్ క్రీడా విశ్వవిద్యాలయం నిర్మాణం ప్రధాని దార్శనికతను సాకారం చేసే కృషిలో కీలకమైన ముందడుగు కానుంది.
ఈ క్రీడా విశ్వవిద్యాలయంలో సింథటిక్ హాకీ మైదానం, ఫుట్‌బాల్ మైదానం, బాస్కెట్‌బాల్/ వాలీబాల్/హ్యాండ్‌బాల్/కబడ్డీ మైదానాలు, లాన్ టెన్నిస్ కోర్టు, జిమ్నాసియం హాల్, సింథటిక్ రన్నింగ్ స్టేడియం, ఈతకొలను, బహుళ ప్రయోజన మందిరంతోపాటు సైక్లింగ్ వెలోడ్రోమ్ వంటి ఆధునిక వసతులు, అత్యాధునిక క్రీడా మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. అంతేకాకుండా షూటింగ్, స్క్వాష్, జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరీ, కెనోయింగ్-కయాకింగ్ తదితర సౌకర్యాలు కూడా క్రీడాకారులకు అందుబాటులో ఉంటాయి. ఈ విశ్వవిద్యాలయంలో పురుష/ మహిళా క్రీడాకారులు 540 మంది వంతున మొత్తం 1080 మంది ఏకకాలంలో శిక్షణ పొందే వీలుంటుంది.