పంథర్‌పూర్‌కు భక్తుల రాకపోకల సౌలభ్యం దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబరు 8న ‘శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్ఖీ మార్గ్ (ఎన్‌హెచ్-965) పరిధిలోని ఐదు విభాగాలు- ‘శ్రీ సంత్ తుకారాం మహారాజ్ పాల్ఖీ మార్గ్ (ఎన్‌హెచ్-965జి) పరిధిలోని మూడు విభాగాలకు సంబంధించి నాలుగు వరుసల రహదారికి శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు ఆ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ జాతీయ రహదారుల వెంబడి రెండువైపులా ‘పాల్ఖీ’ కోసం ప్రత్యేక నడక మార్గాలు కూడా ఏర్పాటు చేస్తారు. దీనివల్ల భక్తుల రాకపోకలకు సురక్షిత-అడ్డంకులు లేని అవాంతరాలు లేని సదుపాయం అందుబాటులోకి వస్తుంది.
దివేఘాట్ నుంచి మొహోల్ వరకు సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్ఖీ మార్గ్‌లో 221 కిలోమీటర్లు; పటాస్ నుంచి టాండలే-బొండలే వరకు సంత్ తుకారాం మహారాజ్ పాల్ఖీ మార్గ్‌లో దాదాపు 130 కిలోమీటర్లు మేర రహదారులు నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయబడతాయి. ఈ మార్గాలకు రెండువైపులా ప్రత్యేక నడకదారులు కూడా నిర్మించబడతాయి. ఈ రెండు మార్గాలలో మొదటిదానికి రూ.6690 కోట్లకుపైగా… రెండోదానికి రూ.4400 కోట్లమేర వ్యయం కాగలదని అంచనా.
ఈ కార్యక్రమంలో భాగంగా పంథర్‌పూర్‌కు అనుసంధానం మెరుగు కోసం వివిధ రహదారుల పరిధిలో రూ.1,180 కోట్ల వ్యయంతో ఉన్నతీకరించి, పనులు పూర్తిచేసిన 223కుపైగా కిలోమీటర్ల ప్రాజెక్టులను ప్రధాన మంత్రి జాతికి అంకితం చేస్తారు. వీటిలో… మాస్వాద్-పిలివ్- పంథర్‌పూర్ (ఎన్‌హెచ్-548ఇ); కుర్దువాడి-పంథర్‌పూర్ (ఎన్‌హెచ్-965సి); పంథర్‌పూర్- సంగోలా (ఎన్‌హెచ్-965సి); తెంభూర్ని-పంథర్‌పూర్ సెక్షన్ (ఎన్‌హెచ్-561ఎ); పంథర్‌పూర్- మంగళవేధ-ఉమాది సెక్షన్ (ఎన్‌హెచ్-561ఎ) మార్గాలున్నాయి. కాగా, ప్రధానమంత్రి చేతులమీదుగా వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా శంకుస్థాపన జరిగే కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా-రహదారుల శాఖ మంత్రితోపాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పాల్గొంటారు.