ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆగస్టు 10వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఉజ్వల 2.0 (ప్రధానమంత్రి ఉజ్వల యోజన - పిఎంయువై) పథకం ప్రారంభిస్తారు. వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమంలో జరిగే ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ లోని మహోబాలో ఎల్ పిజి కనెక్షన్లు అందిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడడంతో పాటు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.
ఉజ్వల 1.0 నుంచి ఉజ్వల 2.0కి ప్రయాణం
2016 సంవత్సరంలో ప్రారంభమైన ఉజ్వల 1.0 పథకం కింద 5 కోట్ల మంది బిపిఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా ఎల్ పిజి కనెక్షన్లు ఇవ్వడం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆ తర్వాత పథకాన్ని 2018 ఏప్రిల్ నుంచి మరో ఏడు వర్గాలకు చెందిన (ఎస్ సి/ ఎస్ టి, పిఎంఏవై, ఏఏవై, అత్యంత వెనుకబడిన వర్గాలు, తేయాకు తోటల కార్మికులు, అటవీ, ద్వీప ప్రాంత నివాసులు) మహిళలకు విస్తరించారు. ఎల్ పిజి కనెక్షన్ల జారీ లక్ష్యాన్ని కూడా 8 కోట్లకు పెంచారు. 2019 ఆగస్టు నాటికి అంటే నిర్దేశిత సమయం కన్నా 7 నెలల ముందే లక్ష్యాన్ని చేరారు.
2021-22 కేంద్ర బడ్జెట్ లో పిఎంయువై పథకం కింద మరో కోటి ఎల్ పిజి కనెక్షన్ల జారీకి అవసరమైన నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఉజ్వల 2.0 పథకం కింద ఈ అదనపు కోటి పిఎంయువై కనెక్షన్ల జారీ లక్ష్యంలో భాగంగా గతంలో అమలుపరిచిన పిఎంయువై తొలి దశలో చేర్చని అల్పాదాయ వర్గాల కుటుంబాలకు ఎలాంటి డిపాజిట్ లేకుండా ఎల్ పిజి కనెక్షన్లు ఇస్తారు.
ఈ ఉజ్వల 2.0 పథకం కింద డిపాజిట్ రహిత ఎల్ పిజి కనెక్షన్ల జారీతో పాటుగా తొలి రీఫిల్, హాట్ ప్లేట్ ఉచితంగా అందిస్తారు. అలాగే పేపర్ వర్క్ కూడా కనిష్ఠంగా ఉంటుంది. ఉజ్వల 2.0లో వలస కార్మికులు రేషన్ కార్డు గాని లేదా అడ్రస్ ప్రూఫ్ గాని సమర్పించాల్సిన అవసరం ఉండదు. కుటుంబ డిక్లరేషన్, అడ్రస్ ప్రూఫ్ రెండూ లిఖిత పూర్వకంగా స్వయం ప్రకటితంగా అందిస్తే చాలును. ప్రధానమంత్రి కల అయిన సార్వత్రిక ఎల్ పిజి అందుబాటు కలను ఉజ్వల 2.0 సాకారం చేస్తుంది.
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.