ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబరు 11న ‘ఇండియన్ స్పేస్ అసోసియేషన్’ (ఇస్పా-ఐఎస్‌పీఏ)ను వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రారంభిస్తారు. ఈ విశిష్ట సందర్భంగా అంతరిక్ష పరిశ్రమ ప్రతినిధులతో ఆయన సంభాషిస్తారు.
ఇండియన్ స్పేస్ అసోసియేషన్ (ఐఎస్‌పీఏ) గురించి
‘ఇస్పా’ అన్నది అంతరిక్ష-ఉపగ్రహ సంబంధిత అగ్రశ్రేణి పరిశ్రమల సంఘం. భారత అంతరిక్ష పరిశ్రమ రంగానికి సమష్టి గళంగా ఉండాలని ఇది ఆకాంక్షిస్తుంది. ప్రభుత్వం, అనుబంధ సంస్థలుసహా భారత అంతరిక్ష రంగంలోని భాగస్వాములందరితో విధానపరమైన సలహా సంప్రదింపులలో మమేకం కావడానికి ఇది కృషి చేస్తుంది. స్వయం సమృద్ధ భారతంపై ప్రధానమంత్రి స్వప్న సాకారాన్ని ప్రతిధ్వనింపజేస్తూ- అంతరిక్ష రంగంలో భారతదేశం స్వావలంబన సాధించడంతోపాటు ప్రపంచానికి మార్గదర్శకం కాగల రీతిలో సాంకేతికంగా ముందంజ వేయడానికి ‘ఇస్పా’ సహకరిస్తుంది.
అంతరిక్ష-ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాల్లో అత్యాధునిక సామర్థ్యాలుగల, దేశీయంగా ఎదిగిన ప్రముఖ సంస్థలతోపాటు అంతర్జాతీయ కార్పొరేషన్లు ‘ఇస్పా’కు ప్రాతినిధ్యం వహిస్తాయి. కాగా, “లార్సన్ అండ్ టూబ్రో, నెల్కో (టాటా గ్రూప్), వన్‌వెబ్, భారతీ ఎయిర్‌టెల్, మ్యాప్‌మైఇండియా, వాల్‌చంద్‌నగర్ ఇండస్ట్రీస్, అనంత్ టెక్నాలజీ లిమిటెడ్” సంస్థలు వ్యవస్థాపక సభ్యత్వం కలిగి ఉన్న ‘ఇస్పా’లో “గోద్రెజ్, హ్యూస్ ఇండియా, అజిస్టా-బీఎస్‌టీ ఎయిరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, బీఈఎల్, సెంటమ్ ఎలక్ట్రానిక్స్, మాక్సర్ ఇండియా”లకు కీలక సభ్యత్వం ఉంది.