కామన్‌వెల్త్ క్రీడల్లో (సీడబ్ల్యూజీ) పాల్గొనేందుకు వెళ్లే భారత క్రీడాకారుల బృందంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 జూలై 20న ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. క్రీడాకారులతోపాటు శిక్షకులు కూడా ఈ ఇష్టాగోష్ఠి సమావేశంలో పాలుపంచుకుంటారు.
ప్రధాన క్రీడా పోటీల్లో పాల్గొనడానికి వెళ్లబోయే క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చే కృషిలో భాగంగా ప్రధానమంత్రి ఇలాంటి ఇష్టాగోష్ఠి సమావేశం నిర్వహించడాన్ని ఆనవాయితీగా మార్చుకున్నారు. నిరుడు టోక్యో-2020 ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందంతోపాటు టోక్యో పారాలింపిక్స్-2020లో పాలుపంచుకున్న క్రీడాకారులతోనూ ఆయన ఇదేవిధంగా ముచ్చటించారు.
ఆయా క్రీడా పోటీలు కొనసాగుతున్న సమయంలోనూ క్రీడాకారుల ముందంజపై ప్రధానమంత్రి ఎంతో ఆసక్తి చూపుతూంటారు. అంతేకాకుండా విజయం సాధించిన అనేక సందర్భాల్లో ఆయా క్రీడాకారులకు స్వయంగా ఫోన్‌చేసి అభినందిస్తారు. అలాగే వారి క్రీడా నిబద్ధతను ప్రశంసించడమే కాకుండా మరింత మెరుగ్గా రాణించేలా ప్రోత్సహిస్తుంటారు. దీంతోపాటు క్రీడాకారుల బృందం స్వదేశం చేరిన తర్వాత వారితో నేరుగా సమావేశమై ఇష్టాగోష్ఠిగా మాట్లాడటమూ ప్రధానమంత్రికి పరిపాటి.
కామన్వెల్త్ గేమ్స్-2022 బర్మింగ్ హామ్‌లో 2022 జూలై 28 నుంచి ఆగస్టు 8వ తేదీదాకా జరుగుతాయి. ఈ క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 215 మంది క్రీడాకారులు 19 రకాల క్రీడలకు సంబంధించిన 141 పోటీల్లో తమ ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు.