జామ్ నగర్ లో ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టీచింగ్ ఎండ్ రిసర్చ్ ఇన్ ఆయుర్వేద (ఐటిఆర్ఎ) ను, అలాగే జయ్ పుర్ లో నేశనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎన్ఐఎ) ను ఈ నెల 13 న 5 వ ఆయుర్వేద దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. 21వ శతాబ్దం లో ఆయుర్వేదం అభివృద్ధి లో ఈ సంస్థ లు ప్రపంచానికి నాయకత్వ భూమికలను పోషిస్తాయని ఆశిస్తున్నారు.
పూర్వరంగం:
ధన్వంతరి జయంతి ని ఏటా ఆయుర్వేద దినంగా జరుపుకోవడాన్ని 2016 వ సంవత్సరం నుంచి మొదలుపెట్టారు. ఈ ఏడాది లో ఇది ఈ నెల 13 వ తేదీ నాడు రానుంది. ఆయుర్వేద దినాన్ని సంబురాలలో ఒకటిగానో, లేదా ఉత్సవాలలో ఒకటిగానో జరుపుకొనే కంటే ఈ వృత్తి కి, అలాగే సమాజానికి పునరంకితం అయ్యేటటువంటి ఒక సందర్భం గా పరిగణిస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారి ని కట్టడి చేయడం లో ఆయుర్వేదం పోషించగలిగిన పాత్ర అనేది ఈ సంవత్సరం ‘ఆయుర్వేద దినం’ జరుపుకోవడంలో ముఖ్యాంశంగా ఉండబోతోంది.
ఆరోగ్య సంరక్షణ కు సంబంధించినంత వరకు ఆయుష్ వ్యవస్థల కు గల అపారమైనటువంటి, ఇంకా ఉపయోగం లోకి రానటువంటి సామర్థ్యాన్ని భారతదేశంలో సార్వజనిక స్వస్థ్యపరమైన సవాళ్ళ కు తక్కువ ఖర్చు లో దీటైన పరిష్కార మార్గాలను అందించడంలో వినియోగించుకోవాలనేది ప్రభుత్వ ప్రాధాన్యం గా ఉంది. కాబట్టి, ఆయుష్ విద్య ను ఆధునీకరించాలనేది కూడా ఒక ప్రాధాన్య రంగం గా మారిపోయింది. దీనికి గాను గత మూడు నాలుగేళ్ళ లో అనేక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. జామ్ నగర్ లో ఐటిఆర్ఎ ను జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థ గా దేశ ప్రజలకు అంకితం చేయడం, జయ్ పుర్ లో ఎన్ఐఎ ను డీమ్ డ్ టు బి యూనివర్సిటీ గా తీర్చిదిద్దడం అనేవి ఆయుర్వేద విద్య ను ఆధునీకరించడం లో ఒక చరిత్రాత్మక నిర్ణయమే కాక సాంప్రదాయక వైద్యం పరిణామ క్రమంలో ఒక భాగం కూడాను. ఇది ఆయుర్వేద విద్య ప్రమాణాన్ని ఉన్నతీకరించేందుకు ఆయా సంస్థల కు స్వతంత్ర ప్రతిపత్తి ని సమకూర్చడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ డిమాండు కు అనుగుణంగా వేరు వేరు పాఠ్య క్రమాలకు రూపకల్పన చేయడం, మరిన్ని రుజువులను సేకరించేందుకుగాను ఆధునిక పరిశోధనల లో రాణించేందుకు కూడా అవకాశాలను కల్పించనుంది.