ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా ఇండియా ఎక్స్ పో మార్ట్‌లో ‘సెమికాన్ ఇండియా 2024’ను సెప్టెంబర్ 11న ఉదయం10:30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సభనుద్దేశించి ప్రసంగించనున్నారు.
సెమీకండక్టర్ డిజైన్, తయారీ, టెక్నాలజీ అభివృద్ధికి భారత్‌ను ప్రపంచ హబ్‌గా నిలపాలన్నది ప్రధాన మంత్రి దార్శనికత. దీనికి అనుగుణంగా సెమీకాన్ ఇండియా 2024ను సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు 'సెమీకండక్టర్ రంగ భవిష్యత్‌ను తీర్చిదిద్దడం' అనే ఇతివృత్తంతో నిర్వహించనున్నారు. .
మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భారత్ సెమీకండక్టర్ వ్యూహాన్ని, విధానాన్ని ప్రదర్శించనున్నారు. ఇందులో ప్రపంచ సెమీకండక్టర్ దిగ్గజాల అగ్రనాయకులు పాల్గొంటారు. సెమీకండక్టర్ పరిశ్రమకు చెందిన ప్రపంచ స్థాయి అగ్ర కంపెనీలు, నిపుణులు, నాయకత్వ స్థాయిలో ఉన్న వ్యక్తులను ఈ సదస్సు ఏకతాటిపైకి తీసుకురానుంది. ఈ సదస్సులో 250 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 150 మంది వక్తలు పాల్గొననున్నారు.