ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూలై 4వ తేదీ ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ వేడుకకు ప్రపంచ ప్రసిద్ధులతోపాటు పలువురు భక్తులు హాజరవుతారు.
పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా ప్రధాన ఆశ్రమమైన ప్రశాంతి నిలయంలో సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ అనే కొత్త భవనాన్ని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్మించింది. ఈ భవన నిర్మాణానికి వితరణశీలి శ్రీ ర్యూకో హిరా భూరి విరాళం అందజేశారు. సాంస్కృతిక ఆదానప్రదానం, ఆధ్యాత్మికత, ప్రపంచ సామరస్యాన్ని ప్రోత్సహించే దృక్పథం తదితరాలకు ఈ కేంద్రం ప్రతీకగా నిలుస్తుంది. విభిన్న నేపథ్యాలున్న ప్రపంచ ప్రజానీకం ఒకేచోట చేరడంతోపాటు అనుబంధం పెంచుకోవడానికి, శ్రీ సత్యసాయి బాబా బోధనల సారాన్ని అన్వేషించడానికి తగిన వాతావరణం ఈ కేంద్రంలో ఉంటుంది. వివిధ రకాల సమావేశాలు, చర్చాగోష్ఠులు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఇక్కడి ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు ఎంతో సౌలభ్యం కల్పిస్తాయి. అన్ని వర్గాలు, వ్యక్తుల మధ్య పరస్పర సంభాషణ, అవగాహన పెంపులోనూ ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విశాల ప్రాంగణంలో ధ్యాన మందిరాలు, ఆహ్లాదకర ఉద్యానాలు, బస సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి.