ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని హజీరా లో రో-పాక్స్ టర్మినల్ ను ఈ నెల 8న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించడం తో పాటు హజీరా, గుజరాత్ లోని ఘోఘా ల మధ్య రో-పాక్స్ సర్వీసు కు ప్రారంభ సూచకంగా పచ్చజెండా ను కూడా చూపనున్నారు. జలమార్గాలను వినియోగం లోకి తెచ్చుకోవాలని, వాటిని దేశాభివృద్ధితో జతపరచాలన్న ప్రధాన మంత్రి దార్శనికత ను ఆచరణ రూపంలోకి తీసుకు రావడంలో ఇది ఒక ప్రధానమైన అడుగు కానుంది. ఈ కార్యక్రమం లో భాగం గా ఫెరీ సర్వీసును వినియోగించుకొనే స్థానికులతో ప్రధాన మంత్రి మాట్లాడనున్నారు. శిప్పింగ్ శాఖ సహాయ మంత్రి తో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమం లో పాల్గొంటారు.
హజీరా లో ప్రారంభిస్తున్న రో-పాక్స్ టర్మినల్ 100 మీటర్ల పొడవుతో, 40 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. దీని నిర్మాణానికి సుమారుగా 25 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. పరిపాలన కార్యలయ భవనం, వాహనాలను నిలిపి ఉంచేందుకు స్థలం, సబ్ స్టేశన్, వాటర్ టవర్ మొదలైన విస్తృత శ్రేణి సౌకర్యాలు ఈ టర్మినల్ లో ఉంటాయి.
రో-పాక్స్ ఫెరీ ఓడ ‘వాయిజ్ సింఫని’ లో 2500 డిడబ్ల్యుటి-2700 ఎమ్‌టి సామర్ధ్యం కలిగిన,12000 నుంచి 15000 జిటి డిస్‌ప్లేస్‌మెంట్ సదుపాయాలతో కూడిన మూడు డెక్ లు ఉంటాయి. ఈ ఓడ లో ప్రధాన డెక్ కు 30 ట్రక్ ల (ఒక్కొక్కటీ 50 మెట్రిక్ టన్నుల) లోడ్ సామర్ధ్యం, ఓడ పై భాగం లో 100 ప్రయాణికుల కార్లను ఉంచేందుకు ఏర్పాటు, అలాగే ప్యాసింజర్ డెక్ లో ఓడను నడిపే సిబ్బంది తో పాటు ఆతిథ్యం సిబ్బంది 34 మందితో సహా 500 మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి.
హజీరా-ఘోఘా రో-పాక్స్ ఫెరీ సర్వీసు లో అనేక ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇది దక్షిణ గుజరాత్ కు మరియు సౌరాష్ట్ర ప్రాంతానికి ఒక ముఖద్వారంగా పని చేస్తుంది. ఇది ఘోఘా కు, హజీరా కు నడుమ దూరాన్ని 370 కిలో మీటర్ల నుంచి 90 కిలో మీటర్లకు తగ్గిస్తుంది. సరకు రవాణా కు పట్టే కాలం 10, 12 గంటల నుంచి దాదాపుగా 4 గంటలకు తగ్గిపోనున్నందున ఇంధనం పరంగా చూసినప్పుడు భారీ ఆదా (రోజుకు ఇంచుమించు 9000 లీటర్లు) సాధ్యపడుతుంది. వాహనాల నిర్వహణ ఖర్చు గణనీయంగా తగ్గిపోతుంది. ఈ ఫెరీ సర్వీసు హజీరా, ఘోఘా మార్గంలో ప్రతి రోజూ మూడు విడతల ట్రిప్పులు తిరుగుతూ ఒక ఏడాదిలో దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులను, 80,000 ప్రయాణికుల వాహనాలను, 50,000 ద్విచక్ర వాహనాలను, 30,000 ట్రక్కులను చేరవేయగలుగుతుంది. ఇది ట్రక్కు డ్రైవర్లకు అదనపు ట్రిప్పులను నడుపుకొనేందుకు అవకాశాన్ని కల్పించి, వారికి శారీరిక అలసటను తగ్గించడమే కాకుండా వారు వారి ఆదాయాలను వృద్ధి చేసుకొనేందుకు కూడా తోడ్పడనుంది. ఇది ప్రతి రోజూ దాదాపుగా 24 మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడానికి, ఈ లెక్కన ఒక సంవత్సర కాలంలో రమారమి 8653 ఎమ్‌టి మేరకు నికరంగా ఆదా చేసేందుకు దోహదపడనుంది. ఇది సౌరాష్ట్ర ప్రాంతానికి సులభ సమీప మార్గాన్ని ఏర్పరుస్తూ, పర్యటన పరిశ్రమ కు నూతనోత్తేజాన్ని ఇచ్చి, కొత్త ఉద్యోగావకాశాల కల్పనకు సైతం బాటను పరచనుంది. ఫెరీ సేవలు అందుబాటు లోకి రావడం నౌకాశ్రయ రంగం, ఫర్నిచర్ పరిశ్రమ, ఎరువుల పరిశ్రమ భారీగా లాభపడటానికి అవకాశాన్ని కల్పించగలదు. గుజరాత్ లో మరీముఖ్యంగా పోర్ బందర్, సోమనాథ్, ద్వారక, పాలీతానా లో మత సంబంధి పర్యటనలు, పర్యావరణానుకూల పర్యటనలు గొప్పగా వృద్ధి చెందేందుకు అవకాశాలు ఏర్పడుతాయి. ఈ ఫెరీ సేవల మూలంగా సంధాన ప్రక్రియ హెచ్చి, తత్సంబంధిత ప్రయోజనాలు ఒనగూరడమే కాక గీర్ లోని ప్రఖ్యాత ఏశియాటిక్ సింహాలు తదితర వన్యమృగాల అభయారణ్యాన్ని సందర్శించేందుకు యాత్రికుల రాకపోకలు కూడా పెరుగుతాయి.