ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, కటక్‌లో ఆదాయపన్ను అప్పిలేట్ ట్రిబ్యూనల్ ఆఫీసు, రెసిడెన్షియల్ కాంప్లెక్సు అత్యాధునిక భవన సముదాయానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 11 వ తేదీ సాయంత్రం 4.30గంటలకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభోత్సవం చేయనున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి, ఒడిషా ముఖ్యమంత్రి, ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, పలువురు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఐటిఎటిపై ఈ కాఫీ టేబుల్‌బుక్‌ను విడుదల చేస్తారు.
ఆదాయపన్ను అప్పిలేట్ ట్రిబ్యూనల్ ను ఐటిఎటి అని కూడా అంటారు. ప్రత్యక్షపన్నుల రంగంలో ఇది ఒక కీలక చట్టబద్ధ సంస్థ . వాస్తవాల ఆధారంగా ఈ సంస్థ ఆదేశాలను తుది ఆదేశాలుగా అంగీకరిస్తారు. ప్రస్తుతం దీనికి జార్ఖండ్ హైకోర్టు, గుజరాత్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) పి.పి.భట్ నాయకత్వం వహిస్తున్నారు. ఐటిఎటి ట్రిబ్యూనల్ 1941 జనవరి 25న ఏర్పడిన తొలి ట్రిబ్యూనల్.ఇది అన్నిట్రిబ్యూనళ్లకు తల్లి వంటిది. 1941లో మూడు బెంచ్‌లు ఢిల్లీ, బొంబాయి,కలకత్తాలతో ప్రారంభమై ప్రస్తుతం ఇది 63 బెంచ్‌లకు , 30నగరాలకు విస్తరించిన రెండు సర్క్యూట్ బెంచ్‌లకు ఇది ఎదిగింది.
కటక్ బెంచ్ ఐటిఎటి 1970 మే 23 నుంచి పనిచేయడం ప్రారంభించింది. ఈ కటక్ బెంచ్ పరిధి ఒడిషా మొత్తానికి వర్తిస్తుంది. 50 సంవత్సరాలపాటు ఇది అద్దె భవనంలో పనిచేస్తూ వచ్చింది. ఇప్పడు నూతనంగా నిర్మించిన ఐటిఎటి కటక్ ఆఫీసు, రెసిడెన్షియల్ భవనాలను 1.60 ఎకరాల ప్రాంగణంలో నిర్మించారు.దీనిని ఒడిషా రాష్ట్రప్రభుత్వం 2015లో ఉచితంగా ఈభూమిని కేటాయించింది. ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణ విస్తీర్ణం 1938 చదరపు మీటర్లు.మూడు ఫ్లోర్లు. విశాలమైనకోర్టురూము, అత్యధునాతన రికార్డు రూము, బెంచ్ మెంబర్లకు సకల సదుపాయాలతో ఛాంబర్లు, లైబ్రరీరూము, అధునాతన సమావేశ మందిరం, కక్షిదారులకు తగినంత ప్రదేశం, న్యాయవాదులు, చార్టెడ్ అకౌంటెంట్లకు గది వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి.