ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 జూన్ 6న ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖల విశిష్టత వారోత్సవాలను న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఉదయం 10:30 గంటలకు ప్రారంభిస్తారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (ఆకం)లో 2022 జూన్ 11దాకా వారంపాటు ఈ వేడుకలు సాగుతాయి.
ఈ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా రుణ సంధానిత ప్రభుత్వ పథకాల జాతీయ పోర్టల్ ‘జన సమర్థ్’కు ప్రధాని శ్రీకారం చుడతారు. ఇది ప్రభుత్వ రుణసంధాన పథకాలకు సంబంధించి ఏక గవాక్షంగా ఉంటుంది. ఈ మేరకు రుణదాతలతో లబ్ధిదారులను నేరుగా అనుసంధానించే మొట్టమొదటి వేదికగా ఇది ఏర్పాటవుతోంది. సరళ-సులభ డిజిటల్ ప్రక్రియల ద్వారా వివిధ రంగాలకు సముచిత ప్రభుత్వ ప్రయోజనాలను అందించడం ‘జన సమర్థ్’ పోర్టల్ ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా ఆ దిశగా మార్గనిర్దేశం చేయడం ద్వారా వాటి సమగ్ర వృద్ధి, ప్రగతికి తోడ్పాటునిస్తుంది. తదనుగుణంగా అనుసంధానిత పథకాలన్నిటి సమగ్ర సదుపాయాలనూ ఈ పోర్టల్ అందుబాటులో ఉంచుతుంది.
గడచిన ఎనిమిదేళ్లలో ఈ రెండు మంత్రిత్వ శాఖల ప్రగతి పయనాన్ని వివరించే డిజిటల్ ప్రదర్శనను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. అదే సమయంలో ₹1, ₹2, ₹5, ₹10, ₹20 విలువగల నాణాల ప్రత్యేక సిరీస్‌ను కూడా ప్రధానమంత్రి విడుదల చేస్తారు. ఈ ప్రత్యేక శ్రేణి నాణాలు ‘ఆకం’లోగో ఇతివృత్తంతో ఉంటాయి. దృష్టి లోపంగల వ్యక్తులు కూడా సులభంగా గుర్తించే విధంగా ఇవి తయారవుతాయి.
ఈ కార్యక్రమం దేశంలోని 75 ప్రదేశాల్లో ఏకకాలంలో నిర్వహించబడుతుంది. అలాగే ఆయా ప్రదేశాలన్నీ ప్రధాన వేదికతో వర్చువల్ మార్గంలో సంధానించబడి ఉంటాయి.