ఐసీఏ అంతర్జాతీయ సహకార సదస్సు-2024తోపాటు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025ను న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రారంభించనున్నారు.
ఐసీఏ అంతర్జాతీయ సహకార సదస్సు, ఐసీఏ సాధారణ సమావేశాలను అంతర్జాతీయ సహకార కూటమి (ఐసీఏ) 130 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో తొలిసారి భారత్ లో నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ సహకార ఉద్యమంలో అది ప్రధాన సంస్థ. ఐసీఏ, కేంద్ర ప్రభుత్వం, భారతీయ సహకార సంస్థలైన అమూల్, క్రిభ్ కో సహకారంతో రైతులు, ఎరువుల సహకార సంస్థ (ఐఎఫ్ఎఫ్ సీవో) నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సు నవంబరు 25 నుంచి 30 వరకు జరుగుతుంది.
‘సహకార సంఘాలు అందరి శ్రేయస్సునిస్తాయి’ అన్నది సదస్సు ఇతివృత్తం. ‘సహకార్ సే సమృద్ధి’ అన్న భారత ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా దీనిని రూపొందించారు. చర్చలు, నిపుణుల సదస్సులు, కార్యశాలలు, ఐక్యారాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ప్రపంచవ్యాప్తంగా సహకార సంఘాలు ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారం, అవకాశాల వివరాలు మొదలైనవి ఈ కార్యక్రమంలో ఉంటాయి. ముఖ్యంగా పేదరిక నిర్మూలన, లింగ సమానత్వం, సుస్థిర ఆర్థిక వృద్ధి వంటి అంశాలను చర్చిస్తారు.
ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహకార సంఘాల సంవత్సరం 2025ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ‘సహకార సంఘాలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయి’ అన్న ఇతివృత్తంపై ఇది ప్రధానంగా దృష్టిపెడుతుంది. సామాజిక సమ్మిళితత్వం, ఆర్థిక సాధికారత, సుస్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో సహకార సంఘాల పరివర్తనాత్మక పాత్రకు ఇవి ప్రాధాన్యం ఇస్తాయి. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సహకార సంస్థలను సుస్థిరాభివృద్ధికి కీలకంగా పరిగణిస్తాయి. ముఖ్యంగా అసమానతలను తగ్గించడంలో, గౌరవంతో కూడిన పనిని ప్రోత్సహించడంలో, పేదరిక నిర్మూలనలో ఇవి కీలకంగా వ్యవహరిస్తాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లను పరిష్కరించడంలో సహకార సంస్థల శక్తిని చాటే లక్ష్యంతో అంతర్జాతీయ కార్యక్రమంగా 2025 సంవత్సరం నిలవనుంది.
సహకార ఉద్యమంపై భారతదేశ నిబద్ధతకు ప్రతీకగా ఒక స్మారక పోస్టల్ స్టాంప్‌ను కూడా ప్రధాని ఆవిష్కరిస్తారు. స్టాంపులో ఉండే కమలం శాంతి, శక్తి, పునరుజ్జీవనం, వృద్ధికి సంకేతంగా.. సహకార విలువలైన సుస్థిరత, సామాజిక అభివృద్ధిని ప్రతిబింబిస్తుంది. కమలంలోని ఐదు రేకులు ప్రకృతిలోని ఐదు అంశాలను సూచిస్తాయి (పంచతత్వం). పర్యావరణ, సామాజిక, ఆర్థిక సుస్థిరతకు అవి ప్రతీకలు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత పాత్రను సూచించేలా డ్రోన్‌తో వ్యవసాయం, పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమ, వినియోగదారుల సహకార సంఘాలు, గృహనిర్మాణం వంటి రంగాలను కూడా ఈ నమూనాలో పొందుపరిచారు.
భూటాన్ ప్రధానమంత్రి శ్రీ దాషో షెరింగ్ టొబ్గే, ఫిజి ఉప ప్రధానమంత్రి శ్రీ మనోవా కామికమికా, 100కు పైగా దేశాల నుంచి 3,000కు పైగా ప్రతినిధులు కూడా పాల్గొంటారు.