దేశంలో నిర్వహిస్తున్న భారీ ప్రపంచ స్థాయి కార్యక్రమాల్లో ఒకటైన భారత్ టెక్స్ 2024ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 26వ తేదీ ఉదయం 10.30కి ప్రారంభించనున్నారు.
2024 ఫిబ్రవరి 26-29 తేదీల మధ్యన భారత్ టెక్స్ 2024 నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి 5ఎఫ్ విజన్-యునిఫైడ్ ఫారం, ఫైబర్, ఫ్యాబ్రిక్, ఫ్యాషన్ ఫోకస్, ఫారిన్ స్ఫూర్తిగా తీసుకుని మొత్తం టెక్స్ టైల్ రంగానికి చెందిన విలువ ఆధారిత వ్యవస్థపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది. టెక్స్ టైల్ రంగంలో భారతదేశం శక్తిని ఇది ప్రదర్శించడంతో పాటు ప్రపంచ టెక్స్ టైల్ రంగంలో తిరుగులేని శక్తిగా భారతదేశ స్థానాన్ని మరింత పటిష్ఠం చేస్తుంది.
11 టెక్స్ టైల్ ఎగుమతి ప్రోత్సాహక మండలుల కన్సార్షియం నిర్వహణలో ప్రభుత్వ మద్దతుతో నిర్వహిస్తున్న భారత్ టెక్స్ 2024ను సుస్థిరతకు ప్రాధాన్యం ఇస్తూ వాణిజ్యం, పెట్టుబడులు అనే రెండు స్తంభాలపై నిర్మించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం లో భాగంగా 65 మేథోమధన సెషన్లుంటాయి. టెక్స్ టైల్ రంగానికి చెందిన వివిధ అంశాలపై 100 మంది పానెలిస్టులు ఈ సెషన్లలో చర్చిస్తారు. సుస్థిరత, సర్కులర్ వ్యవస్థపై పెవిలియన్లతో పాటు భారత టెక్స్ టైల్ రంగానికి చెందిన విభిన్న ఫ్యాషన్ థీమ్ లతో ‘‘ఇండి హాట్’’ ప్రదర్శన నిర్వహిస్తారు. అలాగే సుస్థిరత, ప్రపంచ డిజైన్లు, ఇంటరాక్టివ్ ఫ్యాబ్రిక్ టెస్టింగ్ జోన్లు, ప్రాడక్ట్ డిమానిస్ర్టేషన్లు ఉంటాయి.
100కి పైగా దేశాలకు చెందిన విధాన నిర్ణేతలు, ప్రపంచ సిఇఓలు; 3500 మంది పైగా ఎగ్జిబిటర్లు; 3,000 మంది కొనుగోలుదారులు; 40,000 మందికి పైగా వ్యాపార సందర్శకులు, టెక్స్ టైల్ రంగానికి చెందిన విద్యార్థులు, చేనేతకారులు, హస్తకళాకారులు, టెక్స్ టైల్ కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం సందర్భంగా 50కి పైగా ప్రకటనలు, ఎంఓయులపై సంతకాలు జరుగుతాయని అంచనా. టెక్స్ టైల్ రంగంలో పెట్టుబడులు, వాణిజ్యానికి ఇది మరింత ఉత్తేజం కల్పిస్తుందని, ఎగుమతుల పెంపునకు సహాయకారి అవుతుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ బారత్, వికసిత్ భారత్ విజన్ దిశగా ఇది మరో ముందడుగవుతుంది.