ఢిల్లీలోని భారత్ మండపంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అష్టలక్ష్మీ మహోత్సవాన్ని ప్రారంభించనున్నారు. ఈశాన్య భారత సాంస్కృతిక చైతన్యాన్ని చాటడంపై ఆయన నిబద్ధతకు ఇది నిదర్శనం.
మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ సాంస్కృతిక ఉత్సవం డిసెంబరు 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. సాంప్రదాయక కళలు, హస్తకళలు, సంస్కృతులను ఒక్కచోట చేర్చే ఈ ఉత్సవం ఈశాన్య భారత సాంస్కృతిక యవనికగా నిలుస్తుంది.
సాంప్రదాయక హస్తకళలు, చేనేత వస్త్రాలు, వ్యవసాయోత్పత్తులు, పర్యాటక రంగం వంటి అంశాల్లో ఆర్థిక అవకాశాలను ప్రోత్సహించడం కోసం ఈ మహోత్సవంలో వివిధ కార్యక్రమాలుంటాయి. కళాకారుల ప్రదర్శనలు, గ్రామీణ మార్కెట్లు, రాష్ట్రాలకు ప్రత్యేకంగా శిబిరాలు, ఈశాన్య ప్రాంత అభివృద్ధికి కీలకమైన రంగాలపై సాంకేతిక సదస్సులు ఈ ఉత్సవంలో ఉంటాయి. పరిచయాలు, భాగస్వామ్యాలను ఏర్పరచుకుని, బలోపేతం చేసుకోవడానికి విశేషంగా దోహదపడేలా రూపొందించిన పెట్టుబడిదారుల సమావేశం, విక్రేత-కొనుగోలుదారుల సమావేశాలు, ఆ ప్రాంత ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే సంయుక్త కార్యక్రమాలు కీలకమైనవి.
ఈశాన్య భారత చేనేత, హస్తకళా సంప్రదాయాల ఘనతను జాతీయ వేదికపై చాటేలా సమాలోచనలు, ఫ్యాషన్ షోలు ఈ మహోత్సవంలో ఉంటాయి. ఉత్తేజకరమైన సంగీత ప్రదర్శనలతోపాటు ఈశాన్య భారతంలోని ప్రత్యేకమైన వంటకాలను ప్రదర్శిస్తూ.. ఈశాన్య భారత సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని ఈ ఉత్సవం చాటుతుంది.