వరల్డ్ హెరిటేజ్ కమిటీ నలభై ఆరో సమావేశాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జులై 21న సాయంత్రం పూట 7 గంటలకు న్యూ ఢిల్లీ లోని భారత్ మండపంలో ప్రారంభించనున్నారు. ఈ సందర్బంగా సభికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు. ఈ సమావేశాల ప్రారంభ కార్యక్రమానికి యునెస్కో డిజి ఆడ్రే అజోలే కూడా హాజరు కానున్నారు.
ప్రపంచ వారసత్వ సంఘం (వరల్డ్ హెరిటేజ్ కమిటీ) సమావేశాలకు భారతదేశం మొట్టమొదటిసారిగా ఆతిథ్యాన్ని ఇస్తున్నది. ఈ సమావేశాలు 2024 జులై 21 నుంచి 31 వరకు న్యూ ఢిల్లీ లోని భారత్ మండపంలో జరుగనున్నాయి. ప్రపంచ వారసత్వ సంఘం ఏడాదికి ఒక సారి సమావేశమవుతూ ఉంటుంది. ప్రపంచ వారసత్వానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను నిర్వహించడం తో పాటు ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చవలసిన స్థలాలను గురించిన నిర్ణయాలను తీసుకోవడం ఈ కమిటీకి అప్పగించిన బాధ్యతలు. ఈ సమావేశాలలో, ప్రపంచ వారసత్వ జాబితాలో కొత్త స్థలాలను నామనిర్దేశం చేయడం కోసం ప్రతిపాదనలు, ఇప్పటికే ప్రపంచ వారసత్వ ఆస్తులుగా ఉన్న 124 స్థలాల సంరక్షణ స్థితి నివేదికను గురించి, అంతర్జాతీయ సహాయాన్ని గురించి, ప్రపంచ వారసత్వ నిధుల వినియోగాన్ని గురించి, ఇతరత్రా అంశాలను గురించి చర్చించడం జరుగుతుంది. ఈ సమావేశాల్లో నూటయాభైకి పైగా దేశాల కు చెందిన అంతర్జాతీయ, జాతీయ ప్రతినిధులు రెండు వేల మందికి పైగా పాల్గొంటారు.
ప్రపంచ వారసత్వ సంఘంతో పాటే వరల్డ్ హెరిటేజ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఫోరమ్, వరల్డ్ హెరిటేజ్ సైట్ మేనేజర్స్ ఫోరమ్ సమావేశాలను కూడా నిర్వహించనున్నారు.
భారతదేశ సంస్కృతిని చాటి చెప్పే వివిధ ఎగ్జిబిషన్ లను కూడా భారత్ మండపంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. విదేశాల నుంచి భారతదేశానికి తీసుకు వచ్చిన అపురూప కళాకృతులలో కొన్నింటిని ‘ది రిటర్న్ ఆఫ్ ట్రెజర్స్ ఎగ్జిబిషన్’ లో ప్రదర్శనకు పెడతారు. ఇంతవరకు, మూడు వందల యాభైకి పైగా కళాకృతులను బయటి దేశాల నుంచి భారతదేశానికి తిరిగి తీసుకురావడమైంది. వీటికి తోడు, అత్యాధునిక ఎఆర్, విఆర్ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో భారతదేశంలోని మూడు ప్రపంచ వారసత్వ స్థలాలు.. గుజరాత్ లోని పాటన్ లో గల రాణీ కీ వావ్; మహారాష్ట్ర లోని ఎల్లోరా గుహలలో నెలకొన్న కైలాస దేవాలయం, కర్నాటక లోని హళేబీడులో గల హొయసల దేవాలయం లను కళ్లకు కట్టే ఎగ్జిబిషన్ కూడా సందర్శకులను అలరించనుంది. భారతదేశ సమృద్ధ సాంస్కృతిక వారసత్వాన్ని, యుగ యుగాల పురాతన చరిత్రను కలిగివున్న భారతదేశ నాగరికతను, భారతదేశ భౌగోళిక వైవిధ్యాన్ని, పర్యటకులకు ప్రధాన ఆకర్షణ గా నిలచే ప్రదేశాలతో పాటు సమాచార సాంకేతిక విజ్ఞానం (ఐ.టి.) మరియు మౌలిక సదుపాయాల కల్పన రంగాల విశేషాలను గురించి తెలియజెప్పే అతుల్య భారత్ (‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’) విశిష్ట ఎగ్జిబిషన్ ను కూడా ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్నారు.