దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా 2022 జనవరి 17న భారత కాలమానం ప్రకారం ఉదయం 8:30 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ప్రపంచ స్థితిగతులు’ అంశంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక ప్రసంగం చేస్తారు.
వాస్తవిక సాదృశ మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్న ఈ సదస్సు 2022 జనవరి 17న ప్రారంభమై 21న ముగుస్తుంది. పలువురు దేశాధినేతలు పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో- జపాన్ ప్రధానమంత్రి కిషిదా ఫుమియో; ఐరోపా సమాఖ్య అధ్యక్షుడు ఉర్సువా వాన్ డెర్ లేయెన్; ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్; ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో; ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలి బెన్నెట్; పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తదితరులు కూడా ప్రసంగిస్తారు. వారితోపాటు అగ్రశ్రేణి పారిశ్రామిక రంగ ప్రముఖులుసహా అంతర్జాతీయ సంస్థల, పౌర సమాజ ప్రతినిధులు కూడా పాలుపంచుకుంటారు. ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న సంక్లిష్ట సవాళ్లు-వాటికి పరిష్కారాలపై వారంతా లోతుగా చర్చిస్తారు.