ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 5 న వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ (విజిఐఆర్) సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశాన్ని ఆర్థిక శాఖ, నేశనల్ ఇన్ వెస్ట్‌మెంట్ ఎండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ కార్యక్రమం లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ సంస్థాగత పెట్టుబడిదారు సంస్థలు, భారతదేశం లోని వ్యాపార రంగ ప్రముఖులు, భారత ప్రభుత్వంలో అత్యున్నత విధాన నిర్ణేతలతో పాటు ఆర్థిక విపణి సంబంధి
నియంత్రణ సంస్థలు పాలుపంచుకోనున్నాయి. దీనిలో కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి, ఆర్‌బిఐ గవర్నరు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు.
దాదాపుగా 6 ట్రిలియన్ యుఎస్ డాలర్ల విలువైన ఆస్తుల ను నిర్వహిస్తున్న ప్రపంచంలోని అతి పెద్ద పెన్షన్ ఫండ్ లు, సావరిన్ వెల్త్ ఫండ్ లు ఈ రౌండ్ టేబుల్ లో పాలుపంచుకొంటాయి. యుఎస్, యూరోప్, కెనడా, కొరియా, జపాన్, మధ్య ప్రాచ్యం, ఆస్ట్రేలియా, సింగపూర్ సహా కీలక ప్రాంతాలకు ఈ ప్రపంచ స్థాయి సంస్థాగత పెట్టుబడిదారు సంస్థలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ ఫండ్ లకు చెందిన కీలక నిర్ణయాలు తీసుకొనే అధికారులు అంటే సిఇఒ లు, సిఐఒ లు ఈ కార్యక్రమం లో పాల్గొంటారు. ఈ పెట్టుబడిదారు సంస్థల లో కొన్ని భారత ప్రభుత్వం తో మొట్టమొదటిసారిగా సంభాషణలు జరపనున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్ లకు తోడు అనేక మంది అగ్రగామి భారతీయ వ్యాపార ప్రముఖులు కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం లో భాగం పంచుకోబోతున్నారు.
భారతదేశ ఆర్థిక దృక్పథం, పెట్టుబడి దృష్టి కోణం, నిర్మాణాత్మక సంస్కరణలు, అలాగే 5 ట్రిలియన్ యుఎస్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ బాట న సాగాలన్న ప్రభుత్వ దార్శనికత.. ఈ అంశాలపై విజిఐఆర్ 2020 తన చర్చల ను కేంద్రీకరించనుంది. ఈ కార్యక్రమం భారతదేశంలో అంతర్జాతీయ పెట్టుబడుల వృద్ధి ని మరింత వేగవంతం ఎలా చేయవచ్చనే అంశం పై ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్ లు, భారతదేశ వ్యాపార రంగ ప్రముఖులు, సీనియర్ విధాన నిర్ణేతల తో సమాలోచనలను జరిపేందుకు ఒక అవకాశాన్ని అందించనుంది. ఈ ఆర్థిక సంవత్సరం లో విదేశీ పెట్టుబడులు, ఒక ఆర్థిక సంవత్సరం లోని మొదటి అయిదు నెలల కాలం లో చూసినప్పుడు, అత్యధిక స్థాయి లో అందాయి. విజిఐఆర్ 2020 ఈ కార్యక్రమం లో పాలుపంచుకొనే వారందరికీ భారతదేశం లో వాటి వాటి పెట్టుబడులను పెంచుకోవడం కోసం అవకాశాలకై ఎదురుచూస్తున్న అంతర్జాతీయ సంస్థాగత పెట్టుబడిదారులతో అనుబంధాన్ని ఏర్పరచుకొనేందుకు, అలాగే బలమైన భాగస్వామ్యాలను నిర్మించుకొనేందుకు కూడా ఒక అవకాశాన్ని అందించబోతోంది.