రాష్ట్రాల హోం మంత్రుల చింతన్ శిబిర్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 అక్టోబర్ 28వ తేదీ న ఉదయం దాదాపు గా పదిన్నర గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించనున్నారు. ఈ చింతన్ శిబిరాన్ని 2022 అక్టోబర్ 27వ, 28వ తేదీల లో హరియాణా లోని సూరజ్ కుండ్ లో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ చింతన్ శిబిరం లో వివిధ రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులు మరియు పోలీసు డైరెక్టర్ జనరల్స్ (డిజిపి లు) మరియు కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సిఎపిఎఫ్ లు) మరియు కేంద్ర పోలీసు సంస్థ (సిపిఒ) ల డైరెక్టర్ జనరల్స్ కూడా పాల్గొంటారు.
ఈ హోం మంత్రుల చింతన్ శిబిరం అనేది స్వాతంత్య్ర దినం సందర్భం లో ప్రధాన మంత్రి ప్రకటించిన పంచ్ ప్రణ్ కు అనుగుణం గా అంతర్గత భద్రత కు సంబంధించిన అంశాల పై విధాన రూపకల్పన పై జాతీయ దృక్పథాన్ని అందించడానికి జరుగుతున్న ఒక ప్రయాస గా ఉంది. సహకారాత్మక సమాఖ్య భావన కు తగినట్లుగా ఈ శిబిరం కేంద్రం, రాష్ట్రాల స్థాయి లో వివిధ స్టేక్ హోల్డర్స్ మధ్య ప్రణాళిక, ఇంకా సమన్వయం లో అధిక అవగాహన కు బాట ను పరచనుంది.
పోలీసు బలగాల ఆధునికీకరణ, సైబర్ అపరాధాల ను అరికట్టడం, అపరాధిక న్యాయ వ్యవస్థ లో పెరుగుతున్న ఐటి ఉపయోగం, భూ సరిహద్దు నిర్వహణ. తీరప్రాంతాల భద్రత, మహిళల భద్రత, మాదక పదార్థాల అమ్మకం, రవాణా లేదా చట్టవ్యతిరేకమైన మాదకద్రవ్యాల దిగుమతి ల వంటి అంశాల పై ఈ శిబిరం లో చర్చించడం జరుగుతుంది,