ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని భరూచ్ లో జరిగే ‘ఉత్కర్ష్ సమారోహ్’ ను ఉద్దేశించి 2022వ సంవత్సరం మే 12వ తేదీ నాడు ఉదయం 10:30 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. ఆ జిల్లా లో రాష్ట్ర ప్రభుత్వం అమలుపరచినటువంటి కీలక పథకాలు నాలుగు ఆపన్నుల కు సకాలం లో ఆర్థిక సహాయాన్ని అందించడం లో 100 శాతం దోహదపడ్డందుకు గుర్తు గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది.
భరూచ్ జిల్లా కు చెందిన పాలన యంత్రాంగం ఈ సంవత్సరం లో జనవరి 1వ తేదీ నుంచి మార్చి నెల 31వ తేదీ మధ్య కాలం లో ‘ఉత్కర్ష్ ఇనిశియేటివ్’ ను అమలుపరచింది. వితంతు మహిళల కు, వయస్సు మళ్లిన వారికి మరియు అనాథ పౌరుల కు సహాయాన్ని అందించేందుకు ఉద్దేశించిన పథకాల ను అమలు పరచడమన్నది దీని ధ్యేయం గా ఉంది. దీనిలో భాగం గా గంగ స్వరూప ఆర్థిక్ సహాయ్ యోజన, ఇందిరా గాంధీ వృద్ధ సహాయ్ యోజన, నిరాధార్ వృద్ధ్ ఆర్థిక్ సహాయ్ యోజన మరియు రాష్ట్రీయ్ కుటుంబ్ సహాయ్ యోజన అనేటటువంటి నాలుగు పథకాల కు గాను మొత్తం 12,854 మంది లబ్ధిదారుల ను గుర్తించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో భాగం గా, పథకం ప్రయోజనాల ను అందుకోనటువంటి వ్యక్తుల ను గురించిన సమాచారాన్ని సేకరించడాని కి తాలూకాల వారీగా వాట్సప్ హెల్ప్ లైన్ సంఖ్యల ను ప్రకటించడమైంది. జిల్లా లోని పూరపాలక ప్రాంత వార్డుల లోను, అన్ని గ్రామాల లోను ఉత్కర్ష్ శిబిరాల ను ఏర్పాటు చేశారు. ఆయా శిబిరాల లో అవసరపడ్డ దస్తావేజు పత్రాల ను దాఖలు చేసిన దరఖాస్తుదారుల కు అక్కడికక్కడే ఆమోదం తెలపడమైంది. ఈ కార్యక్రమాన్ని చురుకు గా ప్రజల లోకి తీసుకు పోవడానికి గాను ఉత్కర్ష్ సహాయకుల కు ప్రోత్సాహకాల ను కూడా ఇవ్వడం జరిగింది.