అఖిల భారత సభాధ్యక్షుల 80 వ సమావేశం ముగింపు సదస్సు ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 26 న మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.
ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ 1921 లో మొదలైంది. ఈ సంవత్సరాన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ వందో సంవత్సరం గా కూడా జరుపుతున్నారు. ఈ సందర్భం లో రెండు రోజుల సమావేశాన్ని ఈ నెల 25, 26 తేదీల లో గుజరాత్ లోని కేవడియా లో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సర సమావేశానికి ‘‘విధాన సభ/ విధాన మండలి, కార్యనిర్వహణ శాఖ మరియు న్యాయవ్యవస్థ ల మధ్య సామరస్యపూర్వక సమన్వయం- ఒక చైతన్యశీలమైన ప్రజాస్వామ్యానికి కీలకం’’ అనే అంశం ఇతివృత్తం గా ఉంది.
ఈ సమావేశాన్ని భారతదేశ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ఈ నెల 25 న ప్రారంభించనున్నారు. ఈ సమావేశానికి భారతదేశ ఉప రాష్ట్రపతి, రాజ్య సభ చైర్ మన్ శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్, సమావేశానికి చైర్‌పర్సన్ శ్రీ ఓం బిర్లా, గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవ్ వ్రత్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ లతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరు కానున్నారు.