నేచురల్ ఫార్మింగ్ కాన్ క్లేవ్ ను ఉద్దేశించి 2022వ సంవత్సరం జులై 10వ తేదీ న ఉదయం 11 గంటల 30 నిమిషాల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగం గా, 2022 మార్చి నెల లో జరిగిన గుజరాత్ పంచాయత్ మహాసమ్మేళన్ అప్పుడు తాను ఇచ్చిన ప్రసంగం లో ప్రతి ఊళ్లో కనీసం 75 మంది రైతులు వ్యవసాయాన్ని ప్రాకృతిక విధానం లో చేయడం మొదలుపెట్టాలి అంటూ ఉద్బోధించిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి చూపిన బాట లో , సూరత్ జిల్లా ఒక ఉమ్మడి ప్రయాస ను చేపట్టి, సమన్వయభరితమైనటువంటి చొరవ ను తీసుకొన్నది. అది ఏమిటి అంటే, రైతులు ప్రాకృతిక వ్యవసాయాన్ని స్వీకరించడం లో వారికి జిల్లా లోని సంబంధిత విభిన్న వర్గాల వారు, రైతు సమూహాల వంటి సంస్థలు, ఎన్నికైన ప్రతినిధులు, తలాటీ లు, వ్యవసాయ ఉత్పాదన ల మార్కెటింగ్ కమిటీ (ఎపిఎమ్ సీ) లు, బ్యాంకులు మొదలైనవి అన్నింటిని చైతన్య పరచడం, వాటిలో ప్రేరణ ను కలుగజేయడం అనేదే. తత్పర్యవసానంగా, ప్రతి గ్రామ పంచాయతీ లో కనీసం 75 మంది రైతుల ను గుర్తించి వారు ప్రాకృతిక వ్యవసాయాన్ని స్వీకరించేటట్టు ప్రేరేపణ ను కలిగించి మరి వారికి తగిన శిక్షణ ను కూడా ఇవ్వడం జరిగింది. రైతుల కు 90 వేరు వేరు క్లస్టర్ లలో శిక్షణ ను ఇవ్వడం తో జిల్లా వ్యాప్తం గా 41,000 కు పైగా రైతులు ఈ శిక్షణ ను పూర్తి చేసుకొన్నారు.
ఈ కాన్ క్లేవ్ ను గుజరాత్ లోని సూరత్ లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. సూరత్ లో ప్రాకృతిక వ్యవసాయాన్ని స్వీకరించి దానిని ఒక విజయ గాథ గా మలచిన వేల కొద్దీ రైతుల తో పాటుగా సంబంధిత ఇతర వర్గాల వారు ఈ కాన్ క్లేవ్ లో పాలుపంచుకోనున్నారు. గుజరాత్ గవర్నరు, గుజరాత్ ముఖ్యమంత్రి లు కూడా ఈ కాన్ క్లేవ్ లో పాల్గొంటారు.