ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈనెల 13 వ తేదీ ఉదయం 11 గంటలకు గుజరాత్‌లో ఇన్వెస్టర్ సమ్మిట్‌ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసంగించనున్నారు. వాలంటరీ వెహికిల్ ఫ్లీట్ మోడర్నైజేషన్ పథకం లేదా వెహికిల్ స్క్రాపింగ్ విధానం కింద పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఈ సమ్మిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ స్క్రాపింగ్ హబ్ అభివృద్ధి కోసం అలాంగ్‌లో షిప్ బ్రేకింగ్ పరిశ్రమ అందించే సదుపాయాలపై కూడా ఇది దృష్టిని ఆకర్షిస్తుంది.
ఈ సదస్సును రోడ్డు రవాణా , జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ , గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నాయి. ఈ సదస్సు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతుంది. ఇందులో కీలక ఇన్వెస్టర్లు, పరిశ్రమ నిపుణులు, కేంద్ర , రాష్ట్ర సంబంధిత మంత్రిత్వశాఖల అధికారులు పాల్గొననున్నారు.
రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ కేంద్ర మంత్రితో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి కూడా ఈ సదస్సులో పాల్గొంటారు.
వెహికిల్ స్క్రాపింగ్ విధానం గురించి.....
పనికిరాని, కాలుష్యకారక వాహనాలను పర్యావరణ హితకర రీతిలో రిజిస్టర్డ్ వెహికిల్ స్క్రాపింగ్ సదుపాయాలు, ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటు రూపంలో స్క్రాపింగ్ కు సంబంధించి మౌలిక సదుపాయాలకల్పనకు ఈ విధానాన్ని ఉద్దేశించారు.