ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజధాని నగరంలో భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఎఆర్ఐ) యొక్క పూసా ప్రాంగణంలో మార్చి నెల 17 వ తేదీన జరిగే వార్షిక ‘కృషి ఉన్నతి మేళా’ లో ప్రసంగించనున్నారు. ఆయన వ్యవసాయదారులను ఉద్దేశించి ఉపన్యాసమిస్తారు. సేంద్రియ వ్యవసాయం పై ఒక పోర్టల్ ను ఆవిష్కరిస్తారు. అలాగే, 25 కృషి విజ్ఞాన్ కేంద్రాలకు పునాదిరాయిని వేస్తారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ‘‘కృషి కర్మణ్’’మరియు ‘‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ కృషి విజ్ఞాన్ ప్రోత్సాహన్’’ అవార్డులను కూడా ప్రదానం చేస్తారు.
వ్యవసాయదారుల ఆదాయాన్ని 2020వ సంవత్సరం కల్లా రెట్టింపు చేయాలనేది ఈ మేళా యొక్క ఇతివృత్తంగా ఉంది. వ్యవసాయ రంగం మరియు అనుబంధిత రంగాలలో తాజా సాంకేతిక విజ్ఞాన సంబంధ పరిణామాల పట్ల వ్యవసాయదారులలో చైతన్యాన్ని వ్యాప్తి చేయడం కోసం ‘‘కృషి ఉన్నతి మేళా’’ను ఉద్దేశించారు.
వ్యవసాయదారుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, సూక్ష్మ సేద్యం పై ప్రత్యక్ష ప్రదర్శనలు, వ్యర్థ జలాల ఉపయోగం, పశు పోషణ, ఇంకా మత్స్య పరిశ్రమ.. వీటికి సంబంధించిన మండపాలు ఈ మేళా లో ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయి. విత్తనాలు, ఎరువుల మరియు కీటకనాశని లను గురించి వివరించే మండపాలను కూడా ఈ మేళాలో ఏర్పాటు చేయనున్నారు.