ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని లోథల్‌లోగల జాతీయ సముద్ర వారసత్వ ప్రదేశంలో కొనసాగుతున్న పనులను డ్రోన్ సదుపాయంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం అక్కడి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- ఈ ప్రాజెక్టు పనులు వేగంగా పురోగమించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. లోగడ ఎర్రకోట బురుజుల నుంచి తాను ప్రకటించిన ‘పంచ ప్రాణ్’ మంత్రంలో ‘మన వారసత్వంపై గర్వించడం’ కూడా ఒకటని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మన పూర్వికులు సంక్రమింపజేసిన ఆ వారసత్వ సంపదలో ‘సముద్ర వారసత్వం’ ఒక భాగమని పేర్కొన్నారు. “మనం మరచిన ఇలాంటి గాథలు మన చరిత్రలో అనేకం ఉన్నాయి. అలాగే వాటిని పరిరక్షించి, భవిష్యత్తరాలకు అందించే మార్గం అన్వేషించిన జాడ కూడా లేదు. ఆ చరిత్ర నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు… అదేవిధంగా సముద్ర వారసత్వంపైనా మనం పెద్దగా చర్చించుకున్న దాఖలాలు లేవు” అని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రాచీన కాలంలో ప్రపంచంలోని దాదాపు ప్రతి నాగరికతతో భారతదేశానికి విస్తృత వర్తక-వాణిజ్య సంబంధాలు ఉండేవని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే, వేల ఏళ్ల బానిసత్వంతో ఆ సంప్రదాయం విచ్ఛిన్నం కావడమేగాక మన వారసత్వం, సామర్థ్యాలపై ఉదాసీనత పెరిగిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.
వేల ఏళ్లు కొనసాగిన భారత సుసంపన్న, వైవిధ్యభరిత సముద్ర వారసత్వాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. దక్షిణ భారతంలో చోళ సామ్రాజ్యం, చేర-పాండ్య రాజవంశాలు సముద్ర వనరులకు గల శక్తిని అర్థం చేసుకుని, అత్యున్నత స్థాయిలో సద్వినియోగం చేసుకున్నట్లు ఆయన గుర్తుచేశారు. భారత్ నుంచి ప్రపంచం నలుమూలలకు వాణిజ్య విస్తరణసహా దేశం నావికాదళ శక్తుల బలోపేతానికి ఇది దారితీసిందని ప్రధాని వివరించారు. అందులో భాగంగా శక్తిమంతమైనా నావికాదళంతో విదేశీ ఆక్రమణదారులకు ముచ్చెమటలు పట్టించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. “భారతదేశ చరిత్రలో ఇదంతా గర్వించదగిన అధ్యాయమైనా, పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది” అని శ్రీ మోదీ తెలిపారు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతం ఒకనాడు భారీ ఓడల తయారీ కేంద్రంగా విలసిల్లిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఇటువంటి చారిత్రక ప్రాధాన్యంగల ప్రదేశాల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన నొక్కిచెప్పారు. “భారతదేశంలో తయారైన భారీ ఓడలు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యేవి. అలాంటి ఘనమైన వారసత్వం విషయంలో మన ఉదాసీనత దేశానికి ఎనలేని నష్టం చేసింది… ఈ పరిస్థితిని చక్కదిద్దాలి” అని ప్రధాని వ్యాఖ్యానించారు.
పురావస్తు శాఖ తవ్వకాలలో చారిత్రక ప్రాముఖ్యంగల అనేక ప్రదేశాలు వెలుగుచూశాయని ప్రధానంత్రి చెప్పారు. “దేశం గర్వించదగిన థోలవీరా, లోథల్ వంటి నాగరకత కేంద్రాల పూర్వ వైభవ పునరుద్ధరణకు మేం కృతనిశ్చయంతో ఉన్నాం. ఇప్పటికే ప్రారంభించిన ఈ కృషి ఇవాళ మరింత వేగంగా ముందుకు సాగుతోంది” అని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా లోథల్ ఒకప్పుడు భారత సముద్ర సంబంధిత శక్తియుక్తులకు కేంద్రంగా ఉండేదన్నారు. ఇటీవల రాష్ట్రంలోని వాద్‌నగర్‌లో తవ్వకాల సందర్భంగా సింకోతర్ మాత ఆలయం బయల్పడింది. పురాతన కాలంలో ఇక్కడినుంచి సముద్ర వాణిజ్యంపై సమాచారంగల కొన్ని ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. అలాగే సురేంద్రనగర్‌లోని జింఝువాడ గ్రామంలో ‘దీపస్తంభం (లైట్‌హౌస్) కూడా ఉండేదనడానికి రుజువులు లభించాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో లోథల్ వద్ద తవ్వకాల్లో బయల్పడిన ప్రాచీన నగరాలు, రేవులు, విపణుల నిర్మాణ ప్రణాళికల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చునని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు. “సింధు లోయ నాగరకతలో లోథల్ ప్రధాన వాణిజ్య కేంద్రంగానే కాకుండా భారత సముద్ర శక్తికి, దేశ సౌభాగ్యానికి ప్రతీకంగా ఉండేది” అని ఆయన చెప్పారు. ఈ ప్రాంతంపై లక్ష్మీ- సరస్వతుల కటాక్షం గురించి ఆయన వ్యాఖ్యానిస్తూ- లోథల్ ఓడరేవులో 84 దేశాల జెండాలు ఉండేవని, 80 దేశాల నుంచి వచ్చిన విద్యార్థులతో వలభి ప్రధాన విద్యాకేంద్రంగా ఉండేదని అన్నారు.
వైవిధ్యభరిత భారతదేశ సముద్ర చరిత్రను తెలుసుకోవడానికి, కూలంకషంగా అర్థం చేసుకోవడానికి లోథల్‌లోని జాతీయ సముద్ర వారసత్వ ప్రాంగణం ఓ కేంద్రం కాగలదని ప్రధానమంత్రి అన్నారు. దేశంలోని సామాన్యులు కూడా ఈ చరిత్రను సులువుగా అర్థం చేసుకోగలిగేలా ఈ వారసత్వ ప్రాంగణం నిర్మించబడుతుందని ఆయన వివరించారు. ఈ మేరకు అత్యాధునిక పరిజ్ఞానంతో ప్రాచీన కాలపు రూపురేఖల పునరుద్ధరణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. లోథల్ పూర్వ వైభవం దిశగా ఈ ప్రాంగణ నిర్మాణానికి మాత్రమే పరిమితం కావడం లేదని ప్రధానమంత్రి చెప్పారు. దీంతోపాటు గుజరాత్ సముద్ర తీరంలో అనే ఆధునిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని గుర్తుచేశారు. ఇందులో భాగంగా సెమి-కండక్టర్ తయారీ కర్మాగారం ఏర్పాటు కానున్నదని పేర్కొన్నారు. “వెయ్యేళ్ల కిందటే అభివృద్ధి చెందినదిగా విలసిల్లిన ఈ ప్రాంత ఉజ్వల చరిత్ర పునరుద్ధరణకు మా ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. తన చరిత్రతో మనకు గర్వకారణంగా నిలిచిన లోథల్ ఇక రాబోయే తరాల భవిష్యత్తును రూపొందిస్తుంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
ప్రదర్శనశాల అంటే- కేవలం వస్తువులు లేదా పత్రాలను భద్రపరిచి, ప్రదర్శించే ప్రదేశం కాదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మనం మన వారసత్వాన్ని గౌరవిస్తే దానితో ముడిపడిన భావాలను కూడా కాపాడుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు భారతదేశ గిరిజన వారసత్వం గురించి ప్రస్తావిస్తూ- దేశవ్యాప్తంగా గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల సంగ్రహాలయాల గురించి శ్రీ మోదీ వెల్లడించారు. అలాగే స్వాతంత్ర్య పోరాటంలో గిరిజన యోధుల సేవలను ఆయన ప్రస్తుతిస్తూ వారి త్యాగాలను కూడా ప్రస్తావించారు. అలాగే మన యుద్ధవీరుల త్యాగాలను గుర్తుచేస్తూ- భరతమాత వీరపుత్రులు, పుత్రికలకు జాతీయ యుద్ధ స్మారకం, జాతీయ పోలీస్ స్మారకాలు నిలువెత్తు నిదర్శనాలని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్య సామర్థ్యం గురించి ప్రస్తావిస్తూ- ప్రధానమంత్రి సంగ్రహాలయం గురించి వివరించారు. స్వాతంత్ర్యానంతరం 75 ఏళ్ల దేశ ప్రగతి పయనాన్ని ఇది గుర్తుచేస్తుందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో సమైక్యత-సమగ్రతల కోసం సాగిన కృషి, దృఢ సంకల్పం, దీక్ష ఎంతటివో కేవడియాలోని ఏక్తా నగర్, ఐక్యతా విగ్రహం మనకు గుర్తుచేస్తాయని ప్రధానమంత్రి అన్నారు. “దేశవ్యాప్తంగా 8 ఏళ్లలో అభివృద్ధి చేయబడిన వారసత్వం భారతదేశ విస్తృత వారసత్వంపై సంగ్రహావలోకనం ఇవ్వగలదు” అని ఆయన వ్యాఖ్యానించారు.
దేశ సముద్ర వారసత్వం విషయానికొస్తే- లోథల్‌లో నిర్మిస్తున్న జాతీయ సముద్ర ప్రదర్శనశాల ప్రతి భారతీయుడూ గర్వించదగినదిగా రూపొందుతుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. “లోథల్ పూర్వవైభవంతో ప్రపంచం ముందుకొస్తుందని నేను నూటికి నూరుపాళ్లూ విశ్వసిస్తున్నాను” అంటూ ప్రధాని తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రులు శ్రీ మన్సుఖ్ మాండవీయ, శ్రీ సర్బానంద సోనోవాల్ కూడా వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా పాల్గొన్నారు.
నేపథ్యం
హరప్పా నాగరకత కాలంలోని ప్రముఖ నగరాల్లో లోథల్ ఒకటి కావడంతోపాటు తవ్వకాల సందర్భంగా పురాతన మానవ నిర్మిత ఓడరేవు బయల్పడటంతో మరింత ప్రసిద్ధికెక్కింది. ఇక్కడి సముద్ర వారసత్వ ప్రాంగణం ఈ నగర ప్రాచీన చారిత్రక సంపద-వారసత్వాలకు తగిన నివాళి. ఈ నేపథ్యంలో ఇక్కడ నిర్మితమవుతున్న జాతీయ సముద్ర వారసత్వ ప్రాంగణం (ఎన్‌హెచ్‌ఎంసీ) భారతదేశపు గొప్ప-వైవిధ్యభరిత సముద్ర వారసత్వాన్ని కళ్లకు కడుతుంది. అంతేకాకుండా లోథల్ అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా ఉద్భవించడంలో తోడ్పడే ప్రాజెక్టుగా ఇది రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా పర్యాటకుల రాక పెరిగితే, ఈ ప్రాంతం ఆర్థికంగానూ అభివృద్ధి చెందుతుంది.
ఈ ప్రాంగణం పనులు రూ.3,500 కోట్ల అంచనా వ్యయంతో 2022 మార్చిలో ప్రారంభమయ్యాయి. ఇక్కడ హరప్పా వాస్తుశిల్పం, జీవనశైలి పునఃసృష్టికి తగినట్లుగా లోథల్ సూక్ష్మ వినోద కేంద్రం, నాలుగు థీమ్ పార్కులు- స్మారక, సముద్ర-నావికా వాతావరణ పార్కులు ఏర్పాటవుతాయి. వీటితోపాటు సాహస-వినోద థీమ్ పార్క్ వంటి అనేక వినూత్న, విశిష్టాంశాలు ఈ ప్రాజక్టులో భాగంగా ఉంటాయి. అలాగే ప్రపంచంలో అత్యంత ఎత్తయిన దీపస్తంభ (లైట్‌హౌస్ మ్యూజియం) ప్రదర్శన శాల, భారత సముద్ర వారసత్వాన్ని చాటే 14 గ్యాలరీలు ఉంటాయి. అలాగే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల విభిన్న సముద్ర వారసత్వాన్ని ప్రతిబింబించే తీర రాష్ట్రాల పెవిలియన్ కూడా ఉంటుంది.
India's maritime history... It is our heritage that has been little talked about. pic.twitter.com/c0GXThIPd5
— PMO India (@PMOIndia) October 18, 2022
India has had a rich and diverse maritime heritage since thousands of years. pic.twitter.com/glpVGTX2CO
— PMO India (@PMOIndia) October 18, 2022
Government is committed to revamp sites of historical significance. pic.twitter.com/OUQsLJrz3b
— PMO India (@PMOIndia) October 18, 2022
Archaeological excavations have unearthed several sites of historical relevance. pic.twitter.com/cf4Oc7kCcF
— PMO India (@PMOIndia) October 18, 2022
Lothal was a thriving centre of India's maritime capability. pic.twitter.com/92J13bVLGT
— PMO India (@PMOIndia) October 18, 2022
National Maritime Heritage Complex at Lothal will act as a centre for learning and understanding of India's diverse maritime history. pic.twitter.com/PMGHxWI3YJ
— PMO India (@PMOIndia) October 18, 2022