న్యూఢిల్లీలోని కేంద్రమంత్రి శ్రీ ఎల్.మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ ఒక్కరికీ పొంగల్ శుభాకాంక్షలు తెలియచేశారు. తమిళనాడులోని ప్రతీ ఒక్క ఇంటిలోనూ పొంగల్ పండుగ ఉత్సాహం కనిపిస్తుందని ఆయన అన్నారు. పౌరులందరి జీవితాల్లోనూ ఆనందం, సుసంపన్నత, సంతృప్తి ఏరులై పారాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు. నిన్న జరిగిన లోహ్రి వేడుకలు, మకర ఉత్తరాయణ ప్రవేశాన్ని పురస్కరించుకుని రేపు జరిగే మకర సంక్రాంతి, త్వరలో రానున్న మాఘ బిహు వంటి పవిత్ర పండుగల సందర్భంగా దేశ పౌరులందరికీ శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలియచేశారు.
గత ఏడాది తమిళ పుత్తండు వేడుకలకు హాజరైన వారిని నేడు కూడా చూడడం పట్ల ప్రధానమంత్రి శ్రీ మోదీ హర్షం ప్రకటించారు. నేటి ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానించినందుకు కేంద్ర మంత్రి శ్రీ ఎల్.మురుగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఇది కుటుంబం, బంధుమిత్రులతో వేడుకలు చేసుకోవడంతో సమానమన్నారు.
ప్రముఖ కవి తిరువళ్లువార్ ను ఉటంకిస్తూ జాతి నిర్మాణంలో విద్యావంతులైన పౌరులు, నిజాయతీపరులైన వ్యాపారవేత్తలు, మంచి పంటల పాత్రను గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. పొంగల్ సందర్భంగా తాజా పంటలను భగవంతునికి నివేదిస్తారన్న విషయం గుర్తు చేస్తూ ‘‘అన్నదాత కిసాన్’’లను ఈ వేడుకలన్నింటికీ కేంద్రస్థానంగా నిలపడమే ఈ సాంప్రదాయంలోని విశిష్టత అని ఆయన అన్నారు. దేశంలోని ఏ ప్రాంతంలో జరిగే పండుగలకైనా గ్రామాలు, పంటలు, రైతులతో సంబంధాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలో తాను చిరుధాన్యాలు, తమిళ సాంప్రదాయాలకు మధ్య గల సంబంధాన్ని ప్రస్తావించిన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. సూపర్ ఫుడ్ శ్రీ అన్న పట్ల దేశంలో ఏర్పడిన చైతన్యం పట్ల ఆయన హర్షం ప్రకటిస్తూ ఈ శ్రీ అన్నను ఆధారం చేసుకునే పలువురు ఔత్సాహిక పారిశ్రామికులు స్టార్టప్ లు ప్రారంభించారని చెప్పారు. దేశంలో ప్రస్తుతం 3 కోట్ల మందికి పైగా రైతులు చిరుధాన్యాల వ్యవసాయం చేస్తున్నారంటూ చిరుధాన్యాలకు కల్పించిన ప్రోత్సాహంతో వారందరూ ప్రత్యక్షంగా లబ్ధి పొందారని చెప్పారు.
తమిళ సమాజానికి చెందిన ప్రతీ ఒక్కరి ఇళ్ల ముందు ముగ్గులు వేసే సాంప్రదాయం గురించి ప్రస్తావిస్తూ ఆ ముగ్గుల విశిష్టతను కొనియాడారు. ముగ్గు వేసే ప్రక్రియలో భాగంగా ఇంటి ముందు నేలపై అనేక చుక్కలు పెడతారని, ఈ చుక్కలు కూడా ఎవరికి వారు వేర్వేరు డిజైన్లలో పెట్టి ఆ చుక్కలన్నింటినీ కలుపుతారని అన్నారు. అలా చుక్కలన్నింటినీ కలిపిన తర్వాత వాటిలో రంగులు అద్దిన అనంతరం వాటికి ఒక అద్భుతమైన రూపం ఏర్పడుతుందంటూ ఇదంతా వారిలోని కళా నైపుణ్యానికి నిదర్శనమని చెప్పారు. ఈ ముగ్గులోని చుక్కలకు, భారతదేశంలోని వైవిధ్యానికి పోలికను వివరిస్తూ ఈ ముగ్గు వలెనే దేశంలోని ప్రతీ ఒక్క ప్రాంతానికి చెందిన ప్రజలు భావోద్వేగపరంగా పరస్పరం అనుసంధానమై ఉంటారని, జాతి బలం అంతా ఇందులో కొత్త రూపంలో కనిపిస్తుందని ఆయన వివరించారు. ‘‘ఈ పొంగల్ పండుగ ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ జాతీయతా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది’’ అని శ్రీ మోదీ అన్నారు. కాశీ-తమిళ సంగమం, సౌరాష్ట్ర-తమిళ సంగమం ప్రారంభించడంలో కూడా ఇదే సాంప్రదాయం ప్రతిబింబిస్తుందంటూ ఇందులో తమిళ సమాజానికి సంబంధించిన ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారని చెప్పారు.
‘‘2047 నాటికి వికసిత్ నిర్మాణం వెనుక అతి పెద్ద శక్తి ఐక్యతా భావమే. నేను ఎర్రకోట నుంచి ప్రవచించిన పంచప్రాణ లక్ష్యం కూడా దేశంలో ఐక్యతను ప్రేరేపించి, శక్తివంతం చేయడమే’’ అని ప్రధానమంత్రి చెప్పారు. ఈ పొంగల్ పండుగ సందర్భంగా జాతి ఐక్యతను పటిష్ఠం చేస్తామన్న సంకల్పానికి మనందరం పునరంకితం కావాలి అన్న పిలుపుతో ఆయన ముగించారు.