ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ముంబైలోని గుందావ్లీ మెట్రో స్టేషన్ నుంచి మోగ్రా వరకూ మెట్రో రైలులో ప్రయాణించారు. అంతకుముందు ‘ముంబై 1’ మొబైల్ యాప్, ‘నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్’- (ఎన్‌సిఎంసి-ముంబై 1)ను ఆయన ప్రారంభించారు. అనంతరం మెట్రో ఫోటో ప్రదర్శనను తిలకించి, 3డి నమూనాను పరిశీలించారు. మెట్రో రైలులో విద్యార్థులు, ఇతర ప్రయాణికులతోపాటు మెట్రో నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులతో ప్రధాని ఈ సందర్బంగా ముచ్చటించారు. ప్రధాని వెంట మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోష్యారీ, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్ మెట్రో ప్రయాణం చేశారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్ ద్వారా:
“ముంబైలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెట్రో రైలు ప్రయాణం” అని పేర్కొంది.
PM @narendramodi on board the Metro in Mumbai. pic.twitter.com/nE03O7nDmW
— PMO India (@PMOIndia) January 19, 2023
అంతకుముందు ముంబై మెట్రో రైలు “2ఎ, 7” మార్గాలను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. దీంతోపాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, 7 మురుగుశుద్ధి ప్లాంట్ల పునరాభివృద్ధికి ఆయన శంకుస్థాపన చేశారు, అలాగే 20 “హిందూ హృదయసామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే ఆప్లా దవాఖానా”లను, ముంబైలో దాదాపు 400 కిలోమీటర్ల సిమెంటు రోడ్ల ప్రాజెక్టును కూడా ప్రారంభించారు.
నేపథ్యం
ప్రధానమంత్రి ‘ముంబై 1’ మొబైల్ యాప్, జాతీయ సార్వత్రిక ప్రయాణ కార్డు (ముంబై 1)ను ఆవిష్కరించారు. ఈ మొబైల్ యాప్ ద్వారా ప్రజలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుంది. ఈ కార్డుతో మెట్రో స్టేషన్లలో సులభ ప్రవేశంతోపాటు యూపీఐ ద్వారా టికెట్ తీసుకునేందుకు డిజిటల్ చెల్లింపు చేయవచ్చు. ఇక సార్వత్రిక ప్రయాణ కార్డును (ఎన్‌సిఎంసి-ముంబై 1) ప్రస్తుతం మెట్రో మార్గాల్లో వాడుకోవచ్చు. ఆ తర్వాత క్రమంగా స్థానిక రైళ్లు, బస్సులు వంటి ఇతర ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణానికీ వాడుకునే వీలు కల్పిస్తారు. దీంతో ప్రయాణికులు రకరకాల కార్డులు లేదా నగదు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ‘ఎన్‌సిఎంసి’ కార్డుతో స్పర్శరహిత, డిజిటల్ లావాదేవీలు వేగంగా నిర్వహించుకోవచ్చు. తద్వారా చెల్లింపు ప్రక్రియ సౌలభ్యంతోపాటు నిరంతరాయ సేవలు పొందవచ్చు.