ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ రోజు, రష్యా సమాఖ్య అధ్యక్షుడు గౌరవనీయులు వ్లాదిమిర్ పుతిన్ తో టెలిఫోన్ లో సంభాషించారు.
ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న కోవిడ్-19 మహమ్మారి పరిస్థితిపై ఇరువురు నాయకులు చర్చించారు. భారత ప్రజలకు, ప్రభుత్వానికీ సంఘీభావం తెలియజేస్తూ, ఈ విషయంలో రష్యా అన్ని విధాలా సహకరిస్తుందని, అధ్యక్షుడు పుతిన్, తెలియజేశారు. అధ్యక్షుడు పుతిన్ కు, ప్రధానమంత్రి మోదీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, భారతదేశానికి సకాలంలో, రష్యా అందిస్తున్న మద్దతు మన ఇరుదేశాల నిరంతర భాగస్వామ్యానికి ప్రతీక అని అభివర్ణించారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ మహమ్మారి పై పోరాటానికి, తమ దేశాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని ఇరువురు నాయకులు గుర్తించారు. భారతదేశంలో స్పుత్నిక్-వి టీకాను అత్యవసరంగా ఉపయోగించటానికి ఆమోదించడాన్ని, అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించారు. భారతదేశం, రష్యాతో పాటు ఇతర దేశాల్లో ఉపయోగం కోసం రష్యాకు చెందిన ఈ టీకా ను భారతదేశంలో తయారు చేయడం జరుగుతుందని, ఇరువురు నాయకులు పేర్కొన్నారు.
ఇరుదేశాల మధ్య నెలకొన్న ప్రత్యేకమైన, విశేష భాగస్వామ్య స్ఫూర్తితో వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి ఇరువురు నాయకులు ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. భారతదేశం యొక్క గగన్ యాన్ కార్యక్రమానికి రష్యా నుండి లభించిన మద్దతుతో పాటు, నలుగురు గగన్ యాన్ వ్యోమగాములకు, రష్యా శిక్షణ పూర్తి చేసినందుకు ప్రధానమంత్రి మోదీ ప్రశంసలు తెలిపారు.
హైడ్రోజన్ ఆర్థిక వ్యవస్థతో సహా పునరుత్పాదక ఇంధన రంగంలో సహకారాన్ని పెంచే అవకాశాన్ని నాయకులు గుర్తించారు.
రెండు దేశాలకు చెందిన విదేశీ వ్యవహారాలూ, రక్షణ శాఖల మంత్రులతో కూడిన మంత్రుల స్థాయి నూతన 2 + 2 సంభాషణను ఏర్పాటు చేయాలని నాయకులు నిర్ణయించారు.
2019 సెప్టెంబర్ లో వ్లాడివోస్టాక్‌లో జరిగిన చివరి సదస్సులో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను ఇరువురు నాయకులు గుర్తు చేసుకున్నారు. ద్వైపాక్షిక సదస్సు కోసం ఈ ఏడాది చివర్లో అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా, వారి వ్యక్తిగత మరియు నమ్మకమైన సంభాషణను కొనసాగించడానికి ఇది ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. భారతదేశం అధ్యక్షతన 2021 లో జరిగే, బ్రిక్స్ సమావేశం విజయవంతమవుతుందని, రష్యా ప్రధానమంత్రి పుతిన్ హామీ ఇచ్చారు. ద్వైపాక్షిక మరియు అంతర్జాతీయ సమస్యల పై మరింత సన్నిహితంగా ఉండటానికి ఇరువురు నాయకులు అంగీకరించారు.